నవ శకానికి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం నాంది

నేడు న‌ర‌స‌న్న‌పేట‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

 వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ప్రారంభించ‌నున్న ముఖ్య‌మంత్రి

శ్రీ‌కాకుళం: అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించనున్నారు. 

పాస్‌ పుస్తకంలో క్యూఆర్‌ కోడ్‌
సర్వే పూర్తైన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం జియో కో–ఆర్డినేట్స్‌ (అక్షాంశాలు, రేఖాంశాలు)తో జారీ చేయనుంది. ప్రతి భూమికి ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్‌ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్‌ మ్యాప్‌ జారీ చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్‌ నెంబర్‌ తరహాలో ఒక విశిష్ట సంఖ్య (ఐడీ నెంబర్‌), క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకంలో పొందుపరిచే ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి.

రీ సర్వే తర్వాత జారీ చేసే డిజిటల్‌ రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేయడం సాధ్యపడదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డుల్లో మార్పు చేయడం అసాధ్యం. డబుల్‌ రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉండదు. రీ సర్వే ద్వారా భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కానుంది. అత్యంత పకడ్బందీగా భూముల కొత్త రికార్డు తయారవుతోంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలు పరిష్కారమవుతాయి. భూ అక్రమాలకు తావుండదు. 

ఉచితంగా.. రికార్డు వేగంతో
తొలిదశ కింద రీ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో 4.3 లక్షల పట్టా సబ్‌ డివిజన్లు చేశారు. 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సాధారణంగా పట్టా సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ కోసం పట్టే సమయం, తిప్పలు అందరికీ తెలిసిందే. అయితే రీ సర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఈ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. పట్టా సబ్‌ డివిజన్‌ కోసం సచివాలయం, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.600 చెల్లించాలి. మ్యుటేషన్‌ కోసం అయితే రూ.100 కట్టాలి.

ఈ లెక్కన 4.3 లక్షల పట్టా సబ్‌ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లను రైతులు సొంతంగా చేసుకోవాలంటే రూ.37.57 కోట్లు ఖర్చవుతుంది. రీసర్వే ద్వారా ప్రభుత్వమే ఉచితంగా ఈ పనుల్ని చేపట్టి రైతులకు డబ్బులు మిగల్చడంతోపాటు వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించింది. 2 వేల గ్రామాల్లో రీ సర్వేను కేవలం 8–9 నెలల్లోనే పూర్తి చేయడం రికార్డు. మరో 15 రోజుల్లో ఈ గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

డ్రోన్లు.. విమానాలు.. ఆధునిక టెక్నాలజీతో 
2020 డిసెంబర్‌ 21న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యుస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌ (సీఓఆర్‌ఎస్‌), జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వేను నిర్వహిస్తున్నారు.

భూహక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూరక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడం రీ సర్వే ప్రధాన లక్ష్యం. ప్రతి భూమికీ జియో కో–ఆర్డినేట్స్‌తో హద్దులు ఏర్పరచడం, ఐడీ నెంబర్, క్యూఆర్‌ కోడ్‌ జారీ ద్వారా దేశంలో నవ శకానికి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం నాంది పలికింది.

రూ.1,000 కోట్ల అంచనా వ్యయం
2023 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక రీ సర్వే నిర్వహణకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూముల హద్దులను నిర్థారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి ఇళ్ల యజమానులకు ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దేశంలోనే మొదటిసారిగా భూములకు సంబంధించిన అన్ని సేవలను సింగిల్‌ డెస్క్‌ విధానంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తెచ్చారు. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ లాంటి అన్ని సేవల్ని పొందే సౌలభ్యం కల్పించారు. 

నిర్విరామంగా మహాయజ్ఞం
రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్‌ పరిపాలన, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్‌ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు.

మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్‌ మేజిస్ట్రేట్‌లను నియమించారు. 2,797 మంది వీఆర్‌ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం వైయ‌స్్ జగన్‌ రైతులకు అందించనున్నారు. 

Back to Top