కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో ఇంధన సంక్షోభం

మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఫైర్‌

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోని కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడిందని వైయ‌స్ఆర్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీ చరణ్ విమర్శించారు. పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఆమె పరిస్థితిని పరిశీలించారు.  ఈ సందర్భంగా ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలనా వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. డీజిల్ వంటి నిత్యావసర ఇంధనం అందుబాటులో లేక రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరమని అన్నారు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తక్షణమే ఇంధన సరఫరాను పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top