చరిత్రకారుడు

వైయస్‌ జగన్‌ 60 రోజుల పాలనపై ప్రసంశల వర్షం

దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌

మొట్ట మొదటి సమావేశాల్లోనే 20 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం

40 ఏళ్ల అనుభవం ఉన్న నేతలు చేయలేని పని 45 ఏళ్ల యువకుడు చేసి చూపించారు

నాడు రాజన్న తన బిడ్డను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తూ యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరిలో ఒక్కడిగా, మీకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటాడు. మీకు సేవ చేయాలని ఉత్సాహపడుతున్నాడు. ఆశీర్వదించండి అని చెప్పారు.నాడు ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజం చేసి చూపుతున్నాడు యువనేత వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి.

అరవై రోజుల అతడి పాలన అనితర సాధ్యం. దేశంలో ఏ ప్రభుత్వమూ సాహసించని నిర్ణయాలు అతడు తీసుకున్నాడు. ఏ ముఖ్యమంత్రీ చేయని వేగంతో పని చేస్తున్నాడు. వ్యవస్థాగతమైన మార్పుకు శ్రీకారం చుట్టి పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నాడు. తెలుగు ప్రజలకు కొత్త ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు.

తొలి అడుగే సంచలనం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే నవరత్నాల అమలుతో తన చిత్త శుద్ధిని నిరూపించుకున్నారు వైఎస్ జగన్.  మేనిఫెస్టో మా ప్రభుత్వానికి భవద్గీత, బైబిల్, ఖురాన్ అని ప్రకటించారు. కేబినెట్ ఏర్పాటులోనూ ముఖ్యమంత్రి కొత్త సంప్రదాయానికి తెరతీసారు. ఐదుగురు డిప్యూటీ సీఎమ్ లను నియమించడమే కాదు, అందులో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. రెండున్నరేళ్లకే రెండో దఫా కేబినెట్ ఉంటుందని ముందే ప్రకటించి సంచలనం రేపారు. ఫించన్లు, ఆశా వర్కర్ల జీతాల పెంపు పై తొలిసంతకం చేసారు.

రైతు పక్షపాతిగా

రైతులకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే అమలు చేసి చూపారు వైఎస్ జగన్. తొమ్మిదిగంటల పగటి విద్యుత్, రైతులకే కాదు కౌలు రైతుకూ పెట్టుబడి సాయం, పంట బీమా చెల్లింపు, మార్కెట్ స్థిరీకరణ నిథి ఏర్పాటు ఇలా ఇచ్చిన ప్రతిహామీనీ నెరవేర్చారు. రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉంటుందని పాదయాత్రలో ఆనాడు చెప్పిన మాటను అక్షరాలా నిజం చేసి చూపారు. ఏసీ రూముల్లో కూర్చుని ప్రకటించిన హామీలు కాదు, ప్రజా సంకల్ప యాత్ర సమయంలో ఎండిపోయిన పంటలను, నీరు లేని బోరులను, మద్దతు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను చూసి చలించి పోయిన వైఎస్ జగన్ అక్కడికక్కడే కొన్ని రైతు సంక్షేమ పథకాలు ప్రకటించారు. అధికారం చేపట్టగానే వాటన్నిటినీ అమలు చేసి చూపించారు.

మేనిఫెస్టో అమలు దిశగా

నవరత్నాలనే కాక మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిహామీ పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నారు ముఖ్యమంత్రి. అమ్మ ఒడి పథకం హైస్కూలు విద్యార్థుల వరకే చెప్పినా, దాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపచేసారు.  ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించారు. అంగన్ వాడీ  కార్యకర్తలు, ఆశావర్కర్లు, యానిమేటర్ల జీతాలు పెంచారు.  మద్య నిషేదానికి వీలుగా బిల్లు రూపొందించారు. బెల్లు దుకాణాల తొలగించారు. పెద్ద ఎత్తున చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజులపై కొరడా ఝుళిపించారు. లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు కొలువుల పండుగ తెచ్చారు.

పాలనలో వైవిధ్యం

గత పాలకుల అసమర్థత వల్ల పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు లేకుండా పోయాయి. నిరుద్యోగ సమస్య పెరిగింది. రాజకీయాల్లో విలువలు అధఃపాతాళంలో పడిపోయాయి. ఫిరాయింపులపై చర్యలు కూడా తీసుకోని నీతిమాలిన విధానాలు చూసి ప్రజలు ఏవగించుకున్నారు. కానీ యువ ముఖ్యమంత్రి అనుభవం కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని నిరూపించారు. ఫిరాయింపులను తమ ప్రభుత్వం ప్రోత్సహించదని అసెంబ్లీ సాక్షిగా తెలియజేసారు. తోటి తెలుగు రాష్ట్రంతో సత్సంబంధాలు మెరుగు పరచారు. నీటి తగాదాల కోసం ట్రిబ్యునల్ గడప తొక్కే అవసరం లేకుండా పంపకాల విషయంలో సామరస్యధోరణికి స్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో అమలు విషయాల్లోనే కాదు అవినీతిపై యుద్ధం విషయంలోనూ జగన్ తన పంథాను ప్రకటించారు. అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రజావేదిక కూల్చివేత ద్వారా ఆరంభించారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఉండబోవని హెచ్చరికలు జారీ చేసారు. రాష్ట్రంలోని అన్ని అక్రమ కట్టడాలకూ ఇది వర్తిస్తుందని తెలియజేసారు. పంచాయితీ వ్యవస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టారు వైఎస్ జగన్. గ్రామవార్డు సచివాలయాలు నిజమైన వికేంద్రీకరణ కేంద్రాలుగా ఉండబోతున్నాయి. అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండానే గ్రామ సచివాలయంలోనే అన్ని పనులూ జరగడం మునుపెన్నడూ జరగని నవీన సంస్కరణ.

ఆరోగ్యకరంగా అసెంబ్లీ సమావేశాలు

ప్రతిపక్ష సభ్యులకు మైకు ఇవ్వకపోవడం లేదు. స్పీకర్ పక్షపాత ధోరణి అసలే లేదు. విపక్ష సభ్యుల ప్రశ్నలకు కూడా చతురతతో ఛలోక్తులతో సమాధానం ఇస్తూ నవ్వులు పూయించే శాసనసభా సమావేశాలను గత చరిత్రలో ఎక్కడా చూసి ఉండం.  ప్రజాసంక్షేమానికి నిదర్శనమైన 20 కీలక  బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు, సంస్కరణలు, అభివృద్ధి విధానాలను ప్రోత్సహించే ఈ బిల్లులు రాష్ట్ర ప్రగతికి తొలి మెట్లు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ  60 రోజుల పాలనే రాబోయే ఐదేళ్ల సుపరిపాలనకు నాందీ ప్రస్థానం కానుంది.

 

 

 

 

 

Back to Top