నెరవేరిన వైఎస్ ఆశయం

ప్రొద్దుటూరు: వైఎస్  సీఎంగా ఉన్న హయాంలో నగర బాట కార్యక్రమంలో భాగంగా 2008 ఆగస్టు నెలలో ప్రొద్దుటూరుకు వచ్చారు.  స్థానిక రాజీవ్ సర్కిల్‌లో ప్రొద్దుటూరుకు పశువైద్య కళాశాలతోపాటు యోగివేమన ఇంజ నీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికప్పుడు వేగంగా పనులు ప్రారంభించి అదే ఏడాది అక్టోబర్‌లో పశువైద్య కళాశాలను ప్రారంభించారు.  మొత్తం రూ.125 కోట్లతో కళాశాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు.

వైఎస్ హయాంలోనే తొలివిడతగా మెయిన్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.24కోట్లు నిధులు కేటాయించారు. 26 జూన్, 2010న అప్పటి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పార్థసారథి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆ మేరకు ఏడాదిలోపు పనులు పూర్తి కావలసి ఉన్నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కళాశాల నిర్మాణంపై శ్రద్ధ చూపకపోవడంతో జాప్యం జరిగింది.

ప్రస్తుతం మెయిన్ బిల్డింగ్‌తోపాటు టీచింగ్ వెట ర్నరీ క్లినికల్ కాంప్లెక్స్, డెయిరీ ఫాం, బాలుర, బాలి కల హాస్టళ్ల నిర్మాణాలతోపాటు పోస్టుమార్టం విభాగాన్ని నిర్మించారు. కళాశాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా డబుల్ రోడ్లు నిర్మించడంతోపాటు రోడ్డు మధ్యన బటర్‌ఫ్లై, హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. పశువైద్య విద్యకు సంబంధించి ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఆడిటోరియం, స్టాఫ్ క్వార్టర్స్ తదితర వాటిని మాత్రమే నిర్మించాల్సి ఉందని సమాచారం.

ఆలస్యంగా వీసీఐ గుర్తింపు
2008లో కళాశాల ఏర్పాటైనా  వైఎస్ మరణానంతరం పనులు పూర్తికాకపోవడం, సిబ్బంది కొరత తదితర సమస్యల కారణంగా కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించలేదు. వీసీఐ హెచ్చరికలతో యూనివర్సిటీ అధికారులు కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేశారు. దీంతో కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించింది.   కళాశాల ప్రారంభమైన తర్వాత 2013లో ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు బయటికి వెళ్లారు. మొత్తం 31 మందిలో హరిప్రసాద్ రాజు అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించగా, మరో విద్యార్థికి మాత్రమే జాబ్ రాలేదు.

మిగత 29 మంది వెటర్నరీ డాక్టర్లుగా నియమితులయ్యారు.  గత ఏడాది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పీజీలో చేరి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో 30 అడ్మిషన్లు మాత్రమే ఉండగా ఈ ఏడాది 60 మందికి పెంచారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్ల సంఖ్య 75కు పెరగడంతోపాటు ముందుముందు కళాశాలలో పీజీని ఏర్పాటు చేస్తారని కూడా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కళాశాల ఆధ్వర్యంలో ప్రస్తుతం జిల్లాలోని పశువైద్యాధికారులకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కళాశాల పూర్తి హంగులతో రూపుదిద్దుకోవడంతో వైఎస్ కల నెరవేరినట్లుయింది.

తాజా వీడియోలు

Back to Top