శరవేగంగా పునరుద్ధరణ పనులు

 తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

శరవేగంగా సబ్‌ స్టేషన్లు, ఫీడర్ల మరమ్మతులు, స్తంభాల ఏర్పాటు

అమరావతి : గులాబ్‌ తుపాను కారణంగా తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల పరిధిలో సంస్థకు వాటిల్లిన ప్రాథమిక నష్టం రూ.7.87 కోట్లుగా అధికారులు తేల్చారు. 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాన్‌ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ భారీ నష్టం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో ఒక ఎక్స్‌ట్రా హైటెన్షన్‌ సబ్‌ స్టేషన్‌తో పాటు 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు 380, ఫీడర్లు 276, స్తంభాలు 107, లైన్లు 10 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 1,623, స్తంభాలు 1,120, లైన్లు 51.19 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 66.58 కిలోమీటర్ల  మేర, ఎల్టీ కేటగిరిలోనే 1,719 స్తంభాలు, 678 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమైనట్టు ఏపీఈపీడీసీఎల్‌ సిబ్బంది గుర్తించారు. తుపాను వల్ల 24 పట్టణాలు, 103 మండలాలు, 3,821 గ్రామాల్లో 11,26,959 వ్యవసాయేతర, 4,767 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

 ముందస్తు ప్రణాళిక ప్రకారం పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిన విద్యుత్‌ శాఖ ఈహెచ్‌టీ సబ్‌ స్టేషన్, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 364, ఫీడర్లు 255, స్తంభాలు 75, లైన్లు 5.5 కిలోమీటర్ల మేర బాగు చేశారు. 11 కేవీ ఫీడర్లు 1,255, స్తంభాలు 390, లైన్లు 23.35 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 18.55 కిలోమీటర్లు, ఎల్టీ పోల్స్‌ 403, ట్రాన్స్‌ఫార్మర్లు 154 చొప్పున మరమ్మతులు పూర్తి చేశారు. 8,85,419 వ్యవసాయేతర, 1,463 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. మంగళవారం ఉదయానికల్లా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్‌ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, మిగిలిన జిల్లాల్లో కొన్నిగంటలపాటు అంతరాయం ఏర్పడిందన్నారు.  

అమరావతి: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరిగిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు.

► శ్రీకాకుళం జిల్లాలో గార, వజ్రపుకొత్తూరు, జి.సిగడాం, కవిటి, సంతబొమ్మాళి తదితర మండలాల్లో ఆదివారం రాత్రి నేలకొరిగిన భారీ వృక్షాలను సోమవారం తెల్లవారుజాముకల్లా పోలీసులు తొలగించారు.
► విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ తదితర మండలాల్లో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితంగా తరలించారు.
► విశాఖ జిల్లాలోని నారాయణపట్న బ్రిడ్జి, తాండవ బ్రిడ్జి, హుకుంపేట బ్రిడ్జి, సోమదేవపల్లి, బంగారంపాలెం, రాజయ్యపేట, దొండవాక తదితర లోతట్టు ప్రాంతాల వాసులను పోలీసులు పునరావాస శిబిరాలకు చేరవేశారు.
► పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలోని జల్లేరు వంతెనపై రాకపోకలకు కలిగిన అంతరాయంపై పోలీసులు సత్వరం స్పందించి పరిష్కరించడం ప్రశంసలు అందుకుంది. పోలవరం సీఐ అల్లు నవీన్, బుట్టాయగూడెం ఎస్సై జయబాబు  మరమ్మతులు చేయించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం తొలగించారు.
► కోల్‌కతా–చెన్నై హైవేపై రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. దాంతో పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. 

ఆ కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి
ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని, ఆయా కుటుంబాలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1,000 చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షపు నీరు కారణంగా తాగునీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్‌ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని, జనరేటర్లతో వాటర్‌ స్కీంలు నిర్వహించాలని ఆదేశించారు.
 
పంట నష్టం అంచనాలు రూపొందించాలి

పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలని, నష్టం అంచనాలు వెంటనే సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎన్యుమరేషన్‌ చేసేటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. 

Back to Top