ఆంగ్ల మాధ్యమంపై అపోహలు వీడండి

ఏపీలో 62శాతానికి పైగా, తెలంగాణాలో 68 శాతానికి దగ్గరగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం ఉండాలనే వారి సంఖ్య పెరుగుతోంది. అర్బన్, సెమీ అర్బన్ లో తెలుగు మీడియం లో జాయినింగ్లు దాదాపుగా శూన్యం. ఇదీ నేటి తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల, తెలుగు మాధ్యమాల చదువు పరిస్థితి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ప్రాధమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి నిర్ణయం పట్ల ఎదురౌతున్న వ్యతిరేకత గురించి చర్చిద్దాం.
ఆంగ్ల మీడియం వద్దంటున్న మేధావులు చెబుతున్న కారణాలు రెండు
పిల్లలు అర్థం చేసుకోలేరు. తెలుగుకు దూరమైపోతారు.
మొదటిదాని సంగతి చూద్దాం...
నిరుపేదల పిల్లలు సైతం ప్రైవేటు బడుల్లో ఎల్‌.కే.జీ స్థాయి నుంచే ఆంగ్లాన్ని సులువుగా నేర్చుకుంటున్నారు. సెల్‌ఫోన్ ఆపరేట్ చేయగల తెలివితేటలు నేటి చిన్నారుల సొంతం. అంతవేగంగా క్యాచ్ చేయగల చిన్నారులకు ప్రాధమిక దశ నుంచే ఆంగ్ల పరిజ్ఞానం అబ్బితే మరింత మెరుగ్గా విషయపరిజ్ఞానం పొందగలరు. నేడు ప్రతి స్కూల్లో ప్రీప్రైమరీ నుంచే కంప్యూటర్‌ ఎందుకు నేర్పుతున్నారు? వాళ్లెలా అర్థం చేసుకుంటున్నారు? అలాగే ఒకటవ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధించినా అర్థం చేసుకోగలరు. ప్రైవేటు స్కూల్లో నేర్పగా అర్థమయ్యినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఆంగ్లభాషలో చెబితే ఎందుకు అర్థం అవదూ!! ఇక గిరిజన, ఎస్టీ విద్యార్థులకు నష్టం అంటున్న వాళ్లు చెబుతున్నదేంటి? గిరిజన బిడ్డలు ఆంగ్ల మాధ్యమంలో చెబితే నేర్చుకోలేరు, అర్థం చేసుకోలేరని ఎగతాళి చేస్తున్నారా? మిగిలిన వాళ్లతో పోలిస్తే వీరి ఐక్యూ చాలా తక్కువ అని మీ ఉద్దేశ్యమా?  మేధావులు కాస్త సమాధానం చెప్పాలి.
రెండో కారణం విషయానికొస్తే...
తెలుగు భాష నిర్వీర్యం అయిపోతోందని శోకాలు పెడుతున్న భాషా ప్రేమికులంతా తమ సొంత బిడ్డలకు తెలుగు మాధ్యమంలో ఆప్షన్ తీసుకునే అవకాశం కూడా లేని స్కూళ్లలో చేర్పించి ఉన్నత చదువులు చదివించారు. అయినా వీరంతా తెలుగులో మాట్లాడుతూనే ఉన్నారు గదా? కానీ ఉన్నత విద్యాభ్యాసాల దగ్గర, పోటీ పరీక్షల్లో, ఉద్యోగ సాధన దగ్గర మీ పిల్లలతో పోలీస్తే తెలుగు మాధ్యమం వారు వెనుకబడిపోతున్నారు. ఇందుకు కారణం వారికి ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశాలు లేకపోవడమేగా? అయితే తెలుగు మాధ్యమంలో చదివి కలెక్టర్లు అవుతున్న వాళ్లు లేరా అంటూ మళ్లీ ఓ పిడి వాదం ముందుకొస్తుంది. మేమంతా అలా చదివి ఇప్పుడు ఇలా ఉన్నాం అని గొప్పలు ప్రదర్శించడం కూడా ఉంటోంది. కానీ ఎందరు అలా ఆ స్థాయిని అందుకోగలిగారు? ఎన్నో చోట్ల అవమానాలను దాటుకుంటూ, పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగలవారెందరు? ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే తెలుగు అంతరించిపోతుందంటే ఈ వితండ వాదం చేసేవాళ్లందరూ తెలుగు ద్రోహులు కాదా??  

Read Also: కౌలురైతులకు గడువు పెంపు

   

తాజా ఫోటోలు

Back to Top