అనుభవం అబాసుపాలు!

''రాజకీయనాయకుడన్నాక ఏదైనా చెపితే అర్థం అయ్యీ కానట్టుండాల. అసలు అర్థమే కాకపోతే మరీ మంచిది. ఏదో పెద్ద విషయం చెబుతున్నట్టుగా ప్రజలకు భ్రమకల్పించి మొత్తానికి తెప్ప తగలెయ్యాల. అంతేకానీ కుల్లం కుల్లా చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలా విషయాలు విప్పి చెప్పేయకూడదు''. ఇదీ ప్రజల్ని మోసగించే రాజకీయ నాయకులు ఫాలో అయ్యే సిద్ధాంతం. 
మరి అలాంటి కోవకే చెంది, అందులో తలపండిన అనుభవం ఉన్న వ్యక్తిగా నిత్యం తనను తానే పొగుడుకునే బాబులాంటి వాళ్ల గురించి వేరే చెప్పాలా చెప్పండి. తిమ్మిని బమ్మిని చెయ్యాల, దేశవిదేశాలు పదే పదే తిరగాల, అక్కడివాళ్లను ఇక్కడకు రప్పించి, రాకపోయినా డమ్మీలను పెట్టి వచ్చినట్లు ఫోజులివ్వాల, లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయని నమ్మించాల, ప్రపంచంలో ఏ మూలకు వెళితే అక్కడి నగరం ఇక్కడ కట్టేస్తున్నాఅని చెప్పాల, అలాగే పాలనా కాలం కాస్తా గడిపేసి ఆఖర్న మళ్లీ ఓట్లకోసం అబద్ధాలు మోసాలు చేయడానికి సిద్ధపడిపోవాల. ఇదీ బాబు సిద్ధాంతం. 
ఇంత తెలిసిన బాబుకి ఏదైనా పెద్ద విషయాన్ని ఎవరైనా సూటిగా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెబితే భలే కోపమొస్తుంది. అదీ నిండు శాసనసభలో ఎవరైనా అలాంటి పని చేస్తే అస్సలు మనస్కరించదు. 
గోదావరి జలాల గురించి, అవి పారే ప్రదేశాల గురించి, రాష్ట్రాల వాటాల గురించి, ప్రాజెక్టుల్లో శాతాల గురించి గురువారం సభలో ముఖ్యమంత్రి జగన్‌ అలవోకగా, అత్యంత సులభమైన పద్ధతిలో వివరిస్తుంటే బాబు తట్టుకోలేకపోయారు. ''ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్‌గా ప్రజలకు అర్థమైపోయేలా ఎలా చెప్పేస్తారు అధ్యక్షా... ముఖ్యమంత్రిగారు???'' అంటూ వీరబాధపడిపోయారు. దానికి ముఖ్యమంత్రిగారు నవ్వు ఆగక నవ్వుతుంటే, వెంటనే ఉక్రోషం పెరిగిపోయి తన అనుభవాన్ని గుర్తుచేశారు బాబు. ''నా అనుభవం అంత వయసు ఉంటుంది మీకు..'' అంటూ అసందర్భంగా తన గురించి చెప్పుకోడానికి ఒక వెసులుబాటు కల్పించుకున్నారు. 
నిజమే మరి..! అనుభవం అంటే బాబు డిక్షనరీలో అర్థాలు వేరే ఉన్నాయి. ఐదేళ్లు పాటు రాజధాని నిర్మాణాన్నికాగితాల్లో కూడా చూపించకుండా ప్రజల్ని మభ్యపెట్టడం. కనీసం ఒక డిజైన్ కూడా ఫైనల్‌ చేయలేకపోవడం, సినిమా సెట్టింగులతో పరువు తీయడం, తాత్కాలిక నిర్మాణాలతో కోట్లు కొల్లగొట్టడం... ఏదో చేసేస్తున్నట్టు ప్రజల్ని నిత్యం మోసం చేయడం, చివరకు వాళ్లకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా అడిగినవాళ్లను బెదిరించడం, తిట్టడం ఇలా ఎన్నో ఉన్నాయి.
వాటన్నింటికీ భిన్నంగా ఇలా ప్రజలతో నీతిగా నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రిని, ప్రతి విషయం ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పి, తాను తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రజలను పూర్తి భాగస్వాములను చేయాలని తపించే నాయకుడిని చూస్తే బాబుకి కోపం రాక ఇంకేమొస్తుంది పాపం. రాష్ట్రంలో ఇరిగేషన్‌, జలవనరుల పట్ల యువ ముఖ్యమంత్రి అవగాహనకు బెంబేలెత్తిన బాబు సభ సాక్షిగా తన అనుభవాన్ని మరోసారి చాటుకుని అబాసుపాలయ్యారు.  

 

Back to Top