ఇసుక ధర్నా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు

సెప్టెంబర్‌ 5 నుంచి పారదర్శకంగా ఇసుక సరఫరా

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక ధర్నా చేస్తుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ఇసుకను దోచుకున్న టీడీపీ నేతలే ఇప్పుడు ధర్నా చేయడం విడ్డూరమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఇసుక ధర్నాపై మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీని భరించలేక ప్రజలు వారిని ఓడించారన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేశారని, అలాంటి చింతమనేని ఇసుక కోసం మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారన్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పిన చంద్రబాబు గత ఐదేళ్లలో ఏ రోజైనా ప్రజలకు ఇసుకను సరఫరా చేశారా అని ప్రశ్నించారు. కొత్త ఇసుక పాలసీ వస్తుందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారన్నారు. సిమెంట్‌ కంపెనీల కోసం ఇసుక కొరత సృష్టించారన్నది అబద్ధమన్నారు. ఇటీవల వరదల కారణంగా ఇసుక తవ్వకం సాధ్యం కాలేదని, సెప్టెంబర్‌ 5 నుంచి పారదర్శకంగా ఇసుక సరఫరా చేస్తామని మంత్రి వనిత స్పష్టం చేశారు.  

Back to Top