రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

ప్రాంతాల మధ్య తారతమ్యం రాకూడదనేది మా అభిమతం 

చంద్రబాబు తన బంధువులకు భూములు కట్టబెట్టారు

రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి బంధువుల పేరుతో వందల ఎకరాలు

రైతులకు  ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: ప్రాంతాల మధ్య తారతమ్యం రాకూడదనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభిమతమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజానికానికి సంబంధించిన అంశమని, ఒక కులానికో, ప్రంతానికో రాజధాని పరిమితం కాదని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని తెలిపారు. ప్రభుత్వంపై దుస్ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.  సుజనాకు రాజధాని ప్రాంతంలో భూములు లేవని అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ అంశం దొరుకుతుందా.. దాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందుదామా అని ప్రతిపక్షం చూస్తుంది. 
కృష్ణా, పెన్నానది ప్రాంతంలో వరదలు వచ్చాయి. అన్ని శాఖలు సమన్వయంతో అన్ని ప్రాజెక్టులను పర్యవేక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో బేరీజు వేసుకుంటూ ఏ విధమైన నష్టం జరగకుండా కార్యక్రమాలు చేశారు.  పెయిడ్‌ ఆర్టిస్టులతో ఏ విధంగా విషప్రచారం చేయించారో చూశాం. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంటే.. హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. వరదలు ఆగిపోయిన తరువాత వచ్చి పర్యటించినా ప్రజల నుంచి స్పందన లేదు. అయినప్పటికీ కార్యకర్తలను పెట్టుకొని ప్రభుత్వంపై నిందలు వేసి వెళ్లిపోయారు. 
వైయస్‌ జగన్‌ ప్రభుత్వం బాధ్యతాయుత ప్రభుత్వం. రైతుకు ఏ చిన్న కష్టం వచ్చినా ప్రభుత్వం సహించలేదు. ఏ కార్యక్రమం చేసినా అదే నేపథ్యంలో చేపడుతున్నాం. రైతుకు కష్టం కలిగించే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. నా ఇల్లు ముంచడానికే ప్రయత్నం చేశారని ఆరోపణ చేశారు. ఇల్లు ముంచాలని అనుకుంటే అరగంట వరద ఆపితే సరిపోయేదని, కానీ, ప్రభుత్వం ఎవరికీ కష్టం కలిగించే ప్రయత్నం చేయదన్నారు. కృష్ణలంక, భవానీపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాలని కోరాం. అలాగే చంద్రబాబుకు కూడా చెప్పామన్నారు. దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, తండ్రీకొడుకులు ట్విట్టర్‌లో హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారన్నారు. 40 సంవత్సరాల హిస్టరీ ఇదేనా చంద్రబాబూ అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లాలనే ప్రయత్నం తప్ప బాధ్యత లేదని, చంద్రబాబు ఇంకెప్పుడు తెలుసుకుంటారో తెలియడం లేదన్నారు. 

తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుంటే సుజనా చౌదరి కూడా అదే మాట్లాడుతున్నాడన్నారు. విషయం ఏదైనా ఉంటే సూటిగా, బాధ్యతగా మాట్లాడాలని సుజనా చౌదరికి సూచించారు. సుజనాచౌదరి అల్లుడు జితిన్‌కుమార్‌ పేరుతో ఉన్న కలింగ గ్రీన్‌ టెక్‌ కంపెనీ పేరుమీద 110 ఎకరాలు ఉన్నాయన్నారు. సుజనా చౌదరికి ఉన్న 120 కంపెనీల్లో ఒక కంపెనీ ఇది. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు ఉందన్నారు. ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆయన సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్య వీర్లపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉందన్నారు. ఒక్క ఎకరా చూపించమన్న సుజనా చౌదరికి 124 ఎకరాలు వారి కుటుంబాల పేరు మీద ఉన్నట్లు చూపించానన్నారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసి తెలంగాణలో పెట్టుబడులు చూస్తున్నామని యనమల రామకృష్ణుడు, హైదరాబాద్‌లో రియలెస్టేట్‌ చేస్తున్నామని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబులా రియలెస్టేట్‌ వ్యాపారం చేయడం మాకు రాదన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అక్రమాలకు తావుండదని పేర్కొన్నారు.

Back to Top