వాస్తవాలు మాట్లాడండి చంద్రబాబూ

యనమల, బాబు మాయమాటలను ప్రజలు నమ్మరు

అతిదరిద్రమైన ఆర్థిక పరిస్థితిని వారసత్వంగా ఇచ్చారు

నీతిఅయోగ్‌ నివేదికలో ఏపీ వెనకబడటానికి గత ప్రభుత్వమే కారణం

దశల వారి మద్యనిషేధంతో మహిళలల్లో సంతోషం

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తాం

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

సచివాలయం: చంద్రబాబు, యనమల మాట్లాడే మాటల్లో ఒక్కటీ వాస్తవం లేదని, బాధ్యత గల స్థానంలో ఉన్న వారు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ర్యాంకు రావడమే మొదటిసారి అయితే పడడం, పెరగడం ఎలా సాధ్యమవుతుందో యనమల రామకృష్ణుడు చెప్పాలన్నారు. అతిదరిద్రమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా ఇచ్చి వెళ్లారని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు నెలల్లోనే సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు, యనమల రామకృష్ణుడు కొంచెం స్టడీ చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చురకంటించారు.

సచివాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల ఇండియా ఇనోవేషన్‌ ఇండెక్స్‌ అంటే దేశంలో కొత్తధనం, వినూత్నత గురించి నీతి అయోగ్‌ వారు సర్వే చేశారు. ఆ రిపోర్టు ఆధారంగా యనమల ఏదేదో మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ నిర్వాకం వల్లే 10వ ర్యాంకు, తెలుగుదేశం హయాంలోనే ముందున్నామని మాట్లాడాడు. చంద్రబాబు శ్రీకాకుళం వెళ్లి టీడీపీ అన్నా క్యాంటీన్లు నడిపితే.. వైయస్‌ఆర్‌ సీపీ మద్యం షాపులు నడుపుతుందని, తోక జాడిస్తే కత్తిరిస్తా. శ్రేణుల కోసం ప్రాణాలిస్తా.. మళ్లీ నేనే రావాలని కోరుకుంటున్నారంటూ మాట్లాడుతున్నాడు.
 
అతిదరిద్రమైన ఆర్థిక పరిస్థితి వారసత్వంగా వచ్చినా.. ఇచ్చిన మాట ప్రకారం రూ. వెయ్యి పెన్షన్‌.. రూ.2250 ఇచ్చిన మాట వాస్తవమా కాదా..? లేదా చెప్పినదానికంటే సంవత్సరం ముందే వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్నాం. దాన్ని చూసి బాధపడుతున్నారా..? మొట్టమొదటి సారిగా రైతులకు ఇన్సూరెన్స్‌ బీమా వారు కట్టాల్సిన భాగం కూడా ప్రభుత్వమే కడుతుంది. దీన్ని చూసి బాధపడుతున్నారా..? లేదా సున్నావడ్డీకి రైతులకు అప్పులు ఇవ్వాలని ప్రభుత్వమే ఆ భారం భరిస్తుంటే ప్రజలు బాధపడుతున్నట్లా..? దేనికి ప్రజలు బాధ పడుతున్నారో చంద్రబాబు, యనమల చెప్పాలి. మద్యం షాపులు 20 శాతం తగ్గించడమే కాకుండా ప్రభుత్వం మద్యం అమ్మడంతో ఇంతకు ముందు మాదిరిగా బెల్టుషాపులు లేవు. ఎక్కడ బడితే అక్కడ తాగేది తగ్గింది. కాబట్టి దీన్ని చూసి మహిళలు బాధపడుతున్నట్లా..? త్వరలోనే అమ్మ ఒడి, పొదుపు అప్పు మాఫీ కాబోతుంది. ఇవన్నీ చూసి ప్రజలు బాధపడుతున్నారా..?

ఇసుకలో కొంత కొరత వచ్చింది. గత ఐదేళ్లు ఇసుకను చంద్రబాబు, ఆయన తాబేదారులు దోపిడీ చేశారు. మాఫియాగా ఏర్పడి ఇసుక వ్యాపారం చేశారు.  దాన్ని అరికట్టేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఏపీఎండీసీ ప్రభుత్వ సంస్థ ద్వారా అమ్మకాలు మొదలుపెడితే వర్షాలు విస్తారంగా కురుస్తూ నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి వరుణదేవుడు వర్షాలు కురిపిస్తున్నాడు. నదుల్లో వరదలు ఉండడంతో కొద్దిగా ఇసుక కొరత ఏర్పడింది.

ఏపీ పదో స్థానానికి దిగజారిందని యనమల మాట్లాడుతున్నాడు. ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2019 నీతిఅయోగ్‌ చేసిన సర్వే. ఈ సర్వేలో కొత్తధనం, వినూత్నత, చదువు, కాలేజీ స్థాయి నుంచి వ్యాపారం, పరిశ్రమ స్థాయి వరకు దేశంలో ఏ రాష్ట్రం ఎలా ఉందని పోలికతో సర్వే చేశారు. రాష్ట్రంలో కొత్తధనం వచ్చే పరిస్థితులు ఉన్నాయా.. వచ్చినవి అమలు అవుతున్నాయా లేదా అని సర్వే సారాంశం. ఏపీ పదో ర్యాంకుకు వచ్చిందని మాట్లాడుతున్నాడు. మొదటిసారి వచ్చిన ర్యాంకు ఎలా పడిపోతుంది. పడడం ఎక్కడ నుంచి పెరగడం ఎక్కడ నుంచి వస్తుంది.
ఏపీ స్కోర్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీలు, విద్యార్థుల చదువు బాగుంది. టీచర్లు, విద్యార్థులకు రేషియోలో బాగున్నాం. ఉన్నత విద్యలో బాగున్నాం. పీహెచ్‌డీ ప్రోగ్రాంలో తక్కువ ఉన్నాం. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో తక్కువగా ఉన్నామని రిపోర్టు ఇచ్చారు. ఇవన్నీ మూడు నెలల్లో చేసేవా..?
ఏడు ఇండికేటర్లు, 30 సబ్‌ ఇండికేటర్లలో ఒక్కటి కూడా మూడు నెలల్లో చేసేవి లేవు. చంద్రబాబు వైజాగ్‌లో సమ్మిట్‌లో కోట్లాది రూపాయల పెట్టుబడులు, కోట్లాది ఉద్యోగాలు వచ్చాయని దేశంలో జనాభా కంటే ఎక్కువ సంఖ్య చెప్పారు. ఐదేళ్లు పాలించని ప్రభుత్వం ఏం చేయలేదనేది. నీతి అయోగ్‌ రిపోర్టు నిదర్శనం. దీనికి చంద్రబాబు, యనమల రామకృష్ణుడు పూర్తిగా బాధ్యులు.

చంద్రబాబు పరిశ్రమలకు రాయితీలు 2014–15లో మాత్రం రూ.2 వేల కోట్లు ఇచ్చారు. 2015–16లో రూ.290 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో పెట్టి రూ.26 కోట్లు మాత్రమే. 2016–17లో బడ్జెట్‌లో రూ. 470 కోట్లు పెట్టి రూ.292 కోట్లు ఇచ్చారు. 2017–18లో బడ్జెట్‌లో 976 కోట్లు పెట్టి రూ.740 కోట్లు, 2018–19 ఎన్నికలు ఉన్నాయని రూ.3500 కోట్లు బడ్జెట్‌లో పెట్టి రూ.740 కోట్లు ఇచ్చారు. రాయితీల లిస్టు పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయారు. రాయితీలు ఇవ్వనందునే పరిశ్రమ వీక్‌గా ఉందని నీతి అయోగ్‌ చెప్పింది. దీనికి మేము కారకులమా..?
 
ఆకలి లేకుండా బతకాలనే అంశంలో నీతి అయోగ్‌ సర్వేలో ఏపీ 17వ ర్యాంకులో ఉంది. బియ్యం సప్లయ్‌ స్మగ్లింగ్‌మార్కెట్‌లోకి వెళ్తుంది. అలాకాకుండా ప్రతి ఒక్కరూ తినే విధంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ సన్నబియ్యం పంపిణీ చేయిస్తున్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో పంపిణీ చేస్తున్నాం.  
వాటర్‌ అండ్‌ శానిటేషన్‌లో 16వ ర్యాంకులో ఉన్నాం.. దాన్ని అధిగమించడానికి రాష్ట్రంలోని అన్ని గడపలకు మంచినీరు అందించాలని వాటర్‌ గ్రిడ్‌ చేపట్టారు.
ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 20వ ర్యాంకులో ఉన్నాం. అందరికీ ఆమోగ్యమైన చోట పరిశ్రమలు పెట్టించేందుకు, ప్రతిప్రాంతం అభివృద్ధి చెందాలని సీఎం ప్రయత్నం చేస్తున్నారు.
అసమానత్వం ఉండకూడదని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒక పక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ.. మరో పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ.. ఇంకోపక్క రాష్ట్ర అభివృద్ధికి ముందుకుసాగుతున్న ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోందని, దయచేసి బాధ్యత గల స్థానంలో ఉన్న చంద్రబాబు, యనమల కొంచెం స్టడీ చేసి మాట్లాడితే మంచిదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు.  

 

Read Also: ఇసుక పాలసీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

 

తాజా వీడియోలు

Back to Top