పల్నాడు: ఎన్ని కేసులు పెట్టిన భయపడబోమని, ఎన్ని కష్టాలు ఎదురైనా వైయస్ జగన్ వెంటే నడుస్తామని వైయస్ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని స్పష్టం చేశారు. సోమవారం సత్తెనపల్లి గ్రామీణ పీఎస్‌లో విచారణకు హాజరైన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘‘వైయస్ జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్‌లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు. కానీ మేము ఇలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సత్తెనపల్లి శాసన సభ్యులుగా గెలిచింది. ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు. డీఎన్‌ఆర్ అనే వ్యక్తి సత్తెనపల్లిలో పెత్తనం చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో కొనసాగుతోంది మిలిటరీ పాలన. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పి తీరుతాం. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేస్తాం`` అని అన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘‘రెంటపాళల్లో పోలీసులు, కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక వైయస్ఆర్‌సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైయస్ జగన్ వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్లను పరామర్శించడానికి వెళ్తే.. మా మీదే కేసులు పెడుతున్నారు. వైయస్ జగన్ అంటేనే జనం. అలాంటి నాయకుడి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పెద్దలు ఒక కట్టు కథ అల్లడం.. దానికి స్కామ్ అని పేరు పెట్టి వైయస్ఆర్‌సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు. వైయస్ జగన్ మళ్లీ సీఎం అయ్యే దాకా.. ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం`` అని ఆమె స్పష్టం చేశారు.