బాబు ఉలికిపాటు

ఫెడరల్ ఫ్రంట్ గురించి కేటీఆర్ జగన్ ను కలవడం మహాఘోరం, మహాపాపం అంటున్నాడు చంద్రబాబు. కేటీఆర్ తో మాట్లాడితే వైఎస్ జగన్ కు ఓట్లు రావని జోస్యం చెబుతున్నాడు. మరి ఇదే కేటీఆర్ తో బావమరిది శవం ముందు కూర్చుని రాజకీయాలు మాట్లాడి, పొత్తులకోసం వెంపర్లాడినప్పుడు టిడిపికి ఓట్లు పడతాయా? కేసీఆర్ స్నేహం కోసం చేయి చాచాను అని సిగ్గులేకుండా చెప్పుకున్నప్పుడు తెలుగుదేశానికి ఓట్లు పడతాయా? కాస్తైనా చంద్రబాబుకు సిగ్గూ, శరం అనేవి ఉన్నాయా? తానెళ్లి ఏ పార్టీని కలిసినా అది లోక కళ్యాణం కోసం, చారిత్రక అవసరం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమట. ఇంకెవ్వరు పొత్తు పేరెత్తినా అది పాపాలకే పాపం. రాష్ట్రానికి శాపం అంటాడు.గత ఆరు నెలల్లో చంద్రబాబు ఇటు ప్రాంతీయ, అటు జాతీయ పార్టీలన్నిటితో కలిసి తిరిగాడు. దిల్లీ వెళ్లి కేజ్రీవాల్ కలిసాడు. మమతా బెనర్జీ ముందు మోకరిల్లాడు. కుమారస్వామి, దేవెగౌడాలను కలిసొచ్చాడు.

స్టాలిన్ తో, నితీష్ తో మీటింగ్ పెట్టి వచ్చాడు. చివరకు నానా తిట్లూ తిట్టిన కాంగ్రెస్ గూటికి చేరి రాహుల్ ను కావలించుకున్నాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ఇదే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేతను పక్క రాష్ట్రానికి చెందిన నేత వచ్చి కలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను చేసే పొత్తులన్నీ పవిత్రమైనవంటాడీయన. మరెవరైనా అదే పని చేయబోతే ఉలిక్కి పడి పోతుంటాడు. చంద్రబాబు చేతకానితనం ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతూ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో చక్రం అని ఎంత ప్రచారం చేసుకున్నా వాస్తవంలో బాబుకు అంత సీను లేదని తేటతెల్లం అయిపోయింది. దాంతో కేటీఆర్ జగన్ భేటీపై బాబు కిందా మీదా అయిపోతున్నాడు. ఇకేముంది ఇదేదో ప్రళయం అనే భయపడిపోతున్నాడు. గురివింద తన నలుపెరగదన్నట్టుగా తాను పెట్టుకున్న పొత్తుల గురించి పల్లెత్తు మాటనకుండా, జగన్ ఇంకా నిర్ణయమే ప్రకటించని విషయాలపై కంగారు పడిపోతున్నాడు. జగన్ ను కేటీఆర్ ఎలా కలుస్తాడు. ఎందుకు కలుస్తాడు? ఇది అన్యాయం అని ఆక్రోశిస్తున్నాడు.

ఇదీ జగన్ స్టామినా

బీజేపీ, కాంగ్రెస్సేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ చంద్రబాబు కంటే ముందు నించీ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఏపీలోని ప్రతిపక్ష నాయకుని కలిసి అభిప్రాయాలు పంచుకున్నారు ఇద్దరు యవనేతలు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్ లీడర్లు కలవడం వెనుక కూడా ప్రజాస్వామ్య బద్ధమైన కారణాలే ఉన్నాయి. ఈ మాత్రానికి బాబుకు అంత ఉలికిపాటేల? ఒక ముఖ్యమంత్రి అయ్యుండీ తానే స్వయంగా వెళ్లి కేటీఆర్ ను కలిసాడు చంద్రబాబు. కానీ అదే కేటీఆర్ ఓ ప్రతిపక్ష నేతను వెతుక్కుంటూ వచ్చి జాతీయ రాజకీయాల గురించి చర్చిస్తున్నాడు. ఇదీ నలభై ఏళ్ల అనుభవం రాజకీయాల్లో తెచ్చుకున్న అప్రదిష్ట. జగన్ సంపాదించుకున్న ప్రతిష్ట.

 

 

 

 

Back to Top