విశాఖ గర్జన విజ‌య‌వంతం

జోరువానలోనూ వికేంద్రీకరణకై క‌దం తొక్కిన ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు
 
రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చినవారితో జనసంద్రమైన విశాఖపట్నం..
 
జై విశాఖ.. జైజై విశాఖ.. పరిపాలనా రాజధాని విశాఖ.. నినాదాలతో మారుమోగిన విశాఖ
 
భారీ వర్షంలోనూ రెండున్నర గంటలు పాటు సాగిన విశాఖ గర్జన ర్యాలీ
 
 29 గ్రామాలు కాదు.. 26 జిల్లాల అభివృద్ధి కావాలి.. అంటూ హోరెత్తిన నినాదాలు
 
ఉత్తరాంధ్ర జోలికొస్తే.. ఉప్పు పాతరేస్తాం.. అంటూ హెచ్చరికలు
 
అమరావతి పేరుతో మాపై దండయాత్ర చేస్తే సహించం.. అంటూ నినదించిన ఉత్తరాంధ్ర ప్రజలు
 
అమరావతి యాత్ర పేరుతో టీడీపీ విద్వేషాలు రెచ్చగొడితే తిప్పికొడతాం..
 
 విశాఖ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కనువిప్పు కలగాలి

విశాఖ‌: వికేంద్రీకరణకై జోరువానలోనూ ఉత్తరాంధ్ర గర్జించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుతూ.. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన ఉత్తరాంధ్ర ప్రజలు తమ పోరాట స్ఫూర్తిని ఉవ్వెత్తున చాటారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన జనంతో విశాఖ నగరం జన సంద్రమైంది. ఒకవైపు జోరు వాన.. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజల గర్జన తోడై, జై విశాఖ.. జైజై విశాఖ.. అన్న నినాదాలు, విశాఖనగరంలో సింహ నాదమై ప్రతిధ్వనించాయి. విశాఖలోని ఎల్ ఐసీ బిల్డింగ్ దగ్గర అంబేడ్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్డులోని వైఎస్ఆర్ గారి విగ్రహం వరకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు జోరు వర్షంలోనూ రెండున్నర గంటలపాటు భారీ ఎత్తున ర్యాలీ చేశారు. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర ప్రజల గర్జనకు, జన తుఫాన్ కు,  జోరున కురుస్తున్న వర్షం కూడా శాంతించింది. ఉత్తరాంధ్ర జోలికొస్తే.. అమరావతి యాత్రల పేరుతో మా ప్రాంతంపై దండయాత్రలు చేస్తే.. ఉప్పుపాతరేస్తాం.. అంటూ ర్యాలీలో ఉత్తరాంధ్ర ప్రజలు గర్జించారు. దారిపొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం తెలిపారు. 

            విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఏర్పాటైన జేఏసీ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో ప్రజా ప్రతినిధులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల నేతలు పాల్గొని విశాఖే  పరిపాలనా రాజధానిగా చేయాలని నినదించారు. అక్కడ వైఎస్ఆర్ గారి విగ్రహానికి నేతలు నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం న్యాయంగా చేస్తున్న మా పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని కోరారు. ఇప్పటికే మూడుసార్లు మన రాష్ట్రాన్ని విభజించారు, మళ్ళీ అమరావతే ఏకైక రాజధాని అయితే.. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి పునరావృత్తం అవుతుందని హెచ్చరించారు. ఈ సభలో  జేఏసీ కో కన్వీనర్ దేవుడు తదితర నేతలతో  పాటు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్, బూడి ముత్యాలనాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, బుగ్గన రాజేంద్రనాధ్, జోగిరమేష్, ఆర్కే రోజా, మేరుగు నాగార్జున, విడదల రజని, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొని తమ గళాన్ని గట్టిగా వినిపించారు. జోరు వానలోనూ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

- ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ.. విశాఖ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారికి వంతపాడుతున్న ఎల్లో మీడియా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఉత్తరాంధ్రపై పాదయాత్రల పేరుతో, దండ యాత్రకు వచ్చినా, మా ప్రాంతానికి నష్టం చేయాలని చూసినా.. ఇక్కడి ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కో అల్లూరి సీతారామరాజై ఉద్యమిస్తారని హెచ్చరించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని తీరుతాం.. దీన్ని ఆపగలిగే మొనగాళ్ళెవ్వరూ లేరని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డొస్తే.. వారెవరైనా చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. 

 
ఆకలి మంటలతో చచ్చే బదులు.. పోరాడి చద్దాంః స్పీకర్ తమ్మినేని
స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. ఈ  ప్రాంతం ఇంతకాలంగా పాలనాపరమైన వివక్షతకు గురవ్వడం వల్లే వెనుకుబాటుతనానికి గురైందన్నారు.  ఉద్యమాలకు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతమని, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు ఉద్యమాలు జరిగితే.. ఈరోజు మళ్ళీ మన బతుకుల బాగు కోసం విశాఖే పరిపాలనా రాజధానిగా ఉండాలని ఉద్యమిస్తున్నాం అన్నారు. ఆకలి మంటలతో చచ్చే బదులు.. పోరాడి చద్దాం అని పిలుపునిచ్చారు. మొలతాడు కట్టిన ప్రతి పురుషుడు, తాళి కట్టిన ప్రతి మహిళ, మీసం ఉన్న ప్రతి యువకుడు.. కదనరంగంలోకి దిగాలని కోరారు. 

జగన్ గారు ఉండగా.. మనకెందుకు భయంః మంత్రి ధర్మాన
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. మా ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు రాకుండా చేసినందుకు, 130 ఏళ్ళ నుంచి వస్తున్న వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు  ఈరోజు గర్జించారని, భవిష్యత్తులో మరింత గట్టిగా రాజకీయ పోరాటం చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు.. మన తాలూక వాదాన్ని బలంగా దేశం అంతటికీ వినిపించాలి,  తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. మనందరి ఆశయం కోసం.. ముఖ్యమంత్రి, బలమైన నాయకుడు జగన్ గారు ఉండగా.. మనకెందుకు భయం అని అన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కోసం పోరాడదాం, సాధించుకుందా అని అన్నారు. 

త్వరలో విశాఖ నుంచే జగన్ గారు పరిపాలనః వైవీ సుబ్బారెడ్డి
ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ గారు సంకల్పిస్తే.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, ఆ ప్రాంతంలో తమ భూముల రేట్లు పెంచుకుని దోచుకోవాలని టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి నిర్ణయం మేరకు మూడు రాజధానుల నిర్మాణం చేసుకుంటాం.. విశాఖ నుంచే జగన్ గారు త్వరలో పరిపాలన సాగిస్తారు అని స్పష్టం చేశారు. పాదయాత్ర పేరుతో ఈ ప్రాంతంపై దండయాత్ర చేస్తున్న వారు, ఆ దండయాత్రకు మద్దతిస్తున్న టీడీపీ, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లను నిలదీయాలని కోరారు. మీ ప్రాంతంలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తే మేము అడ్డుపడటం లేదు, మరి మీరెందుకు విశాఖ పరిపాలనా రాజధానికి అడ్డు పడుతున్నారని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి అని కోరారు. విశాఖను పరిపాలనా రాజధానిగా సాధించుకునేందుకు, జేఏసీ ఏ పోరాటం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. 

పెయిడ్ ఆర్టిస్టులకు మద్దతిస్తున్న బాబు, పవన్ లను తరిమి కొట్టాలిః రోజా
మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకుంటూ, తుప్పు పట్టిన సైకిల్ చక్రం అధినేత చంద్రబాబు మన రాష్ట్రానికి చేసిందేమీ లేదు అని మండిపడ్డారు. అత్యాశతో అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి, దోచుకుని దాచుకోవడం కోసమే పాదయాత్రల పేరుతో ఇక్కడకు దండయాత్ర చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే  ఉత్తరాంధ్ర, రాయలసీమలు అన్యాయానికి గురి అయ్యాయి. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ గారు గొప్ప మనసుతో పరిపాలన వికేంద్రీకరణ చేయాలని ముందుకు నడుస్తున్నారు. దీనికి 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు, అమరావతి  రైతుల ముసుగులో వస్తున్న పెయిడ్ ఆర్టిస్టులకు మద్దతు తెలియజేస్తున్నారు. వారిని తమిరి కొట్టాలా.. వద్దా..? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పెళ్ళి చేసుకోవడానికి, ఆయన షూటింగ్ లకు, ఆయన సభలకు, ఆయన పోటీ చేయడానికి ఈ ప్రాంతం కావాలి.. మరి వైజాగ్ అభివృద్ధి వద్దా అని పవన్ కల్యాణ్ ను రోజా ప్రశ్నించారు.  విశాఖ వాళ్ళు తెలివైనవాళ్ళు కాబట్టే.. గాజువాకలో పవన్ కల్యాణ్ ను చిత్తు చిత్తుగా ఓడించారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే.. పవన్ కల్యాణ్ చిత్తు అవ్వడం ఖాయం అని హెచ్చరించారు. 

పైన ఆకుపచ్చ కండువాలు.. లోపల పచ్చ కండువాలుః మంత్రి మేరుగు నాగార్జున
మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ..  అధికారంలో ఉండగా, అమరావతి ప్రాంతంలో రైతులను దోచుకుని, 29 గ్రామాల కోసం ఈరోజు చంద్రబాబు ఉద్యమం చేయిస్తున్నాడు. పైన ఆకు పచ్చ చొక్కాలు.. లోపల పసుప పచ్చ కండువాలు వేసుకని, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వారంతా పోరాటం చేస్తున్నారన్నారు. మూడు రాజధానులే ఈ రాష్ట్రానికి శరణ్యం అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దు అని చెప్పారు. 

మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. విశాఖ ప్రజల ఉగ్రరూపం ఎలా ఉంటుందో.. ఈరోజు విశాఖ గర్జన చూస్తే ప్రతిపక్షాలకు నిద్రపట్టదన్నారు. ఉక్కు సంకల్పంతో విశాఖను పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు సాధిస్తారన్నారు. 

420 చంద్రబాబుః కొడాలి నాని
మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. హైదరాబాద్ లో జరిగినట్టే,  రాష్ట్ర సంపదనంతా ఒకే చోట అమరావతిలో ఖర్చు చేశాక, మిగతా  ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. విశాఖ గర్జన చూశాక అయినా, చంద్రబాబు నాయుడుకి, పవన్ కల్యాణ్ కు, ఈనాడు రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి  రాధాకృష్ణకు, టీవీ 5 బీఆర్ నాయుడులకు ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలుసుకోవాలన్నారు. అమరావతికే మద్దతు ఇస్తున్న టీడీపీ గానీ, పత్రికలు, చానళ్ళు నడుపుతున్న వారికి గానీ.. ఈ ప్రాంతంలో మీ పార్టీలు లేవా, మీరు పత్రికలు అమ్ముకోవటం లేదా.. అని ప్రశ్నించారు. వీళ్ళందరికీ అమరావతి మీదే ఎందుకు ప్రేమ అంటే, వీళ్ళంతా అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక వారి పప్పులు ఉడకక, 40 లక్షలు పెట్టి కొన్న భూములు నాలుగు కోట్లు కాలేదన్న బాధతో.. వీరంతా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. తమ ఆస్తుల కోసం ఉత్తరాంధ్ర మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు ఒక 420 అని, పిల్లనిచ్చి, పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు  పొడిచి, పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకున్న చంద్రబాబుకు పుట్టగతులు ఉండవు అన్నారు. చంద్రబాబుకు ఆస్తుల మీద తప్పితే.. ప్రజల మీద ప్రేమ, దయ, బాధ్యత ఉండదన్నారు. 

ఈ సమావేశంలో ఇంకా పలువురు నేతలు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల వారు పాల్గొని ఇంతకాలం ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయాన్ని, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలనే ఆకాంక్షను బలంగా వినిపించారు. 

 
 

తాజా వీడియోలు

Back to Top