విజయవాడ : తిరుమల లడ్డూ ప్రసాదంపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మాజీ దేవాదాయ శాఖ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర పిలుపు మేరకు నగర మేయర్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మంగళవారం విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వులు కలిసినట్లు గత ఏడాది సెప్టెంబర్ నుంచి కూటమి నేతలు నిరాధార ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. సిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో హర్యానా, గుజరాత్ ల్యాబ్ నివేదికలు లడ్డూలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టం చేశాయని తెలిపారు. అయినప్పటికీ కూటమి నేతలు దుష్ప్రచారం కొనసాగిస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నెయ్యి నమూనాలు సేకరణ, ట్యాంకర్ల రాక, వాటి వినియోగం జరిగిందని నివేదికలో ఉందని పేర్కొంటూ, ఏవైనా లోపాలు ఉంటే అవి కూటమి ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అవమానిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కూడా వెలంపల్లి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక, రేషన్, మద్యం, మట్టి దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, కూటమి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదని ఆరోపించారు. తిరుమల లడ్డూ అంశంపై దుష్ప్రచారం చేసిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెలంపల్లి తెలిపారు.