యువతలో క్రీడా స్ఫూర్తిని నింపిన‌..‘ఆడుదాం ఆంధ్రా’ 

నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు 

రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా క్రీడా పోటీలు నిర్వహించిన ప్రభుత్వం

వివిధ క్రీడల్లో పోటీ పడిన 25.40 లక్షల మంది క్రీడాకారులు

అన్ని దశల్లో కలిపి రూ.12.21 కోట్ల నగదు బహుమతులు

రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లు అందజేత

ప్రఖ్యాత సంస్థలతో టాలెంట్‌ హంట్‌ నిర్వహణ

ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేలా తర్ఫీదు

విశాఖలోని వైయ‌స్ఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైయ‌స్ జగన్‌

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మట్టిలోని మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫైనల్‌ దశకు చేరుకుంది. మంగళవారం విశాఖపట్నంలోని వైయ‌స్ఆర్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 

Adudam Andhra Final competitions: Andhra pradesh - Sakshi

ఇకపై ఏటా ఆడుదాం.. 
మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లను ప్రభుత్వం అందించింది.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజే­తలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవి­­ష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడా­కారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  

భారీగా నగదు బహుమతులు 
విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మంగళవారం విశాఖలోని వైయ‌స్ఆర్‌ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్‌ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్‌ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్‌ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్‌ రూ.లక్ష, సెకండ్‌ రన్నరప్‌ రూ.50 వేలు అందుకోనున్నారు.  

Ys Jagan mohan reddy visit to Visakhapatnam on February 13th - Sakshi

ప్రతిభకు ప్రోత్సాహం.. 
ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్‌ సింగ్స్‌(సీఎస్‌కే)తో పాటు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా క్రికెట్‌లో టాలెంట్‌ హంట్‌ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌ వాలీబాల్‌ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది.

ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే 

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఫైనల్‌ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని ఎనిమిది వేదికల్లో ఐదు క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్‌ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.  

మహిళల విభాగంలో..
► క్రికెట్‌ విజేతగా ఎన్టీఆర్‌ జిల్లా సిద్ధార్థ నగర్, రన్నరప్‌గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, సెకండ్‌ రన్నరప్‌గా ప్రకాశం జిల్లా చిరకూరపాడు జట్లు నిలిచాయి.
► వాలీబాల్‌ విజేతగా బాపట్ల జిల్లా నిజాంపట్నం–3, రన్నరప్‌గా కర్నూలు జిల్లా మామిడాలపాడు–1, సెకండ్‌ రన్నరప్‌గా అన్నమయ్య జిల్లా కుచ్చువారిపల్లి–1 జట్లు నిలిచాయి.

► బ్యాడ్మింటన్‌ విజేతగా బాపట్ల జిల్లా స్వర్ణ 2, రన్నరప్‌గా వైఎస్సార్‌ జిల్లా శంకరాపురం–4, సెకండ్‌ రన్నరప్‌గా కర్నూలు జిల్లా ఫోర్త్‌క్లాస్‌ ఎంప్లాయిస్‌ కాలనీ జట్లు నిలిచాయి.
► ఖోఖో విజేతగా ప్రకాశం జిల్లా పోలిరెడ్డి బజార్, రన్నరప్‌గా కృష్ణా జిల్లా నెహ్రూ సెంటర్‌ చౌక్, సెకండ్‌ రన్నరప్‌గా కాకినాడ జిల్లా బీసీ కాలనీ 2 జట్లు నిలిచాయి. 

► కబడ్డీ విజేతగా విశాఖ జిల్లా లాసన్స్‌బే కాలనీ, రన్నరప్‌గా ప్రకాశం జిల్లా పాకాల 2, సెకండ్‌ రన్నరప్‌గా అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెం జట్లు నిలిచాయి. 
పురుషుల విభాగంలో..
► బ్యాడ్మింటన్‌ విజేతగా ఏలూరు జిల్లా శేఖర్‌ వీధి, రన్నరప్‌గా తిరుపతి జిల్లా భేరీపేట, సెకండ్‌ రన్నరప్‌గా వైఎస్సార్‌ కడప కాగితాలపెంట 1 జట్లు నిలిచాయి.

► వాలీబాల్‌ విజేతగా బాపట్ల జిల్లా బేతపూడి, ర­న్న­­రప్‌గా మన్యం జిల్లా బలిజపేట, సెకండ్‌ రన్న­రప్‌గా చిత్తూరు జిల్లా కొత్తపల్లె జట్లు నిలిచాయి.
► ఖోఖో విజేతగా బాపట్ల జిల్లా పొంగులూరు –1, రన్నరప్‌గా అనకాపల్లి జిల్లా తుమ్మపాల–2, సెకండ్‌ రన్నరప్‌గా ప్రకాశం జిల్లా రుద్రవరం జట్లు నిలిచాయి.

సాగర తీరంలో డ్రోన్‌ షో
 ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలను ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. విశాఖ సాగర తీరంలో లేజర్‌ షోతో పాటు డ్రోన్‌ షోలు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ప్రొజెక్షన్‌ మ్యాపింగ్, సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ షోకు శాప్‌ ఏర్పాట్లు చేసింది. ఎల్‌ఈడీ కాంతుల్లో 150 మంది కూచిపూడి నృత్యకారులతో ఆడుదాం ఆంధ్రపై కళా ప్రదర్శన నిర్వహిస్తారు. బాణసంచా వెలుగులు ఆహుతుల్ని అలరించనున్నాయి. 

Back to Top