పాడేరులో ఇంధన సంక్షోభంపై ఎమ్మెల్యేల ఆగ్రహం 

 పాడేరు: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తీవ్రంగా స్పందించారు. పాడేరు కేంద్రంలోని పెట్రోల్ బంకులను వారు పార్టీ నాయకులతో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. మూడు రోజులుగా సమస్య మరింత తీవ్రమవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు.

కేంద్ర స్థాయిలో సరఫరాలో ఎలాంటి లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్‌లో లేదని సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత ఏర్పడటం ఆశ్చర్యకరమన్నారు. డీలర్లు ధరలు పెరుగుతాయన్న అంచనాలతో స్టాక్ నిల్వ చేసుకుంటున్నారని, ఈ విషయం తెలిసీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకుల్లో సుమారు 70 శాతం వరకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి కొరత లేకపోయినా ఏపీలో మాత్రమే ఈ పరిస్థితి ఉండటం ప్రభుత్వం, డీలర్ల కుమ్మక్కుకు నిదర్శనమని విమర్శించారు. ఇంధన కొరత కృత్రిమంగా సృష్టించబడిందని ఆరోపిస్తూ వెంటనే సమీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 

Back to Top