రేపటి వెలుగుల తొలి ’బడ్జెట్‌’ సమావేశాలు

ప్రజల కోసమే ప్రభుత్వమంటున్న సీఎం

రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు  
 

 

 దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో ఈ కుళ్లిపోయిన రాజకీయవ్యవస్థను కడిగేస్తాను...
తన పాదయాత్ర సందర్భంగా, అనేక సభల్లో ప్రజలను ఉద్దేశించి నేటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు.
అవును, అప్పుడు వ్యవస్థలు నీరుగారిపోయాయి. వ్యవస్థల్లో విలువల్ని పాతరేశారు. అవినీతి, దోపిyీ , వివక్ష రాజ్యమేలిన కాలమది. ప్రజలకు నేనున్నానంటూ...తాను అధికారంలోకి వస్తే, ఇలాంటి పాలన వుండదని జగన్‌ హామీ ఇస్తూ నడిచారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా అందాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్, నెలరోజుల పాలనలోనే ఎన్నెన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు .అందరూ ఆశించినట్టే నవశకానికి నాంది పలికారు. ఏ ఒక్కరోజూ వృధా పోకుండా, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది దిశలోనే అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలోనే మొట్టమొదటి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. 
తమ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో, ముందస్తుగా చెబుతూనే వస్తున్నారు ముఖ్యమంత్రి. గతంలోలా విపక్షం గొంతునొక్కే ప్రయత్నాలు కలలోనైనా చెయ్యమని, ప్రజాసమస్యలపై చర్చలకు పెద్దపీట వేస్తామని, ప్రతిపక్షానికి చాలినంత సమయం ఇచ్చేలా చూస్తామని చెప్పారు. అలాగే రేపటి బడ్జెట్‌ సమావేశాలకు దిశానిర్దేశం చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా అసెంబ్లీని దేవాలయంగా భావించాలని, సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. బాగా ప్రిపేరయి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చెప్పారు. 
రేపటి నుంచి మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాలు ఖచ్చితంగా గతానికి భిన్నంగానే వుంటాయని, రాష్ట్రప్రజలందరూ నమ్ముతున్నారు. సాధ్యమయినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని...ప్రజాసమస్యలు చర్చకు రావాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రిని రాజకీయమేధావులు ప్రశంసిస్తున్నారు. విలువైన అసెంబ్లీ సమావేశాల కాలం...మరింత విలువయిన ప్రజాపథకాలకు శ్రీకారం చుట్టేలా సాగాలని, ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యా ప్రస్తావనకు రావాలని, పరిష్కారాలు అసెంబ్లీ సాక్షిగా దొరకాలని ఆశించడంలో తప్పులేదు. ఆ దిశలో అసెంబ్లీ సమావేశాలు సాగితే, నిజంగానే కొత్త రాజకీయచరిత్రకు శ్రీకారం చుట్టినట్టే. 
తమ ప్రతినిధులగా నాయకులను చట్టసభలకు పంపే ప్రజలు వారిపై ఎన్నో నమ్మకాలు పెట్టుకుని వుంటారు. వారికెన్నో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. మెరుగైన పాలన సాగి, తామందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామిక వ్యవస్థలో ...ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఉండాలి. రాష్ట్రప్రగతే అనుదినలక్ష్యంగా పాలన సాగాలి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ ప్రభుత్వం గణనీయమైన మార్పును పట్టిచూపాలని ముఖ్యమంత్రి బలమైన సంకల్పం. అనుకున్నది సాధించడంలో రాజీలేని పోరాటం చేసిన నాయకుడికి, ఇది సాధ్యం కాని విషయమేమీ కాదు.

Back to Top