అమరావతి: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1000 పంపిణీ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందచేస్తున్నారు. రాష్ట్రంలో కోటి 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందనుంది. అప్రమత్తం చేస్తూ..ఆర్థికసాయం అందిస్తూ.. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాలంటీర్లు ఇంటింటికీ ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి వాలంటీర్లు వెళ్లి రూ.1000 అందజేస్తూ..కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి పేదలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ద్విముఖ వ్యూహంతో ముందుకు.. కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే లాక్‌డౌన్ వల్ల పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. పేదలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా బియ్యం, కందిపప్పుతోపాటు ఒక్కో కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.1,000 చొప్పున నగదు ఇస్తామని సీఎం వైయస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతగా గత నెల 29 నుంచి పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. నేడు (శనివారం) బియ్యం కార్డులున్న 1.30 కోట్ల కుటుంబాలకు ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా రూ.వెయ్యి చొప్పున నగదు సాయం అందిస్తున్నారు. పేదలకు ఆర్థిక సహాయానికి 1300 కోట్లు విడుదల శ్రీకాకుళం జిల్లాలో 7.5 లక్షల మందికి 75.06 కోట్లు పంపిణీ విజయనగరం జిల్లాలో 6.47 లక్షల మందికి 64.79 కోట్లు పంపిణీ విశాఖ జిల్లాలో 11.05 లక్షల మందికి 110.56 కోట్లు పంపిణీ తూ.గో.జిల్లాలో 14.65 లక్షల మందికి 146.54 కోట్లు పంపిణీ ప.గో.జిల్లాలో 11.44 లక్షల మందికి 114.48 కోట్లు పంపిణీ కృష్ణా జిల్లాలో 11.21 లక్షల మందికి 112.10 కోట్లు పంపిణీ గుంటూరు జిల్లాలో 12.87 లక్షల మందికి 128.70 కోట్లు పంపిణీ ప్రకాశం జిల్లాలో 8.76 లక్షల మందికి 87.66 కోట్లు పంపిణీ నెల్లూరు జిల్లాలో 7.76 లక్షల మందికి 77.69 కోట్లు పంపిణీ చిత్తూరు జిల్లాలో 9.92 లక్షల మందికి 99.21 కోట్లు పంపిణీ అనంతపురం జిల్లాలో 10.67 లక్షల మందికి 106.79 కోట్లు పంపిణీ కర్నూలు జిల్లాలో 10.56 లక్షల మందికి 105.67 కోట్లు పంపిణీ వైఎస్ఆర్ జిల్లాలో 7.06 లక్షల మందికి 70.69 కోట్లు పంపిణీ