అమరావతి: అసభ్యకర పోస్టులు పెట్టారనే నెపంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు వర్రా రవీంద్రారెడ్డిని, ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవీంద్రారెడ్డికి సహకరించారనే కారణంతో సుబ్బారెడ్డి, ఉదయ్ అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వర్రా అరెస్ట్‌కు సంబంధించి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, వైఎస్సార్ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మీడియాకు వెల్లడించారు. వర్రా రవీంద్రారెడ్డి ఆరేడేళ్ల నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా వైయస్ఆర్‌సీపీవ్యతిరేకులైన వివిధ పార్టీల నాయకులపై తప్పుడు సమాచారం, ఫొటోలు పోస్ట్ చేశాడని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 8న పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్‌లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్ నంబరు 409/24, అండర్ సెక్షన్ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్‌విత్ 3(5) బిఎన్‌ఎస్ 2023 సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్‌మెంట్ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న రవీంద్రారెడ్డి కోసం గాలిస్తుండగా ఆదివారం రాత్రి 11.35 గంటలకు ప్రకాశం జిల్లా కుంట– ఆత్మకూరు రహదారిలో దొరికాడని చెప్పారు. రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. అనంతరం వారిని కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తరలించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామని చెప్పారు. కోర్టులో పిటిషన్ వేసి వర్రాను పోలీసు కస్టడీలోకి తీసుకుంటామని డీఎస్పీ మురళి తెలిపారు. ఇదిలా ఉండగా తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని వారం రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ నెల 4వ తేది అర్ధరాత్రి వేముల మండలం కొండ్రెడ్డిపల్లెలోని తమ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యంగా తన భర్తను తీసుకెళ్లారని చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి తమ అదుపులో లేడని పోలీసులు నాటకమాడారని ఆరోపించారు. పోలీసులు సోమవారం సాయంత్రం వర్రాను మీడియా ఎదుట హాజరు పరిచారు. ఇంటూరి విషయంలో హైడ్రామా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ప్రకాష్‌నగర్ పోలీసులు విశాఖపట్నం వెళ్లి అక్కడ మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఆయన్ను అరెస్టు చేసి రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఎవరి సంతకం లేని ఒక పేపర్ చూపించి రాజమహేంద్రవరం తరలించారు. దీంతో ఆందోళన చెందిన ఆమె హుటాహుటిన సోమవారం తెల్లవారుజామున ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన భర్త రవికిరణ్ ఆచూకీ తెలపాలని కోరారు. హార్ట్ పేషెంట్ అయిన తన భర్త మందులు వేసుకోవాలని పోలీసుల్ని బతిమాలారు. 12 గంటలపాటు స్టేషన్‌లోనే ఉన్న ఆయన్ని తనకు చూపించాలని కోరారు. అయినా పోలీసులు కనికరించలేదు. సెంట్రల్‌జోన్ డీఎస్పీ రమేష్‌బాబు ప్రకాష్‌నగర్ స్టేషన్‌కి రాగానే ఇన్‌స్పెక్టర్ బాజీలాల్ ఎఫ్‌ఐఆర్ సిద్ధం చేశారు. అనంతరం రవికిరణ్ భార్య సుజనను సంతకం చేసేందుకు పిలిచారు. ఏ నేరం చేశారని తన భర్తను అరెస్టు చేశారంటూ సుజన పోలీసులను నిలదీశారు. చివరకు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రవికిరణ్‌కు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టుకు తరలించారు. చెప్పని మాటలను చెప్పినట్లు రాశారు.. ఆస్పత్రి ఆవరణలో రవికిరణ్ గద్గదస్వరంతో మీడియాతో మాట్లాడారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లు రిపోర్టులో రాసి, తనతో సంతకాలు తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల సమక్షంలో రాయలేదని, టీడీపీకి పోలీసులు అమ్ముడుపోయారని మండిపడ్డారు. అనంతరం రవికిరణ్‌ను రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు ముందు పోలీసులు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, రవికిరణ్ బెయిల్‌పై బయటకు వస్తే వెంటనే అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు గుంటూరు పట్టాభిపురం, పల్నాడు జిల్లా మాచర్ల పోలీసులు పోలీస్‌స్టేషన్ వద్ద, కోర్టు వద్ద మాటు వేశారు. ఇదిలా ఉండగా వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా వెంటనే స్పందిస్తూ.. తను స్థానికంగా లేకపోయినా.. న్యాయవాదులను, పార్టీ నేతలను పోలీస్ స్టేషన్ వద్దకు పంపించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సుజనకు ధైర్యం చెప్పారు. రవికిరణ్‌కు అండగా నిలుస్తామని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ రీజినల్ కో ఆర్డినేటర్ సాదిక్ హుస్సేన్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో బలవంతంగా ఆరుగురి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, దొంతిరెడ్డి ఈశ్వరరెడ్డి, దొంతిరెడ్డి అమర్‌రెడ్డి, సుమారెడ్డి, జైరెడ్డి పేర్లను ఉద్దేశ పూర్వకంగా చేర్చిన ప్రకాష్‌నగర్ ఇన్‌స్పెక్టర్ బాజీలాల్.. నా భర్త ఇంటూరి రవికిరణ్‌తో దానిపై బలవంతంగా సంతకం చేయించారు. ఈ విషయాన్ని నా భర్త ప్రభుత్వాస్పత్రిలో చెప్పారు. ఇన్‌స్పెక్టర్ తీరు అసలు బాగోలేదు. నా భర్తపై పెట్టిన తప్పుడు కేసులతో గతనెల 21 నుంచి స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అయినా కేసులకు భయపడేది లేదు. – ఇంటూరి సుజన ‘‘టార్చర్ చేశారు సర్..’’ జడ్జికి గాయాలు చూపించి వాపోయిన వర్రా రవీంద్రారెడ్డి! సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ ఏపీలో వేధింపుల పర్వం కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. వైయస్ఆర్‌సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు. గత అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నాడు. ‘‘శుక్రవారం నన్ను అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పి టార్చర్ చేశారు సర్(తనకు అయిన గాయాలను జడ్జికి చూపించారు). వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ ప్రోద్బలంతోనే షర్మిల, సునీతలపై పోస్టులు చేశానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు ఒప్పుకోకపోవడంతో టార్చర్ చేశారు సర్. మేం ఏది చెప్పినా ‘యస్’ అనాలని వీడియో రికార్డు చేశారు సర్’’ అంటూ జడ్జి ఎదుట వాపోయారాయన. ఆ వివరాలన్నింటిని జడ్జి రికార్డు చేశారు. రవీంద్రారెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే సమయంలో.. రవీంద్రా రెడ్డి ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. మరోవైపు.. ఇదే కేసులో అరెస్ట్ అయిన సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డికి 41-ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జడ్జి ఆదేశాల నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. అనంతరం మళ్లీ కడప జైలుకు తరలించారు. ‘‘వర్రా రవీంద్రారెడ్డి ఎక్కడికి పారిపోలేదు. పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకుని టార్చర్ చేశారు. కర్నూలు టోల్ ప్లాజా సమీపంలో కళ్లకు గంతలు కట్టి వేధించారు. అరికాళ్లపై రాడ్లతో చితకబాదారు. మార్కాపురం తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. ఆయన మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి’’ : రవీంద్రారెడ్డి తరఫు అడ్వొకేట్ ఓబుల్‌రెడ్డి