అమరావతి: సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల సాయాన్ని అందించిన సీఎం వైయస్ జగన్.. వరుసగా ఐదో విడత ఆర్థిక సాయాన్ని శుక్రవారం అందించనున్నారు. విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు. దీనితో కలిపి వైయస్ఆర్ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుంది. సీఎం వైయస్ జగన్ శుక్రవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి విద్యాధరపురం స్టేడియంకు చేరుకొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి వైయస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.