మెడికల్ కాలేజీలను మంత్రి నారాయణకు అప్పగించే కుట్ర 

అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  

అనంతపురం:   రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలు, అనుచరులకు కట్టబెట్టేందుకే మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే కేబినెట్‌ నిర్ణయాలు ఉన్నాయన్నారు. శుక్రవారం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటోందన్నారు. ‘‘పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని చేరువ చేయడానికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మధ్య తరగతి కుటుంబాలు ఇప్పటి వరకు రష్యా, ఫిలిప్పీన్‌ వంటి దేశాలకు వెళ్లి వైద్య విద్య అభ్యసించే పరిస్థితి ఉండేవి. ఇలాంటి తరుణంలో వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్‌ సీట్లు  అందుబాటులోకి తెచ్చారు. తాజాగా కూటమి ప్రభుత్వం 10 మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడానికి కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం దారుణం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తారు. తన కేబినెట్‌లో ఉన్న మంత్రి నారాయణ, విద్యా సంస్థలు నడుపుతున్న వారికి మెడికల్‌ కళాశాలలను ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పులివెందుల మెడికల్‌ కళాశాలకు మంజూరైన అనుమతులను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే కేబినెట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్‌ కళాశాలలు నిర్వహించాలి. వాస్తవానికి 2019 వరకు రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు మాత్రమే ఉండి అందులో 2185 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉండేవి. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక 2550 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూర్చేలా 17 మెడికల్‌ కళాశాలలకు శ్రీకారం చుడితే వాటిలో 10 కళాశాలలను ఈ ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండలో నిర్మాణంలో ఉన్న కళాశాలను కూడా పీపీపీ పేరుతో ప్రైవేట్‌కు అప్పగిస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేదలకు వైద్యాన్ని చేరువ చేయడం కోసం తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచింది. 2019 వరకు 1059 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు అందిస్తే వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక 3257 వ్యాధులకు చికిత్సలు అందించారు. కోవిడ్‌ వంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ అండగా నిలిచింది. గతంలో రూ.3 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తే జగన్‌ హయాంలో దాన్ని రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా అందజేశారు. ఆరోగ్యశ్రీ పథకం కవరేజీ కూడా రూ.25 లక్షల వరకు అందజేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా కిందకు తీసుకొస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోకపోతే ప్రజా సంఘాలు, ఇతర పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం’’ అని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top