మరింత మెరుగ్గా వికేంద్రీకరణ బిల్లు

ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించడానికే మూడు రాజధానుల బిల్లు వెనక్కి

త్వరలోనే సమగ్ర బిల్లును మళ్లీ సభ ముందుకు తెస్తాం

రాజధాని - వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లుపై అసెంబ్లీలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ 

మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లును మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా తెలియచేసేందుకు... ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా జోడించేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుని అన్ని అంశాలతో  పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లును త్వరలోనే మళ్లీ సభ ముందుకు తెస్తాం. రాష్ట్ర విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’’  

అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వాటిని ఆవిష్కరించింది కాబట్టే రెండున్నరేళ్లుగా ఏ ఎన్నికల్ని తీసుకున్నా మనసారా దీవిస్తూ వచ్చారు’’    – అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్‌ 
రాజధాని - వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లుపై మాట్లాడుతూ సభలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...

చాలా సుదీర్ఘంగా ఆర్ధికమంత్రి రాజేంద్రనాథ్‌ వివరణ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్ణయం వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో చాలా సుదీర్ఘంగా వివరించారు. చరిత్ర అంతా వివరించారు.  1953 నుంచి 1956 వరకు ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆరోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత 1956లో కర్నూలు నుంచి రాజధానిని కానీ, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు ఏ రకంగా తీసుకుని పోయారు, తీసుకుని పోయేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని శ్రీబాగ్‌ ఒడంబిక, అవన్నీ చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం  చంద్రబాబునాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం, అప్పట్లో ఆ నిర్ణయం కాంట్రవర్సెల్‌ అని తెలుసు. అప్పట్లో అన్ని రకాలుగా శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని తెలుసు. అయినప్పటికీ కూడా తాను ఇక్కడ 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

ఈరోజుకు కూడా నేను చెపుతున్నాను. అలా నిర్ణయం తీసుకోవడం వల్ల... ఈ ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదు.  నా ఇళ్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం అటు విజయవాడ కాదు ఇటు గుంటూరు కాదు. ఇక్కడ నుంచి గుంటూరు తీసుకుంటే 40 కిలోమీటర్లు, విజయవాడ తీసుకుంటే మరో 40 కిలోమీటర్లు . ఇక్కడ కనీస మౌలికసదుపాయాలు చూస్తే... రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మాత్రమే అయ్యే ఖర్చు... గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు. 50వేల ఎకరాలు అంటే లక్ష కోట్లు రూపాయలు అని లెక్కవేశారు. లక్ష కోట్లు అనేది ఈ రోజు లెక్కలు ప్రకారం. ఒక పదేళ్లు పోతే ఇది కట్టడానికి ఆ లక్ష కోట్లు తేవడానికి, తెచ్చి పెట్టడానికి  పదేళ్లు పడుతుందో ఇంకా ఎక్కువ కాలం పడుతుందో తెలియదు కానీ.. ఒక పదేళ్లు పోతే ఇవాళ ఖర్చయ్యే  లక్ష కోట్ల విలువ అది ఏ ఆరు లక్షల కోట్లో, ఏడు లక్షల కోట్లో అవుతుంది. అంటే మన దగ్గరున్న డబ్బుతో కనీసం మనం రోడ్లేసుకోవడానికి, డ్రైనేజీ వేసుకోవడానికి, కరెంటు ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో  మనం ఉంటే... ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా?

ఈ రకంగా ప్రజలను మిస్‌లీడ్‌ చేయడం ధర్మమేనా? అసలు మనకంటూ, మన పిల్లలకంటూ ఏదైనా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి, ఒక సిటీ ? ఒక ఎస్టాబ్లిస్‌మెంట్‌ అనేది ఎప్పటికి వస్తుంది ? చదువుకున్న  మన పిల్లలు ఉద్యోగాలు కోసం ఎప్పుడు కూడా పెద్దనగరాలైన హైదరాబాద్‌కో, బెంగుళూరుకో, చెన్నైకో వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా ?

అనే ఆలోచనల మధ్యలో నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బిగ్గెస్ట్‌ సిటీ ఈజ్‌ విశాఖపట్నం. అది రాష్ట్రంలో పెద్ద నగరం. 
ఇటువంటి పెద్ద నగరంలో ఇప్పటికే రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీ ఉంది, కరెంటుతో పాటు అన్ని రకాల మౌలికసదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. దానిమీద కొద్దిగా సుందరీకరణమీద, సదుపాయాలు మీద, వసతుల మీదనో వేల్యూ ఎడిషన్‌ చేస్తే చాలు ఆ నగరం అనేది ఈ రోజు కాకపోయినా ఐదేళ్లకో, పదేళ్లకో హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది. 
ఇది వాస్తవమైన పరిస్థిది. ఇటువంటి వాస్తవాలను గుర్తెరిగే ఇక్కడ రాష్ట్రంలో మూడు ప్రాంతాలూ కూడా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలి అనే ఉద్దేశ్యంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని, ఇక్కడ ఈ ప్రాంతంలో.. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి (అమరావతిలో) లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని, కర్నూలు 1953 నుంచి 1956 వరకు ఇంతకముందు ఆంధ్రరాష్ట్రానికి రాజధాని.. అటువంటి రాజధానిని అక్కడ నుంచి తరలించాం. అప్పటి నుంచి వాళ్ల ఆకాంక్షలు కూడా ఉన్నాయి. వాళ్ల ఆకాంక్షలు కూడా పరిగణలోకి తీసుకుని కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ పెట్టాలని.. మూడు ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా వికేంద్రీకరణ ద్వారా మంచి జరిపించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. 

అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఏమేం జరిగాయో మన కళ్లముందునే చూస్తున్నాం. దాదాపుగా మనం ఈ ఆలోచన చేసినప్పటి రోజు నుంచి చూస్తే... ఈ ఒకటిన్నర, రెండు సంవత్సరాలుగా దీన్ని రకరకాలుగా వక్రీకరిస్తూ, రకరకాలుగా ట్విస్ట్‌ చేస్తూ, రకరకాల అపోహలు సృష్టిస్తూ, రకరకాలుగా న్యాయపరమైన చిక్కులు క్రియేట్‌ చేస్తూ, రకరకాలుగా దీనిని తీసుకుపోతున్నారు. ఇటువంటి నేపధ్యంలో నేను ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది. 

రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకి దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవి. నాటి శ్రీబాగ్‌ ఒడంబిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగింది. 

గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా  ప్రస్ఫుటంగా వ్యక్తమయింది. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం. 

అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు... వీరందరి ఆశలూ ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే, మన ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు, ఈప్రభుత్వాన్ని. 

అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక  అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదననుకూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశాం. 

ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగాగానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటినికూడా పొందుపరిచేందుకు, ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. 

విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top