అమరావతి: అవ్వాతాతలకు, వితంతువులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.2,250 అందిస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51.44 లక్షల మంది లబ్ధిదారులు ఈ మొత్తాన్ని అందుకుంటున్నారు. రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) శాఖ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. సెర్ప్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మన రాష్ట్రంలో 24 రకాల కేటగిరీ పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ఆయా లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ కనిష్టంగా రూ.2,250 నుంచి గరిష్టంగా రూ.10 వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 13,412 మందికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.10 వేల చొప్పున పింఛన్‌ను అందజేస్తోంది. అవ్వాతాతలు, వితంతువులకు ఇప్పటిదాకా రూ.2,250 చొప్పున ఇస్తుండగా వచ్చే జనవరి నుంచి ఈ మొత్తాన్ని రూ.2,500కు పెంచాలని కూడా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.