గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో వ్యాపార, వాణిజ్య, రవాణా రంగాలు స్థంభించిపోయాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు నగరంలో వైయస్ఆర్‌సీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సైకిళ్లు తొక్కుతూ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో మాత్రమే ఇలాంటి ఇంధన కొరత నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. ప్రజల దైనందిన జీవనం దెబ్బతింటున్నప్పటికీ ప్రభుత్వం సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంధన కొరత కారణంగా రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ సరఫరా పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.