చిరు బాటలో మీరు పైకొచ్చారు

నేను కష్టంతో పైకి వచ్చా

పవన్‌ సినిమాల్లోకి రాకముందే నేను మంచి పొజిషన్‌లో ఉన్నా

ఆయన నాకెలా సాయం చేశారో చెప్పాలి

అమరావతి: రాజమండ్రి సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత అలీ అభ్యంతరం తెలిపారు. తాను ఈ ఎన్నికల ప్రచారంలో పవన్‌కల్యాణ్, లేదా ఆయన పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదని అయినా ఆయన తననుద్దేశించి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈమేరకు  అలీ ఒక వీడియోను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్, తన అన్న చిరంజీవి వేసిన బాటలో పైకి వచ్చారని, కానీ తాను అలా కాదని తన కష్టంతోనే సినీ పరిశ్రమలో పైకొచ్చానన్నారు. తనకేదో ఆయన సాయపడినట్లుగా చెప్పుకున్నారని, అది వాస్తవం కాదన్నారు.

పవన్‌ సినీరంగంలోకి అడుగు పెట్టే నాటికే తాను పరిశ్రమలో ఒక స్థానం సంపాదించుకున్నానని గుర్తుచేశారు. ‘ఏ రకంగా పవన్‌ నాకు సాయపడ్డారు. ఏమైనా సినిమాలు లేకుంటే  ఇప్పించారా? కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా? లేక ఇంకేమైనా సాయం చేశారా?’ అని అలీ  ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టినపుడు తాను ఆయన కార్యాలయానికి వెళ్లి ఖురాన్‌ ప్రతిని, ఖర్జూరాలను ఇచ్చి అభినందించి వచ్చానన్నారు. ‘నేను వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరకూడదా ? అదేమైనా తప్పా? రాజ్యాంగ విరుద్ధమా?’ అని అలీ పవన్‌ను ప్రశ్నించారు.  తన చుట్టం టికెట్‌ అడిగితే ఇచ్చానని, అలాంటిది అలీ అడిగితే ఇవ్వనా అని పవన్‌ వ్యాఖ్యలు చేశారని... తన ఫోన్‌ నంబర్‌ ఆయన వద్ద లేదా? అని అలీ ప్రశ్నించారు.

Back to Top