మద్య నిషేధంలో మరో ముందడుగు

 

3648 కిలోమీటర్ల పాదయాత్రలో మద్యం వల్ల నాశనమైన కుటుంబాలను చూసి చలించారు. మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేయాలి. పేదవాడి కుటుంబంలో వెలుగులు నింపాలి. మద్యానికి బానిపై రోడ్డున పడుతున్న కుటుంబాల్లో కొత్త కల తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించారు. దశలవారీ మద్యనిషేధం అని ఇచ్చిన మాట ప్రకారం.. సీఎం వైయస్‌ జగన్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మొదట బెల్టుషాపులు, తరువాత 20 శాతం వైన్‌షాపుల తగ్గింపు, ఇప్పుడు నూతన బార్ల పాలసీ తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఉన్న బార్లను 40 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మహిళలంతా జేజేలు కొడుతున్నారు.

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రంలోని 44 వేల బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. గుడి, బడి, ఇళ్ల సమీపంలో ఉన్న బెల్టు షాపులను సమూలంగా తీసేశారు. అదే విధంగా 4380 వైన్‌షాపులను 20 శాతం తగ్గించి వాటి సంఖ్య 3500కి చేర్చారు. వీటన్నింటినీ ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నడిపే 3500 వైన్‌షాపుల్లో 8033 సేల్స్‌మెన్స్, 3500 సూపర్‌వైజర్లను నియమించారు. దాదాపు 12 వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పించారు.

అదే విధంగా రాష్ట్రంలో మొత్తం 839 మంది బార్ల నిర్వహణకు లైసెన్స్‌లు తీసుకున్నారు. స్టార్‌ హోటల్స్, పబ్బులు మినహాయిస్తే 797 బార్లు నడుస్తున్నాయి. దశలవారి మద్య నిషేధంలో భాగంగా బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించనున్నారు. అంటే రాష్ట్రంలో 319 బార్లను మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న బార్లను తీసేసి కొత్తగా లైసెన్స్‌లు అందజేయనున్నారు.  బార్ల లైసెన్స్‌ ఫీజు కూడా పెంచబోతున్నారు. లైసెన్స్‌ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్ధతి ద్వారా మంజూరు చేయనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలులోకి రానుంది. మద్యం కల్తీ జరిగినా.. నాటు సారా తయారు చేసినా నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మద్య నిషేధం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా.. పేదల కుటుంబంలో సంతోషం నింపాలని ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారు. మద్యం కుటుంబాల్లో చిచ్చుపెడుతుందని, రోడ్డున పడేస్తుందని, అనారోగ్యాలకు గురిచేస్తుందని పాదయాత్రలో తెలుసుకున్నారు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తాను.. అక్కచెల్లెమ్మల మొహాల్లో ఆనందాన్ని చూస్తానని మాటిచ్చారు. సంపదను సృష్టించేందుకు మార్గాలు అన్వేషిస్తూ.. మద్యం మహమ్మారిని రూపుమాపేందుకు ముందడుగులు వేస్తున్నారు.

Read Also: సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటా

 

Back to Top