పిసరంత సాయమా?


రాష్ట్రానికి తాత్కాలిక సాయం కింద రూ.850 కోట్లు
వెనకబడిన జిల్లాలకు రూ.350, రెవెన్యూలోటుకు రూ.500 కోట్లు
అడిగింది రూ. 24 వేల కోట్లు.. విదిల్చింది రూ.350
ప్రత్యేక హోదాపై కొనసాగుతున్న కేంద్రం మౌనం
బాబు మెతక వైఖరే పరిస్థితికి కారణం..!


హైదరాబాద్: విభజన చట్టం హామీలను కేంద్రం విస్మరించినట్లుంది. విభజన సందర్భంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిచ్చిన బీజేపీ ఇప్పడు ఆ అంశాన్ని పక్కన బెట్టినట్లు కనిపిస్తోంది. కేంద్రం బుధవారం ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.850 కోట్లు పకటించింది. ఏపీకి అభివృద్ధి ప్యాకేజీ, తాత్కాలిక మద్దతుగా ఈ నిధులను ఇస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనకబడిన జిల్లా (ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం)లకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లు, వీటితోపాటు రెవెన్యూలోటు భర్తీ చేసేందుకు తాత్కాలిక సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. విభజన చట్టాన్ని అమలు చేయకుండా ఇలా తాత్కాలిక సాయం కింద రూ.850 కోట్ల అతి తక్కువ మొత్తాన్ని ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ విషయంలో మొదటి నుంచి చంద్రబాబు కేంద్రంతో సరిగా వ్యవహరించలేకపోయారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం ప్రకటనతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

విభజన వేళ చెప్పినమాటలు మరిచారా?
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణచట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని టీడీపీ-బీజేపీ కూటమి హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిపిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని వెనబడిన జిల్లాలైన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలకు ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున అందజేస్తామని ప్రకటించింది. రాష్ట్రం విడిపోతే ఏర్పడే లోటుబడ్జెట్‌ను కూడా పూరించేందుకు ఆర్థికసాయం (ప్రత్యేక ప్యాకేజీ) అందిస్తామని హామీ ఇచ్చింది. తమను గెలిపిస్తే విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తామని ఊకదంపుడు ప్రకటనలు ఇచ్చింది. అధికారం చేట్టాక ప్రత్యేక హోదా, ఆర్థికప్యాకేజీపై కేంద్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం కేంద్రం తీరు చూస్తుంటే.. వెనకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు, అంటే ఐదేళ్లకు ప్రతి ఆర్థిక సంవత్సరానికి కేంద్రం చేసే సాయం మొత్తం రూ.1750 మాత్రమే ఇస్తుందని అనిపిస్తుంది. వాస్తవానికి ఈ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రావాల్సిన మొత్తం రూ.35000 కోట్ల ప్యాకేజీని రూ.1750 కోట్లకి కుదించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

అడిగింది రూ.24 వేల కోట్లు...!

వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం భారీగానే నిధులు అడిగింది. కానీ కేంద్రం ఇప్పుడు ఇచ్చింది రాష్ట్రం అడిగినదానితో పోలిస్తే  ఏమాత్రం సరిపోదనే చెప్పాలి. వాస్తవానికి ఈ జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 14 ఆర్థిక ప్రణాళిక సంఘానికి లేఖ కూడా రాసింది. రాష్ర్టంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా వెనకబడ్డాయి. వీటిని మిగిలిన జిల్లాలతో సమానంగా అభివృద్ధికి చేయాల్సివుంది. కోస్తా జిల్లాలకు నిత్యం ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం పొంచి ఉండగా, రాయలసీమ జిల్లాలు నిత్యం తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటాయి. అందుకే ఈ ప్రత్యేక ప్యాకేజీ ఆయా జిల్లాల అభివృద్ధికి దోహదం చేస్తుందని రాష్ర్ట ప్రభుత్వం భావించింది. కానీ, బుధవారం కేంద్ర ఆర్థికశాఖ ఇచ్చిన ప్రకటనలో ప్రత్యేక ప్యాకేజీపై ఎక్కడా స్పష్టత కనిపించకపోవడం కేంద్రం తీరును చెప్పకనే చెప్పింది.  ప్రస్తుతం జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన రూ.350 కోట్లు కేవలం ఒక్క సంవత్సరానికే పరిమితం చేస్తుందా? లేక ఐదేళ్లు ఇవే  నిధులు కొనసాగిస్తుందా? లేక ముందు చెప్పినట్లు సాయం ఏటా ఏడు జిల్లాలకు రూ.1000 కోట్లు ఇస్తుందా? అన్నది స్పష్టత ఇవ్వలేదు.

బాబు మెతక వైఖరే కారణం

టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపిస్తే రాష్ట్రానికి తగినన్ని నిధులు రాబట్టుకోవచ్చని చంద్రబాబు- పవన్‌కళ్యాణ్ జనాలకు హామీలను గుప్పించారు.  విభజన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గగ్గోలు పెట్టారు. జనం చేత ఓట్లు వేయించుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా- స్పెషల్ ప్యాకేజీ తెస్తామని ప్రజలను మభ్యపెట్టారు. అనుకున్నట్లుగానే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీలు అధికారంలోకి వచ్చాయి. ప్రత్యేక హోదాపై కేంద్రం ఏ మాటా చెప్పదు. చంద్రబాబు అడగరు.మిత్రపక్షంగా ఉంటూ ఇచ్చిన హామీ మేరకు తేవాల్సిన నిధులను కూడా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు.

చంద్రబాబు మనసులో ఏముంది?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గ సహచరులకు ఇటీవల స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ‘ఈ అంశంపై పదే పదే మాట్లాడవద్దని’ కూడా వారికి సూచించారని సమాచారం. దీనిపై ఎక్కువగా మాట్లాడితే మిత్రపక్షమైన బీజేపీకి కోపం వస్తుందని ముందుజాగ్రత్తగా బాబు తన మంత్రులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పదే పదే కేంద్రం వద్దకు వెళ్లి అవమానపడడం కంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవడమే ఉత్తమమని సీఎం అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై సీఎం ఎందుకు స్పందించలేదంటే..?
జనవరి చివరి వారంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమనే అర్థం వచ్చేలా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పడు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉన్నారు. రాగానే ఈ విషయం మంత్రులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రమే రూ.లక్ష కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నామని చెబుతోందని, ఈ పరిస్థితుల్లో మనకు ఎలా సాయం చేస్తుందని బాబు సమాధానం ఇచ్చారని తెలిసింది.  ఈ నేపథ్యంలో మనం కేంద్రంపై పెద్దగా ఒత్తిడి చేయలేమని సీఎం చెప్పినట్టు సమాచారం.

మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆర్థిక సాయం చేయడానికి, పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి మిగిలిన రాష్ట్రాలు అంగీకరించే పరిస్థితి లేదని కేంద్రం చెబుతోందని సీఎం మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారని తెలిసింది. ఈ ప్రతిపాదన వచ్చిన తొలిరోజుల్లోనే అప్పటి తమిళనాడు సీఎం జయలలిత బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా సీఎం గుర్తు చేసినట్లు మంత్రి ఒకరు తెలిపారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చామనీ, ఇప్పుడు హోదా రావడం లేదంటే విపక్షాలు, ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు సహా పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దనీ, కేడర్ కూడా బీజేపీ మీద ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయకుండా కట్టడి చేయాలని మంత్రులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది.

అపనిందను కాంగ్రెస్‌పై నెట్టేయండి..?
అదే సమయంలో జనంలో బీజేపీ- టీడీపీలపై ప్రజల్లో అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడాలని టీడీపీ భావిస్తోంది. ఈ అపనిందను ‘కాంగ్రెస్‌పై నెట్టేద్దాం... అప్పట్లో... కాంగ్రెస్ పార్టీ... రాష్ట్రాన్ని హడావుడిగా విడగొట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.  ప్రత్యేక హోదా సాధించలేకపోయామనే అపప్రద నుంచి బైట పడేందుకు గల అవకాశాలను వెతుకుతున్నట్టు సమాచారం.  మొత్తానికి బాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వద్ద ఎలాంటి ఒత్తిడి చేయకుండానే తన ప్రయత్నాలను విరమించుకున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top