ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు. అయితే కరువు, విత్తనాల కొరతపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు ఆ అంశాలపై చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌... ప్రశ్నోత్తరాల సమయం అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని సూచించారు. ఈ సందర్భంగా సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జోక్యం చేసుకుని, కావాలనే టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బీఏసీలో నిర్ణయించినట్లుగానే సమావేశాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం కరువుపై చర్చిద్దామని మంత్రి బుగ్గన తెలిపారు.

ప్రశ్నోత్తరాల అనంతరం ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. మరోవైపు నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా సమర్పిస్తారు. శాసనమండలి సమావేశాలు 10 గంటలకు ప్రారంభం అయ్యాయి.

Back to Top