సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా ఉన్నవారికి అవార్డులు

వైయ‌స్ఆర్‌ అచీవ్‌మెంట్‌-2022 అవార్డుల ప్రదానోత్స‌వంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

వివిధ రంగాల్లో సేవలందించిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు 

20 వైయ‌స్ఆర్‌ జీవిత సాఫల్య, 10 వైయ‌స్ఆర్‌ సాఫల్య అవార్డులు  

ముఖ్య అతిథిగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ఆత్మీయ అతిథిగా వైయ‌స్‌ విజయమ్మ హాజరు 

అవార్డుల ప్రదానోత్సవానికి విశిష్ట అతిథిగా సీఎం వైయ‌స్ జగన్‌  

 అమరావతి: సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా ఉన్నవారికి వైయ‌స్ఆర్‌ అచీవ్‌మెంట్‌-2022 అవార్డులు అంద‌జేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. అవార్డులు అందుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైయ‌స్ఆర్‌ జీవిత సాఫల్య, వైయ‌స్ఆర్‌ సాఫల్య–2022’ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుసగా రెండో ఏడాది ఈ అవార్డులు అందిస్తోంది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత  ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైయ‌స్‌ విజయమ్మ హాజరయ్యారు. 
 

ఈ సందర్భంగా  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలు వైఎస్సార్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ కార్యక్రమాల ప్రదాన కార్యక్రమానికి విచ్చేసిన మాన్యులు, పెద్దలు గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గారికి, అమ్మకు, నా మంత్రివర్గ సహచరులకు, నాయకులకు, అధికారులకు, సిబ్బందికి, కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మీ సేవలకు వందనం...
సమాజం కోసం శ్రమించిన, శ్రమిస్తున్న మహనీయులందరికీ ఈ అవార్డులు అందుకునేందుకు ఇక్కడికి మీ కుటుంబ సభ్యులతో వచ్చిన ప్రతి ఒక్కరికీ స్వాగతం. మీ సేవలకు వందనం.
సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు, అసామాన్య సేవలందిస్తున్న మానవతా మూర్తులకు వరుసగా రెండో ఏడాది  రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌) అత్యున్నత అవార్డులను ప్రదానం చేస్తున్నాం. ఈ అవార్డులను వ్యక్తులగా, సంస్ధలగా వారు చేసిన గొప్ప పనులకు ప్రదానం చేస్తున్నాం.

చరిత్ర లిఖిస్తున్న రైతులకు, రక్షణ సారధులకూ....
ఈ అవార్డులు తమ శ్రమతో, స్వేదంతో మనరాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో ఇస్తున్నాం. ఈ అవార్డులు మన సంస్కృతి, సాంప్రదాయాలకు దశాబ్దాలుగా వారధులుగా ఉన్నవారికి ఇస్తున్నాం. ఈ అవార్డులు మన మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారధులకు ఇస్తున్నాం.ఈ అవార్డులు వెనుకబాటు మీద, అణిచివేత మీద, పెత్తందారీ పోకడల మీద దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులకు, భిన్నమైన కళాలకు, గళాలకు, పాత్రికేయులకు ఈ అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డులు మన గడ్డమీద పుట్టి, వైద్య ఆరోగ్యరంగంలో మనిషి ప్రాణాలు నిలబెట్టడంలో అంతర్జాతీయ కీర్తి గడించిన మహామహులకు, అంతర్జాతీయంగా కీర్తి గడించిన మన పారిశ్రామిక దిగ్గజాలకు.. మనం ఈరోజు ఆందరిలో కొందరిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తున్నాం.

ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పడానికి...
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆవార్డులు ప్రతి సంవత్సరం ఎందుకు ఇస్తున్నామంటే దానికి కారణం... మన ప్రభుత్వం ఇటువంటి సేవలను గుర్తిస్తుంది అని చెప్పడానికీ, మన ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులకు అందరికీ కూడా తోడుగా ఉంటుందని సంకేతం ఇవ్వడానికి ప్రతి సంవత్సరం నాన్నగారి పేరుమీద, ఒక మహానేత పేరు మీద ఇస్తున్నాం. 
తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 నెలల కాలంలో తాను ఆచరించి చూపిన రైతు పక్షపాత, మహిళా పక్షపాత, నిరుపేద పక్షపాత విధానాలకు, సామాజిక న్యాయానికి, ప్రాంతీయ న్యాయానికి,  వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవానికి, మనదైన తెలుగుదనానికి, మన కళలు, సాంప్రదాయాలకు, మన శ్రమకు, పరిశ్రమకు ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ అవార్డులు ఇస్తున్నాం. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ మరోసారి నా తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top