గుంటూరు: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, ఏఐ వీడియోలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అడిషనల్ ఎస్పీని కలిసి వైయస్ఆర్‌సీపీ నేతలు నాలుగు ఫిర్యాదులు అందజేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైయస్ఆర్‌సీపీ నేతలు అన్నాబత్తుని శివకుమార్, నూరి ఫాతిమా, బాల వజ్రబాబు గుంటూరు అడిషనల్ ఎస్పీని కలిసి మూడు ఫిర్యాదులు అందజేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అవమానించేలా ఏఐ సాంకేతికతతో వీడియోలు రూపొందించడం, అసభ్యకర పోస్టులు పెట్టడం, ఆయన ప్రతిష్టను దిగజార్చేలా మార్ఫింగ్ ఫొటోలు, పాత్రలతో వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం వైఎస్ జగన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్టులు చేస్తోందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి వ్యవహారాలపై ఫిర్యాదులు ఇచ్చామని, ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. వ్యంగ్య పోస్టుపై రెండు కేసులు ఎలా? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తాను వ్యంగ్యంగా పెట్టిన పోస్టుకు సంబంధించి రెండు కేసులు నమోదు చేయడాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఒకే అంశంపై రెండు కేసులు నమోదు చేయకూడదని చట్టం చెబుతున్నప్పటికీ తనపై రెండు కేసులు పెట్టారని తెలిపారు. ఈ అంశంపై కూడా అడిషనల్ ఎస్పీకి నాలుగో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన ఇంటిపై జరిగిన దాడి వెనుక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కుట్ర ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. పెమ్మసాని చంద్రశేఖర్ తనకు సినిమా చూపిస్తానని చెప్పిన తర్వాతే తన ఇంటిపై దాడి జరిగిందని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ నేతలపై కేసులు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, టీడీపీ నాయకులు రోడ్లకు అడ్డంగా టెంట్లు వేసి కార్యక్రమాలు నిర్వహించినా పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించే వైయస్ఆర్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తూ, టీడీపీ నాయకుల విషయంలో మాత్రం పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఏ న్యాయమని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అధికార పార్టీ సోషల్ మీడియా దూషణలు, మార్ఫింగ్ పోస్టులు, ఏఐ వీడియోలపై కూడా పోలీసులు అదే స్థాయిలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా పోస్టులు చేస్తున్న వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, తమ ఫిర్యాదులపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు.