నల్ల డబ్బు..ఎల్లో నేతల్లో ఫీవర్‌

ఐటీ దాడులతో టీడీపీ నేతల్లో అలజడి

చంద్రబాబు పీఎస్‌ వద్దే రూ.2 వేల కోట్ల అవినీతి సొమ్ము

చంద్రబాబు అక్రమార్జన సింగపూర్‌కు వెళ్లిందా? 

 వెలుగు చూడని అవినీతి సొమ్ము ఎంతో?

 టీడీపీ నేతలను ఛీదరిస్తున్న తెలుగు ప్రజలు

అమరావతి: నిత్యం తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు అవినీతి తుప్పు ఐటీ దాడులతో వదులుతోంది. చంద్రబాబు వద్ద పర్సనల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు వద్ద రూ.2 వేల కోట్ల నల్లధనం ఉన్నట్లు ఐటీ దాడుల్లో వెలుగు చూసింది. పీఏ వద్దే ఇంత అవినీతి సొమ్ము ఉందంటే..అప్పట్లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఇంకెంత కూడబెట్టింటారో అన్న చర్చ  ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.  చంద్రబాబు పీఏ అక్రమాస్తులపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిన వివరాల్లో అత్యంత కీలకమైన విషయమేమంటే... ఒక చంద్రబాబు వద్ద పీఎస్‌ గా పనిచేసిన వ్యక్తి నుంచి కీలకమైన పత్రాలు అనేక ఆధారాలు లభ్యమైనట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేకచోట్ల అనేక చోట్ల పలువురు వ్యక్తులు ఇన్ ఫ్రా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో కూడా ఐటీ అధికారులు 6 రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

గడిచిన ఆరు రోజులుగా జరుపుతున్న సోదాల్లో భాగంగా  బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో అక్రమార్కులు భారీ కుంభకోణాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ... ప్రాథమిక అంచనాల ప్రకారం 2000 వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంచనా వేసింది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది.

డొల్ల కంపెనీల ద్వారా దోపిడీ..
పన్ను లెక్కలకు దొరకకుండా డొల్ల కంపెనీల ద్వారా రూ. 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులను దారి మళ్లించినట్లు గుర్తించింది. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామని... గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడైందని పేర్కొంది. ఐటీ దాడుల్లో భాగంగా.. లెక్కల్లో చూపని రూ. 85 లక్షల నగదు,  రూ. 71 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపింది.  పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన చంద్రబాబుకు బినామీగా ప్రచారం సాగుతోంది.
 
బాబు బ్యాచ్‌ మౌనవ్రతం..
కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన తర్వాత రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు తేలుకుట్టినట్టు నోరుపెగలకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ముఖ్యులు. చంద్రబాబు పీఎస్‌ ప్రస్తావన నేరుగా ఉన్న తర్వాత కూడా రోజుకు నాలుగు ప్రెస్‌మీట్లు పెట్టే మహానాయకుడు స్పందించలేదు. ఆయన పార్ట్‌నర్‌ కూడా స్పందించలేదు. నీతి, నిజాయితీల కోసం ఎర్రజెండా పట్టామన్న సీపీఐ రామకృష్ణకు కూడా ఈ తేలు ఎందుకు కుట్టిందో మాకు అర్థం కావడంలేదు. ఆయన నోరు ఎందుకు పెగల్లేదో ఆయనే సమాధానం చెప్పాలి. దీంతోపాటు ఎల్లోమీడియా పెద్దలు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా అంచనా వేసిన రూ.2వేల కోట్ల అక్రమ, నల్లధన లావాదేవీల మీద ఎందుకో సిగ్గుపడ్డారు. ఆ ప్రెస్‌రిలీజ్‌లో మొట్టమొదటి వాక్యంలోనే అత్యుతన్న వ్యవస్థల్లో ఒకటైన సీబీడీటీ 2వేల కోట్ల రూపాయలకు పైగా నల్లధనం లావాదేవీలను గుర్తించాం అని పెద్ద అక్షరాల్లో చెప్పారు. అయినా బాబు బ్యాచ్‌ నోరు విప్పడం లేదు.   

దేశం విడిచి పారిపోకుండా చూడాలి..
ఐటీ దాడులతో టీడీపీ నేతల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పుడు లాగింది కేవలం తీగ మాత్రమే. కదలాల్సిన డొంక చాలా పెద్దదే ఉంది.ఈవిషయాన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తోంది. ఆధారాలను ఎప్పటికప్పుడు ప్రజలముందు బయటపెట్టింది. ఇప్పుడిక చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌పై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించి ముందుగా ఆయన వ్యవస్థలను మేనేజ్‌ చేయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భయంతోనే బీజేపీలో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తన రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపాడని, పవన్‌కళ్యాణ్‌ను తనకు రక్షణగా వాడుకుంటున్నాడని అర్థమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు పార్టనర్‌లకు, చంద్రబాబులకు మధ్య గత ఐదేళ్లుగా తెరవెనుక జరిగిన లావాదేవీల మధ్య దృష్టిపెట్టాల్సి ఉంది. 

చంద్రబాబు అకస్మాత్తుగా హైదరాబాద్‌ పయనం..
 మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు అకస్మాత్తుగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము లెక్కలు బయటపడిన క్రమంలో.. గురువారమే హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు. ఐటీ దాడుల్లో తన మాజీ పీఎస్‌ నుంచి అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోవడంతో.. నిన్న రాత్రి నుంచి న్యాయవాదులు, తన ఆడిటర్లతో బాబు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఐటీ సోదాల నేపథ్యంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఐటీ సోదాల్లో చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో పలు కీలక డైరీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.  పీఎస్‌ల స్థాయిలోనే రెండువేల కోట్ల అక్రమార్జన బయటపడితే అసలు పెద్దలు ఎంత నొక్కేసి ఉంటారో అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఐటీ దాడుల్లో పట్టుబడ్డ ఇన్‌ఫ్రా కంపెనీల డైరెక్టర్ల జాబితా తీస్తే పెద్దచేపల బండారం బయటపడుతుందంటూ చర్చించుకుంటున్నారు. మరింత లోతుగా విచారణ చేపడితే చంద్రబాబు అవినీతి పెద్ద ఎత్తున బయటపడుతుందని జనం చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఐటీ దాడులతో తెలుగు దేశం పార్టీ నేతలకు వైరల్‌ ఫీవర్‌ పట్టుకుందని సోషల్‌ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు. 

Back to Top