సవాల్ కు సిద్ధంగా వైఎస్ జగన్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సవాళ్లకు ఆ పేరు చిరునామా. పోరాటానికి అతడి తీరే ఓ పాఠం. ప్రత్యర్థులకు అతడి నవ్వే గుణపాఠం. నిలువెత్తు ధైర్యంగా, నిరాడంబరతే వ్యక్తిత్వంగా ప్రకాశించే నవ నాయకుడు, యువనాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అతడి జీవితమే ఓ సవాల్ అనడంలో అతిశయోక్తి లేదు.

కాంగ్రెస్ పార్టీని వీడి

కోట్లాదిమంది గుండెచప్పుడుగా మారిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం ఆ గుండెలకు శరాఘాతమై తగిలింది. కుంగిపోయిన కొందరు అభిమానులు ఆర్తితో ప్రాణాలు వదిలారు. తండ్రి ప్రేమను పంచుకున్న ఆ అభిమానులను పరామర్శించడం తన బాధ్యత అనుకున్నారు వైఎస్ జగన్. కానీ ఓ గొప్ప నాయకుడి కొడుకుగా వైఎస్ జగన్ ఎదుగుదలను ఆపాలనుకున్న కాంగ్రెస్ పెద్దలు ఓదార్పు యాత్రకు అభ్యంతరాలు పెట్టారు. వీల్లేదని హుకుం జారీ చేసారు. తప్పనిస్థితిలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారు. రాజకీయ రణరంగంలో వైఎస్ జగన్ ఎదుర్కున్న తొలి సవాల్ ఇది. ఓ జాతీయ పార్టీని ధిక్కరించి, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిలబడగలగడం ఆ యువకుడు గెలిచిన తొలి సవాల్.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న మరో సవాల్ కొత్త పార్టీని స్థాపించడం. యువజన శ్రామిక రైతు పార్టీని స్థాపించి తండ్రి ఆశయాల దిశగా పయనించేందుకు సిద్ధపడ్డారు జగన్. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పిల్ల కాంగ్రెస్ అంటూ వెక్కిరించిన వారు ముక్కున వేలేసుకునేలా జాతీయ పార్టీతో ఢీకొన్నారు. పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీ మెడలు వంచి మెజారిటీకి అర్థం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలిచి 23 మంది శాసన సభ్యులు, కొందరు పార్లమెంట్ సభ్యులు అధికారపార్టీకి అమ్ముడు పోయినా కించిత్ కూడా చలించలేదు. తన పార్టీలోకి రావాలనుకున్న నేతలను పదవీ త్యాగం చేసి రమ్మని చెప్పి రాజకీయాల్లో జవాబుదారీతనం ఎంత ముఖ్యమో ఆచరణలో చేసి చూపించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కొత్త పార్టీ మాత్రమే కాదు రాజకీయంలో కొత్త సిద్ధాంతాలను ప్రవేశ పెట్టారు. విశ్వసనీయతకు పట్టం కట్టారు. ఓ నాయకుడిగా ఎందరో నాయకులను పుట్టించారు. ప్రజల్లోంచే అసలైన ప్రజాపాలకులు పుడతారని నిరూపించారు వైఎస్ జగన్.

అక్రమ కేసులపై పోరాడుతూ

కుట్రలకు తెరతీసిన కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తోడైంది. అక్రమ ఆస్తులంటూ అక్రమ కేసులు బనాయించింది. సిబిఐ, ఈడీ, విచారణ, ఛార్జ్‌షీట్లు, కోర్టు, అరెస్టు, అక్రమంగా 18 నెలల నిర్బంధం. ఇన్ని జరిగినా వైస్ జగన్ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. ఎవరి ముందూ తల వంచలేదు. న్యాయపరంగానే విచారణను ఎదుర్కుంటున్నారు. న్యాయస్థానంలోనే తనకు న్యాయం దక్కుతుందని నమ్ముతున్నారు. ప్రజలే అసలైన తీర్పు ఇస్తారని విశ్వసించారు. అదే నిజమైంది. అక్రమ కేసులన్నిటినీ ప్రజాకోర్టు ఒక్క తీర్పుతో కొట్టేసింది. ప్రజల నమ్మకం, వారి అభిమానం గెలుచుకోవడంతోనే ఆ యువనేత మూడొంతుల సవాల్ ను అధిగమించేసారు. ఇక మిగిలింది న్యాయస్థానం లో నిజనిరూపణ కావడం, నిర్దోషిగా, నిప్పులు కడిగిన సచ్ఛీలుడిగా వైఎస్ జగన్ ప్రజల ముందుకు రావడం.

ప్రతిపక్ష నేతగా

ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం. నిగ్గదీస్తే నిందించే పాలక పక్షం. పవిత్రమైన శాసన సభలో ప్రతిపక్ష నాయకుడికి పై మాటలదాడి. మహిళా ప్రతిపక్ష నేతపై దూషణలు. అసభ్యపదజాలంతో అవమానించడం. సంయమనంతో వ్యవహరించాల్సిన స్పీకర్ అధికారపార్టీ తొత్తుగా మారడం. విపక్షం గొంతు వినపడనీయకుండా మైకు కట్ చేయడం. వ్యక్తిగత  విమర్శలు, భౌతిక దాడులకు తెగబడటం. ఓ ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ఎదుర్కున్నది మామూలు సవాల్ కాదు. కనీసం ప్రతిపక్ష నేతకు సరైన భద్రత కల్పించలేదు ప్రభుత్వం. చివరకు అతడిపై హత్యాయత్నం జరిగినా అపహాస్యం చేసింది. ఈ సవాళ్లను కూడా సమర్థంగా ఎదుర్కున్నారు జగన్. అసెంబ్లీలో అడ్డుపడితే ఆగకుండా ప్రజల ముందుకు వెళ్లారు. ప్రభుత్వం చేసే అన్యాయాలపై ప్రజల మధ్య నిలిచే ప్రశ్నించారు. ప్రజల తరఫున అన్నీ తానై నిలిచారు. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలిచి పోరాడగలదని నిరూపించారు.

పాదయాత్రతో

రాష్ట్రం మొత్తం కాలనడకన సాగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సంకల్పించారు వైఎస్ జగన్. అదే ప్రజాసంకల్ప పాదయాత్ర. ఒకప్పుడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం ప్రారంభించి ప్రజల మనసు గెలుచుకున్నారు. చెల్లెలు షర్మిలమ్మ సైతం అన్న వదిలిన బాణాన్ని నేను అంటూ ప్రజల మధ్యన పాదయాత్రికురాలై సాగింది. అదే బాటలో వైఎస్ జగన్ సైతం ప్రజాసంకల్పంలోనే తన సంకల్పాన్ని తెలియజెప్పారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నారు. ప్రజలకు తానేం చేస్తాననేది ఆ పాదయాత్రలోనే స్పష్టంగా వివరించారు. ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలనే అస్త్రాలుగా సిద్ధం చేసారు. జగన్ పాదయాత్ర పదవీ యాత్ర అని, అక్కడకు వచ్చేది ప్రజలు కాదు గ్రాఫిక్స్ అనీ విమర్శలు చేసిన వారందరికీ పాదయాత్ర సక్సెస్ ను తిరుగులేని సమాధానంగా చూపారు వైఎస్ జగన్.

ముఖ్యమంత్రిగాను సవాల్ కు సిద్ధం

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది. ఖజానాను కొల్లగొట్టింది. అప్పుల తో రాష్ట్రాన్ని తిప్పల్లోకి నెట్టింది. సామాజిక అసమానతలను పెంచింది. వర్గ వైషమ్యాలను పెంచి పోషించింది. ఆర్థికవ్యవస్థను కుప్ప కూల్చింది. పరిపాలనను గాడిలో లేకుండా చేసింది. ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో ముఖ్యమంత్రిగా పదవిని అందుకోవడం అంటే ముళ్లున్న కుర్చీలో కూర్చోవడమే. అన్ని వైపులా సమస్యలే. వాటిని అధిగమించి, ఇచ్చిన హామీలను నెరవేర్చి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ముందున్న అతి ముఖ్యమైన సవాల్. ఎన్నో సవాళ్లను సాహసోపేతంగా ఎదుర్కుని, ఓర్పుతో జయించిన యువనాయకుడు ఈ సవాల్ ను కూడా ఇష్టంగా స్వీకరించారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మీరు మెచ్చేలా పాలన చేసి చూపుతానని ప్రమాణం చేసారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే తన హామీల అమలుకు సంతకంతో ముందడుగు వేసారు. జగన్ ఇన్నాళ్లుగా ఏ సవాల్ లోనూ ఓడిపోలేదు. ఇప్పుడూ అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ తన ముందు నిలిచిన సవాళ్లను గెలిచి చూపుతారని ప్రజలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు.

 

 

 

 

Back to Top