పార్వతీపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు మన్యం సీమలో జనం నీరాజనం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గంలో సాధికార బస్సు యాత్రకు అడుగడుగున జై జగన్ హర్ష ధ్వానాల మధ్య అపూర్వ స్వాగతం లభించింది. నియోజకవర్గంలో నాలుగన్నరేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు,పార్టీ నేతలు పరిశీలించారు. డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అలజంగి జోగారవు, పాముల పుష్ప శ్రీ వాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు స్వాగత నినాదాల హోరు మధ్య బస్సుయాత్ర చేరుకుంది. గిరిజనులకు పోడు, బీడు, బంజరు భూమిలిచ్చిన ఘనత జగన్ ది, రెండెకరాలు ఇస్తామని మోసం చేసింది బాబు: డిప్యూటీ సీఎం రాజన్నదొర డిప్యూటీ సీఎం రాజన్నదొర మాట్లాడుతూ గిరిజనులకు, బడుగు, బలహీలన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న మేలును ఎన్నడూ మరిచిపోకూడదని, మరిస్తే మనకే ఇబ్బందులు, కష్టాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీల కోసం జగన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఎన్నడైనా సరే ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేసారా అని ప్రశ్నించారు. ఎస్సీల కోసం గత ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, జగన్ రూ. 61 వేల కోట్లు ఖర్చు చేసారన్నారు. బీసీల కోసం ఒక లక్షా అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసారన్నారు. గిరిజనుల కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్ ఖర్చు చేయగా, చంద్రబాబు కేటాయింపులను పూర్తిగా చేయలేదని గుర్తు చేసారు. చంద్రబాబు హయాంలో కేబినెట్ లో గిరిజనులకు మంత్రి పదవి కేటాయించలేదని, జీసీసీ కి చైర్మన్ ను వేయలేదని, ఎస్టీ కమిషన్ ను కూడా నియమించలేదని విమర్శించారు. పోడు, బీడు, బంజరు భూములను గిరిజనులకు జగన్ పంపిణీ చేయగా, భూములపంపిణి హామీ ఇచ్చిన చంద్రబాబు ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. గిరిజనులకు రెండెకరాలు భూమి ఇస్తానని చెప్పి టీడీపీ మోసం చేసిందని మండిపడ్డారు. గిరిజనులను మోసగించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబు పాలనలో కరవు,అరాచకం,దౌర్జన్యాలు,దోపిడీ, జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి: మంత్రి ధర్మాన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, మా జెండా కట్టాలి, మా రంగుచొక్కా ధరించాలి. మాకే ఓటు వేయాలని బెదిరించి గతంలో చంద్రబాబులాంటి వారు అణగారిన వర్గాలను అణిచివేశారు. చంద్రబాబు పరిపాలనలో కరవు,అరాచకం,దౌర్జన్యాలు,దోపిడీలు రాజ్యమేలాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగున్నరేళ్లుగా కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను సామాన్యులకు లబ్ధి చేకూరేలా దేశంలో మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని వివరించారు. పేదల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తూ విద్యా, వైద్యం పరంగా ఉచితంగా సేవలు అందిస్తూ , ఉండటానికి ఇల్లు ఇస్తుంటే దుర్వినియోగం చేస్తున్నామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. పార్వతీపురం చుట్టూ అనేక ఉద్యమాలు పుట్టాయని, సమాజంలోని అసమానతల కారణంగా పోరాటాలు వచ్చాయన్నారు. ఇప్పుడు జగన్ పాలన కారణంగా ఎటువంటి ఆందోళనలు చేయకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నారని గుర్తు చేసారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి 12,800 కోట్లతో భూమి కొనుగోలు చేసి సొంతింటి కలను జగన్ నెరవేరుస్తున్నారని, గతంలో పాలకులు ఎవరైనా సరే ప్రజలకు సొంత గూడు కల్పించాలన్న ఆలోచన చేసారా అని ధర్మాన ప్రశ్నించారు. నిరుత్సాహం, నిస్పృహతో అల్లాడుతున్న ప్రజల కోసం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గతంలో విద్య ప్రైవేటు పరమైపోయిందని, ఎవరు కోరుకోకుండా ఎందుకు ప్రైవేటు విద్య వచ్చిందని ప్రశ్నించారు. విద్య, ధనవంతులకు మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో పేదలకు ఉన్నత విద్య అందించేందుకు పాఠశాల స్థాయి నుంచి యూనివర్శిటీల వరకు సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారని గుర్తు చేసారు. ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను పేదల కోసం జగన్ తీర్చిదిద్దారన్నారు. స్వర్గీయ వైఎస్ ఆర్ , జగన్ ఎప్పుడూ కూడా పేదలు, రైతుల కోసం ఆలోచన చేసి సంక్షేమ పథకాలు అమలు చేయగా, చంద్రబాబు మాత్రం ఎప్పుడూ సంపన్నులు, ధనవంతుల కోసం పని చేస్తుంటారని విమర్శించాారు. పార్వతీపురం ప్రాంతానికి చంద్రబాబు అధికారంలో ఉండగా గత ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చేసారో చెప్పాలని ధర్మాన డిమాండ్ చేసారు. సంక్షేమ రాజ్యం సృష్టికర్త సీఎం వైయస్ జగన్ : ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ, పాదయాత్రలో జగన్ పేదల కష్టాలను గమనించి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారన్నారు. కేవలం ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా పాలన చేయడం జగన్ అభిమతమని గుర్తు చేసారు. వైయస్సార్ సిపి ప్రభుత్వ పాలనలో మా జీవన ప్రమాణాలు పెరిగాయని ప్రజలు చెబుతున్నారంటే ఎంతటి సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. సంక్షేమ సారథిగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ కు ప్రజలు అండగా ఉండాలని పులుపునిచ్చారు. పార్వతీపురం నియోజకవర్గంలో రూ. 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జగన్ హయాంలో చేపట్టామని వివరించారు. మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. టీడీపీ నేత చంద్రబాబు కు నిజాయితీ, దూరదృష్టి అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, దూరదృష్టి అంటే బాబు తనయుడు లోకేశ్ ఎలా సీఎం చేసుకుందామా అన్నదేనని ఎద్దేవా చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టోనే తీసేసిన పార్టీకి నిజాయితీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నిజాయితీ, దూరదృష్టి అంటే జగనే అని, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అత్యున్నత స్థానం కల్పించడం, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తేవడం, గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం దూరదృష్టి అని కొనియాడారు.