సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్‌ 

 

గుంటూరు: ఎనిమిదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. గతంలో నెలకు రెండుసార్లు, వారానికి ఒకసారి మాత్రమే ఫిట్స్‌ వచ్చేవి. ఈ మధ్యకాలంలో రోజులోనే రెండు, మూడుసార్లు ఫిట్స్‌ వస్తున్నాయి. అయితే ఆపరేషన్‌ అంటే భయపడిపోయిన రోగికి తనతో మాట్లాడుతూ మెలకువగా ఉండి కూడా ఆపరేషన్‌ చేయించుకోవచ్చని అవేక్‌ సర్జరీలలో బాహుబలి సర్జన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న్యూరోసర్జన్‌ భరోసా ఇచ్చారు.

వెంటనే రోగి తనకు ఎంతో ఇష్టమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూపిస్తూ తనకు ఆపరేషన్‌ చేయాలని కోరాడు. రోగి మెలకువగా ఉండగానే రోగికి ఇష్టమైన సీఎం ప్రమాణస్వీకార వీడియోలను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ బాహుబలి సర్జన్‌ ఆపరేషన్‌ చేశారు. శనివారం గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి హాస్పటల్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్‌ న్యూరోసర్జన్‌  డాక్టర్‌ భవనం హనుమశ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 

రూ.4లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ ఆరోగ్యశ్రీలో ఉచితంగా.. 
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండటం ఇసుకత్రిపురవరం గ్రామానికి చెందిన 43 ఏళ్ల గోపనబోయిన పెద్ద ఆంజనేయులు రోజువారి కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ఇతను ఫిట్స్‌ బాధపడుతున్నాడు. గతంలో నెలలో రెండు సార్లు లేదా వారంలో ఒకసారి మాత్రమే ఫిట్స్‌ వచ్చేవి. ఈ మధ్యకాలంలో రోజుకు మూడుసార్లు ఫిట్స్‌ వస్తూ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. ఫిట్స్‌తో పాటుగా బ్రెయిన్‌లో సుమారు ఏడు సెంటిమీటర్ల పరిమాణంలో ట్యూమర్‌ ఏర్పడింది.


ఆపరేషన్‌ చేయించుకున్న పెద్ద ఆంజనేయులుతో వైద్యులు భవనం హనుమశ్రీనివాసరెడ్డి, త్రినాథ్‌

ట్యూమర్‌ వల్ల కాలు చేయి పటుత్వం కోల్పోయి వస్తువులేమీ చేతితో పట్టుకునే అవకాశం లేకుండా పోయింది. పలు ఆస్పత్రుల్లో మందులు వాడినా సమస్య తగ్గలేదు. గత నెలలో గుంటూరులోని తమ ఆస్పత్రికి రోగి వచ్చాడని డాక్టర్‌ భవనం హనుమశ్రీనివాసరెడ్డి చెప్పారు. అతడికి ఎమ్మారై స్కానింగ్, బ్రెయిన్‌ తీడీ మ్యాప్‌ టెక్నాలజీ చేసి బ్రెయిన్‌లో అతిసున్నిత భాగమైన ఫ్రాంటల్‌ ప్రీమోటార్‌ ఏరియా నుంచి మిడిల్‌ ప్రాంటల్‌ గైరస్‌ వరకు సుమారు ఏడు సెంటీమీటర్ల పరిమాణంలో ట్యూమర్‌ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. అతి సున్నితమైన భాగాల్లో ట్యూమర్‌ ఉండటం వల్ల మెలకువగా ఉండి(అవేక్‌ సర్జరీ) ఆపరేషన్‌ చేయించుకుంటే బాగా ఉపయోగముంటుందని రోగికి కౌన్సెలింగ్‌ చేశామని తెలిపారు.

Back to Top