కర్నూలు: నగరంలో డీజిల్ కొరతతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. గుత్తి రోడ్డులోని పెట్రోల్ బంక్‌ను సందర్శించి వాహనదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. మూడు రోజులుగా సమస్య మరింత తీవ్రమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కేంద్ర పెట్రోలియం శాఖ సరఫరాలో ఎలాంటి లోటు లేదని స్పష్టంచేసిందని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్‌లో లేదని తెలిపిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. డీలర్లు ధరలు పెరుగుతాయన్న అంచనాలతో స్టాక్ నిల్వ చేసుకుంటున్నారని, ఈ విషయాన్ని తెలిసీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో సుమారు 70 శాతం వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి కొరత లేకపోయినా ఏపీలో మాత్రమే ఈ పరిస్థితి ఉండటం ప్రభుత్వం, డీలర్ల కుమ్మక్కుకు నిదర్శనమని విమర్శించారు. ఇంధన కొరత కృత్రిమంగా సృష్టించబడిందని ఆరోపిస్తూ, వెంటనే సమీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరించాలని కాటసాని రామభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.