తూర్పుగోదావరి జిల్లా : ప్రజా పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలు ఎంత చేసినా వెనక్కి తగ్గబోమని, మా పోరాటం ఆగదని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబును కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి తదితరులు మూలాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. అంబటి రాంబాబును ఇలా కలవడం బాధాకరమని అన్నారు. మాజీ మంత్రుల ఇళ్లను తగలబెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్నారు. తిరుమల లడ్డూ అంశంపై వచ్చిన నివేదికలో వాస్తవాలు బయటపడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి ఉండి ఉంటే గౌరవం పెరిగేదని పేర్కొన్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించడం సరైంది కాదని, సీనియర్ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. దేశంలో ఎక్కడా మాజీ మంత్రుల ఇళ్లపై ఇలాంటి అరాచకాలు జరగలేదని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని విమర్శించారు. ఓటు ద్వారా అధికారం పొందిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి ఆటవిక పాలన వైపు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సీబీఐ చార్జ్‌షీట్‌లో ప్రస్తావించినప్పటికీ, ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగించడం దారుణమన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన సమయంలో గంటల పాటు పోలీసులు స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. దాడి సమయంలో ఇంట్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని గుర్తుచేశారు. బాధితులను నిందితులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే ఎన్ని రోజులు అయినా జైల్లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని అంబటి రాంబాబు తమకు చెప్పారని వెల్లడించారు. జైలులో మాజీ మంత్రికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా అనుచితమని విమర్శించారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు వైయస్ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.