బాధ్యతారాహిత్యంపై దండ‘యాత్ర‘

వైయ‌స్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర. ఇతివృత్తంగా సినిమా

ప్రచార ఆర్భాటాలూ లేకుండానే యాత్ర‌ సినిమా పెద్ద హిట్ 

ఈ సినిమాపై టాలీవుడ్ లో మెజారిటీ ప్రముఖుల మౌనవ్రతం  

జన హృదయాల్లోంచి యాత్ర సంతకాన్ని ఎవరూ చెరపలేరు.

కళకీ కులాలుంటాయి. సినిమాలకీ రాజకీయాలుంటాయి. మనోళ్ల కళ  హాయిగా కళ కళ లాడుతూ ఉంటుంది.మనోళ్లకి నష్టం  తెచ్చే పరాయి వారి కళ ఎంతబాగున్నా వెల వెలబోతుంది. అసలామాటకొస్తే మనోడి సినిమా బాగాలేకపోయినా..అద్భుతంగా ఉందని చెప్పడానికి మనకి భయమే ఉండదు. మనోడి సినిమాకన్నా అవతలోడి సినిమా నిజంగానే అద్భుతంగా ఉన్నా...మన మాటల వల్ల కూడా ఆ సినిమాకి ప్రచారం జరిగిపోతే కొంపలంటుకుపోతాయి కాబట్టి దాని గురించి మాట్లాడనే మాట్లాడం. ఇపుడు టాలీవుడ్ లో మెజారిటీ ప్రముఖులకు ఓ సినిమా అంటరానిదైపోయింది. దాని గురించి మాట్లాడ్డమే నేరమన్నట్లు అంతా మౌనవ్రతం పట్టేశారు. ఆ సినిమాయే యాత్ర.దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవితంలో ఓ చిన్న అధ్యాయం పాదయాత్ర. ఆ చిన్నపాటి ఘట్టాన్నే ఇతివృత్తంగా తీసుకున్న కొత్త నిర్మాత...ఓ  వర్ధమాన దర్శకుడు కలిసి ఈసినిమాని తెరకెక్కించారు.

ఎలాంటి హడావిళ్లూ..ప్రచార ఆర్భాటాలూ లేకుండా యాత్ర సినిమాని విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. చిత్రంగా టాలీవుడ్ లో ఏ సినీ ప్రముఖుడూ కూడా ఈ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. సినిమా బాగుందనో..బాగాలేదనో చెప్పలేదు. దీనికి కొద్ది రోజుల ముందు నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా అత్యంత ఆర్భాటంగా విడుదలైంది. సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుంచే  అన్ని చానెళ్లూ..పత్రికలూ కథానాయకుడి గురించి లెక్కకు మించిన కథనాలు రాసి ప్రమోట్ చేశాయి. అంత హడావిడీ చేసి విడుదల చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.

సినిమా ఫ్లాప్ అయినా కూడా  చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా సినిమా గురించి ఆహా ఓహో అని  పొగిడారు. ట్విట్టర్ లో పోస్టింగులు పెట్టి తమ బాధ్యత నెరవేర్చుకున్నారు.ఈ పెద్దలంతా యాత్ర సినిమా విషయం వచ్చేసరికి నోళ్లు కట్టేసుకున్నారు. కలాలు పక్కన పెట్టేశారు. మౌస్ లు కదలకుండా పట్టేసుకున్నారు.ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది కాదు. కావాలనే..ఒక పథకం ప్రకారమే.. యాత్ర గురించి మాట్లాడకుండా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందువల్ల?
యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి  వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది. అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి  నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది.

సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది. టాలీవుడ్ లో భిన్న వైరుధ్యాలు..శత్రుత్వాలూ ఉన్న గ్రూపులన్నీ కూడా యాత్రను ప్రమోట్ చేయకూడదన్న ఒకే ఒక్క అంశంలో ఒక్కతాటిపైకి రావడం చూసి భయమేసింది.ఏ చిన్న  సినిమాయో అనాథలా విడుదలై  హిట్ అయితే..స్పందించకపోతే బాగుండదేమోనని  బాగుందని  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సినీ జీనియస్ లు సైతం యాత్ర ను వెలివేయడం చూసి బాధేసింది. సామాజిక వర్గం ఆధారంగా ఓ సినిమాని ఇలా వెలివేసేసే పెద్దలున్న కాలంలోనే నేనూ బతుకుతున్నందుకు సిగ్గేసింది. ఈ పెద్దలంతా కూడా... కథానాయకుడి విషయంలో ఇందుకు భిన్నంగా స్పందించడం చూసి ఆశ్చర్యమేసింది.

కథానాయకుడు సినిమా ఫ్లాప్ అని తేలిపోయిన తర్వాత కూడా.. అన్ని చానెళ్లూ..అందరు సినీ ప్రముఖులూ కూడా ఒకటే భజన. కథానాయకుడి సినిమా చాలా బాగున్నప్పటికీ..బాలకృష్ణ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ...సినిమా అనుకున్నట్లు ఆడలేదట.అంటే..మనోడి సినిమాని  మెచ్చుకోకపోతే..మొత్తం ప్రేక్షకులందరినీ బోనులో నిలబెట్టి..ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేదని కాలర్ పట్టుకుని నిలేస్తారన్నమాట. అదే అవతలోడి యాత్ర ఎవరూ ప్రమోట్ చేయకపోయినా..మీడియా ఏ పాటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా..విడుదలై జనం అద్భుతంగా ఉందని మెచ్చుకుంటే... ఆ విషయం ఎవరికీ తెలీకుండా ఉండేందుకు మొత్తం యాత్ర సినిమానే బోనులో పెట్టేస్తారన్నమాట. యాత్రపై కోపానికి చాలా కారణాలే ఉండచ్చు. ఎందుకంటే..చాలా సినిమాల్లా యాత్ర సినిమా ఆర్భాటంగా ముందుకు రాలేదు.

ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ సెట్టింగులు వేసి..సినీ పరిశ్రమలోని అతిరథమహారథులను పిలిచి తారల తళుక్కుల మధ్య నిర్వహించలేదు.సినిమాలో సుమోలు గాల్లోకి లేచి కిందపడలేదు. అమ్మాయిల అంగాంగ ప్రదర్శనలతో యువతకు గేలం వేయలేదు. భారీ సెట్టింగులూ లేవు..ఘోరమైన ఫైటింగులూ లేవు. ఓ ఊరి నుంచి మరో ఊరికి ఎడ్లబండిపై వెళ్లినట్లు సినిమాని ముందుకు నడిపించారు దర్శకుడు మహి.సినిమాకి సంబంధించిన  రూల్స్ ని పక్కన పెట్టి.. సినీ పరిశ్రమలోని సంప్రదాయాలను పట్టించుకోకుండా..అత్యంత సింపుల్ గా సినిమా విడుదల చేసేసి..హిట్ కొట్టేసి.. కాలరెగరేస్తే ఎలాగ? అనుకున్నారో ఏమో కానీ చిత్ర పరిశ్రమ అంతా ఒకేలా సహాయనిరాకరణ ప్రదర్శించింది.

సమకాలీన అంశాలపై తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో అద్భుతంగా స్పందించే  సినీ మేథావులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి బ్రదర్స్, నాగబాబులతో పాటు..సోషల్ మీడియాలో భిన్న అంశాలపై బాధ్యతాయుతంగా తమ అభిప్రాయాలను వెల్లడించే జర్నలిస్టు మేథావులు..సాహితీ ప్రియులు...విమర్శకులు సైతం యాత్ర మనది కాదులేనని వదిలేయడం అన్యాయం అనిపించింది. సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫాన్ అన్న సామెత కూడా అన్ని వేళలా..అన్ని కాలాల్లోనూ నిజం కాదనిపించింది.ఎందుకంటే కథానాయకుడు ఫెయిల్ అయినా..మేథావులు..సినీ ప్రముఖులూ.. జర్నలిస్టులూ అంతా కూడా సినిమా బాగుంది కానీ..ఎక్కువ మంది చూడలేదని కితాబునిచ్చారు. అంటే మనోళ్ల  ఫెయిల్యూర్ కి కూడా చాలా మంది ఫాదర్సూ,బాబాయిలూ..మావయ్యలూ దూరపు చుట్టాలూ అండగా నిలిచారు.

సినిమా బాగుంటే జనం ఎందుకు చూడరు? జనం చూడకపోవడం వల్లనే కదా సినిమా ఫ్లాప్ అయ్యింది. చూడలేదంటే ఆ సినిమా జనానికి నచ్చలేదనే కదా. అదే యాత్ర చాలా బాగుందని జనం మెచ్చుకున్నా..సినిమా హిట్ అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క మంచి మాట అనలేకపోవడం దేనికి సంకేతం? అన్నింటినీ మించిన దారుణం ఏంటంటే..యాత్ర సినిమా ఘన విజయం సాధించాక..చిత్ర యూనిట్ విశాఖ పట్టణంలో సక్సెస్ మీట్ పెట్టారు. దానికి చిత్ర కథానాయకుడు..మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా వచ్చారు.

చిన్న చిన్న సినిమాల సక్సెస్ మీట్ లు జరిగినా మీడియాలో వార్తలు వస్తారు. కానీ యాత్ర సక్సెస్ మీట్ వార్తలు మాత్రం ప్రధాన పత్రికలు పక్కన పెట్టేశాయి. యాత్రను  మీడియా కూడా వెలి వేసిందన్నమాట. యాత్ర సక్సెస్ అయినా ..అనాథగా వదిలేసి వెళ్లిపోవాలని మెజారిటీ పెద్దలు అనుకున్నారు. అయితే యాత్ర అనాథ కాలేదు. 5కోట్ల మంది ప్రజలు యాత్రను దత్తత తీసుకుని తమ గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు. జన హృదయాల్లోంచి యాత్ర సంతకాన్ని ఎవరూ చెరపలేరు. మనం మెచ్చిందే కళ...మనం చెప్పిందే వేదం  అన్న ఆలోచన ఎంత ప్రమాదకరం? కళ మనకో మనోళ్లకో...మనోళ్ల పార్టీలకో మేలు చేసేదై ఉండాలనుకోవడం ఎంత బాధ్యతారాహిత్యం? ఎంత దారుణం? 
                                                                                                                                                                                                                                                                  -సి.ఎన్.ఎస్.యాజులు
                                                                                                                                                                                                                                                                       

 

Back to Top