నారారూప రాక్షసులు.. నాశనం చేస్తారు

పొరపాటున వీళ్లను నమ్మి మరోసారి మోసపోవద్దు

ప్రతి ఇంటికి చంద్రబాబు రూ. లక్షల్లో బాకీ

ఓట్ల కోసం టీడీపీ నేతలు వస్తే నిలదీయండి

రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న సీఎం కావాలి

వైయస్‌ఆర్‌ సీపీని ఆదరించండి.. అన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి

గుడివాడ ప్రచార సభలో వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల

గుడివాడ: తండ్రీకొడుకులు కలిసి ఆంధ్రరాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పొరపాటున చంద్రబాబు, లోకేష్‌లను నమ్మి మన భవిష్యత్తును వాళ్ల చేతుల్లో నారా రూప రాక్షసులు మన జీవితాలను నాశనం చేస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో వైయస్‌ షర్మిల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని శ్రమించిన మహానుభావుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌. నీది కులం, ఏ మతం అని అడగలేదు. ఆఖరికి ఏ పార్టీ అని కూడా అడగలేదు. మన, పర భేదం లేకుండా ప్రతి వర్గానికి మేలు చేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌ ఒక్కరే. 

ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్ని వర్గాలను దగా చేస్తున్నారు. రైతులకు పూర్తి రుణమాఫీ అని మొదటి సంతకం అన్నాడు.. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికి దిక్కు లేకుండా పోయింది. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ లేదు. ఇప్పుడు పసుపు – కుంకుమ అని మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఇస్తున్న మాఫీ చేయలేని రుణానికి వడ్డీకైనా సరిపోతుంది. ఎంగిలి మెతుకులు విసిరేస్తున్నాడు. మోసపోకండి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌ లేదు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను లిస్టు నుంచి తీసేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బు చేస్తే గవర్నమెంట్‌ ఆస్పత్రికే వెళ్లాలంట. చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి జబ్బు వస్తే కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్తాడంట. ఇది అమానుషం కాదా..?

చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. అమరావతికి రూ. 2500 కోట్లు ఇచ్చారంట.. రాజధానిలో ఒక్క శాశ్వత భవనం అయినా కట్టాడా.. గొప్ప అనుభవం ఉందని ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క మంచిపనైనా చేశాడా.. ఒక్క ఫ్లైఓవర్‌ అయినా కట్టాడా.. మళ్లీ ఐదేళ్లు అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడట. శ్రీకాకుళంను హైదరాబాద్‌ చేస్తాడంట. మన చెవుల్లో పూలు, క్యాబేజీలు పెడతాడంట. 

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. సామాన్యులకు రాలేదు కానీ చంద్రబాబు కొడుకు పప్పుకు వచ్చింది. కనీసం జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియదు. ఒక్క ఎన్నిక అయినా గెలిచాడా.. లోకేష్‌. ఒకటి కాదు. రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. పప్పుకు మూడు ఉద్యోగాలు, మామూలు ప్రజలకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. ఇది న్యాయమేనా..? 

ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి ఊపిరి లాంటిది. అంత ముఖ్యమైన హోదాను కూడా నీరుగార్చడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. గత ఎన్నికల్లో 15 సంవత్సరాలు హోదా సాధిస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా వద్దూ ప్యాకేజీ కావాలి అన్నాడు. మళ్లీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని హోదా అంటున్నాడు. మళ్లీ తరువాత ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషం. చంద్రబాబుకు రెండు నాలుకల ధోరణి అంటూ అతనే రెండు వేళ్లు చూపుతున్నాడు. చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలి. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీలో ధర్నాలు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు, ప్రతి జిల్లాలో యువభేరీలు, బందులు, రాస్తారోకోలు, ఆఖరికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. తరువాత రాజీనామాలు కూడా చేశారు. జగనన్న ఇంతగా ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే చంద్రబాబు నోట హోదా అనే మాట వచ్చేదా..? చంద్రబాబు యూటర్న్‌ తీసుకుంది జగనన్న వల్లే. దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి. చంద్రబాబు నెత్తిన ఒక శాపం ఉందంట. ఏ రోజు అయితే నిజం చెబుతారో ఆ రోజు చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అయిపోతుందంట. అందుకే నిజం చెప్పరు. 

చంద్రబాబు ఆయనకు సూటవ్వని పదాలు వాడుతున్నాడు. పౌరుషం, రోషం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వైయస్‌ జగన్‌ కేసీఆర్‌తో కలిశాడని ఆరోపణలు చేస్తున్నాడు. ఇదే కేసీఆర్‌తో పొత్తుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగితం లేకుండా పొత్తుకు ప్రయత్నించాడు.. అప్పడేమైంది చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా.. చచ్చిపోయిందా.. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉందంటే పులి అయిపోదు. పిల్లి పిల్లే.. పులి పులే. 

ఓదార్పు అని ప్రజలకు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ను వీడి సింగిల్‌గా బయటకు వచ్చారు. అది పౌరుషం అంటే. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయస్‌ జగన్‌ సింగిల్‌గానే పోటీ చేస్తున్నారు. బంపర్‌ మెజార్టీతో గెలుస్తాడని దేశంలోని ప్రతి సర్వే చెబుతుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు జనసేన, కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. 

చంద్రబాబు మీ భవిష్యత్తు మా బాధ్యత అంటున్నాడు.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా.. ఈ ఐదేళ్లు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా.. లోకేష్‌ బాధ్యత ఒక్కటేనా.. ఐదేళ్లు ప్రజల కోసం ఏమీ చేయలేదు. చేసిందేమైనా ఉంటే అది లోకేష్‌ కోసం మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 40 ఏళ్లలో ఎంత అప్పు చేసిందో.. ఈ ఐదేళ్లలోనే చంద్రబాబు అంత అప్పు చేశారు. తండ్రీకొడుకులు కలిసి మన రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పొరబాటున వీళ్లను నమ్మి మన భవిష్యత్తును వీళ్ల చేతుల్లో పెడితే నాశనం చేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్లు. 

పొరపాటున తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఉరి మనం వేసుకున్నట్లేనని పప్పు మాట్లాడాడు. ఇంకో వీడియోలో బంధుప్రీతి, మత పిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది తెలుగుదేశం పార్టీయే అని అవునా తమ్ముళ్లు అని అడుగుతున్నాడు. మన భవిష్యత్తును వీళ్ల చేతుల్లో పెడితే నాశనం చేస్తారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటీ పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని కొత్త అబద్ధాలు ఆడుతున్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రజల కోసం ఏ మేలు చేయలేదు. లోకేష్, హెరిటేజ్, తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం మాత్రమే పనిచేశారు. ప్రజల కోసం ఏమీ చేయలేదు. ఆఖరి నాలుగు నెలల్లో మాత్రం పసుపు – కుంకుమ, పెన్షన్‌ పెంపు, భృతి అంట చేపలకు ఎర వేసినట్లు వేస్తున్నాడు మోసపోతారా.. నిజంగా చంద్రబాబుకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దమ్ముంటే అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఈ ఐదేళ్లలో తల్లిదండ్రులు పిల్లల కోసం కట్టిన ఫీజు అంతా చంద్రబాబు బాకీ. తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్ల కోసం మీ ఇంటికి వస్తే ముందు ఆ బాకీ తీర్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇస్తానన్నాడు. అంటే ఈ ఐదేళ్లలో ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు రూ. 25 వేలు బాకీ పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే ముందు బాకీ తీర్చమని చెప్పండి. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు, విద్యార్థులకు ఐప్యాడ్‌లు ఇస్తామన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం, లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఐదేళ్లలో అక్షరాల రూ. 1.20 లక్షలు చంద్రబాబు బాకీ పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి మీ ఇంటికి వస్తే ముందు ఆ బాకీ తీర్చమని అడగండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి, పక్కా ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చి తప్పాడు. రాజధాని, విశాఖపట్నంలో వేల ఎకరాల భూమిని చంద్రబాబు, ఆయన కోటరీ కబ్జా చేశారు. ఆ భూమి అంతా మీదే మీకు రాసివ్వమని చెప్పండి. చేనేతలు, రైతులు, డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఆ బాకీ మొత్తం తీర్చమని అడగండి. 

మీ ఓట్లను డబ్బు పెట్టి కొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తారు.. నిజానికి వారు ఎంత డబ్బు ఇచ్చినా మీ బాకీ తీరదు. ప్రతి హామీ వసూలు చేయండి. డబ్బుకు అమ్ముడుపోకుండా విశ్వసనీయత కలిగిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం కల్పించండి. తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. తొమ్మిదేళ్లు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో ప్రజల కోసం పోరాటం చేశారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. కోట్ల మంది ప్రజలను కలిసి, వారి సమస్యలు విని తెలుసుకొని అర్థం చేసుకున్నాడు కాబట్టే సేవ చేయాలని జగనన్న ఆశపడుతున్నాడు. వైయస్‌ఆర్‌ చనిపోయినప్పుడు 700 మంది ప్రజలు బాధ భరించలేక చనిపోయారంటే.. అర్థం చేసుకోండి. మళ్లీ ఆ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు రావాలంటే జగనన్న రావాలి. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రజలకు మేలు చేసవాడు రావాలంటే జగనన్న రావాలి. అవినీతి, కొడుక్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చిన వాడు పోవాలంటే జగనన్న రావాలి. పది నాలుకల రావణాసురుడు పోవాలంటే జగనన్న రావాలి. వ్యవసాయం పండుగ కావాలంటే జగనన్న రావాలి. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని మా ప్రార్థన. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని అన్న, ఎంపీ అభ్యర్థి బాలశౌరి అన్నను గెలిపించాలి. ఫ్యాన్‌ గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యం కోసం వేస్తున్నట్లని ఎవరూ మర్చిపోవద్దు. 

Back to Top