ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజీల్‌ సంక్షోభం.. 

సరఫరా తగ్గించలేదని కేంద్ర పెట్రోలియం రసాయనాల శాఖ మంత్రి అంటున్నారు.. 

 రాష్ట్రంలో 70 శాతం బంకుల్లో నోస్టాక్ బోర్డులు.. 

 విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కె.కె రాజు ఆగ్ర‌హం

విశాఖ‌: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు విశాఖపట్నం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కె కె రాజు పార్టీ శ్రేణులతో కలిసి సిరిపురం ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. మూడు రోజులుగా సమస్య మరింత తీవ్రమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

కేంద్ర పెట్రోలియం శాఖ సరఫరాలో ఎలాంటి లోటు లేదని స్పష్టంచేసిందని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్‌లో లేదని చెప్పిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. డీలర్లు ధరలు పెరుగుతాయన్న అంచనాలతో స్టాక్ నిల్వచేసుకుంటున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం తెలిసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం బంకుల్లో సుమారు 70 శాతం వరకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ఎలాంటి కొరత లేకపోయినా ఏపీలో మాత్రమే ఈ పరిస్థితి ఉండటం ప్రభుత్వం, డీలర్ల కుమ్మక్కుకే నిదర్శనమని విమర్శించారు. ఇంధన కొరత కృత్రిమంగా సృష్టించబడిందని ఆరోపిస్తూ, వెంటనే సమీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top