రాష్ట్ర‌వ్యాప్తంగా ఆక్వా హబ్స్‌

లైవ్‌ ఫిష్‌ నిల్వ చేసేందుకు సర్కారు ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలు

హబ్స్‌ నుంచి రిటైలర్లు, మార్కెట్లు, జనతా బజార్లకు సరఫరా

చేపల వినియోగం పెంచేందుకు సర్కారు చర్యలు

అమరావతి: నగరాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆక్వా హబ్స్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తొలి దశలో నగరాలు, పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ తరువాత నియోజకవర్గ కేంద్రాలకూ విస్తరించనుంది. వీటి నిర్వహణ బాధ్యతల్ని ఎఫ్‌ఎఫ్‌పీవో (ఫిష్‌ ఫార్మర్స్‌ అండ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌)లకు అప్పగిస్తారు. ఎంపికైన ఆక్వా హబ్‌ నిర్వాహకులకు ప్రభుత్వమే రాయితీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తుంది. హబ్‌ల నుంచి రిటైలర్లు, ఫిష్‌ మార్కెట్లు, జనతా బజార్లకు లైవ్‌ ఫిష్‌ (బతికున్న చేపలు) రవాణా చేయడానికి వీలుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. హబ్‌లలో కూలింగ్‌ సెంటర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. వీటినుంచి మార్కెట్లకు లైవ్‌ ఫిష్‌ రవాణా చేసేందుకు ఐస్‌ బాక్సు వ్యాన్‌లను వాడతారు. మత్స్యశాఖ అధికారులు ఆక్వా హబ్స్, మార్కెట్‌ పరిస్థితులను పర్యవేక్షిస్తారు.

మార్కెట్‌లో ఒడిదుడుకుల్ని నివారించేందుకు..
► రాష్ట్రంలో ఏటా 35 లక్షల టన్నుల చేపల దిగుబడి వస్తోంది. ఇందులో 90 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కేవలం 10 శాతం చేపల్ని మాత్రమే రాష్ట్ర ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నారు.
► రాష్ట్రంలో ఆక్వా సాగు విస్తీర్ణం 2 లక్షల హెక్టార్ల వరకు ఉంది. ఈ రంగంపై ఆధారపడి 1.40 లక్షల కుటుంబాలు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పొందుతున్నాయి. 
► ఈ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.25 వేల కోట్లకు చేరుకుంది. 
► ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ రంగం లాక్‌డౌన్‌ సమయంలో మార్కెట్ల మూసివేత, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది.
► భవిష్యత్‌లో ఒడిదుడుకులకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేస్తోంది. 
► ఇదే సందర్భంలో పోషక విలువలు అధికంగా ఉండే చేపల్ని ఆహారంగా తీసుకునే అలవాటును ప్రజల్లో పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.

స్థానిక వినియోగం మరీ తక్కువ
► ప్రపంచంలోని ఇతర దేశాల్లో చేపల సగటు వినియోగం 20 నుంచి 30 కిలోలుగా ఉంది.
► మత్స్యశాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి వ్యక్తి ఏటా 7.50 కిలోల నుంచి 10 కిలోల వరకు చేపలను ఆహారంగా తీసుకుంటున్నారు. 
► మన రాష్ట్రానికి వస్తే.. చేపల సగటు వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో ఏటా 1.80 కిలోలు, పట్టణాల్లో 1.32 కిలోలుగా ఉంది. 
► మంచి పోషక విలువలు కలిగిన చేపల్ని వారానికి రెండుసార్లు ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
► ఈ దృష్ట్యా వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో లక్ష టన్నులు, 2025 నాటికి 5 లక్షల టన్నుల చేపల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం వివిధ పథకాలను అందుబాటులోకి తెస్తోంది. 

Back to Top