తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి.. – పోలింగ్ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్ – పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్ – పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ – ఆరోజు పోలింగ్ బూతుల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు. జాబితా – పోలింగ్ ఆఫీసర్ (పీఓ) డైరీ – ఫామ్–12. ఫామ్–32. ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని (ఎస్‌ఈసీ)కి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలని వాటిలో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైయస్ఆర్‌సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్‌ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్‌ఈసీ పట్టించుకోలేదు. ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్ బూత్‌లోకి వైయస్ఆర్‌పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. వారి నుంచి ఏజెంట్ అధీకృత ఫామ్స్ లాగేసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులెవ్వరూ ఓటు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చివరకు పులివెందులలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డిని కూడా ఓటు వేయనీయలేదు. ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు కదలనీయలేదు. ప్రతిచోటా పోలీసు బలగాలను ఉపయోగించారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా, ఎస్‌ఈసీకి వినతిపత్రం అందజేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైయస్ఆర్‌సీపీ రెండు లేఖల ద్వారా ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేసింది.