వైయస్ ఆసరా.. జగనన్న భరోసా

హరిత వనంపై పెనుగాలులు విరుచుకుపడితే... పచ్చని పొలాలపై ఉప్పటేర్లు పగబడితే.. నీడనిచ్చే చెట్టుపై పిడుగుల వర్షం కురిస్తే.. ఆ ఊహే దుర్భరం.. ఎదురైన అలాంటి పరిస్థితి నుంచి తప్పించడానికే ప్రస్తుతం వైయస్ కుటుంబం కంకణబద్ధమైంది. 
తండ్రిలాంటి చెట్టును నరికేశారు. చెట్టంత కొడుకును బందీ చేశారు. ప్రేమనిచ్చే నీడ, ఆకలి తీర్చే ఫలం, కళకళలాడే జీవితం కరువయ్యాయి. బీడుబడ్డ జీవితాలపై కరుణించే వర్షం లేకపోయింది. ఈ పరిస్థితికి కారణం ఎవరు?
వారిని నిలదీయాలి. నిరసన తెలపాలి. ప్రజల పక్షాన నిలబడి పాలకులను హెచ్చరించాలి. అందుకోసమే షర్మిలమ్మ వస్తోంది. ధైర్యం చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి వస్తోంది. రాజన్న రాజ్యం, జగనన్న పాలన రాబోతోందని తెలిపే ఒక వేగుచుక్కలా వస్తోంది.
అదో ఆకుపచ్చటి వనం. కళకళలాడే సతత హరితం - అందరికీ సంతోషభరితం. ఆ వనంలో తల ఎత్తుకొని నిలిచిన ఒక మహావృక్షం. వనానికే తలమానికమైన మహావృక్షం. కాని ఒక రోజు తుఫాను దొంగదెబ్బ తీసింది. ఆ మహావృక్షాన్ని కూలగొట్టింది. దాని నీడన సేదదీరే ఎన్నో జీవులకు బతుకు బరువైంది. అండ చేజారింది.
ఎందరో కన్నీరు కార్చారు. మరెందరో అలాంటి అండ కావాలని దేవుళ్లకు మొక్కారు. అప్పుడు- ఆ కొరత పూడ్చటానికి ఆ చెట్టు గింజే ఒకటి మొలకెత్తింది. నేనున్నానన్న ధైర్యం చెప్పింది. తన తండ్రి స్థానంలో ఒదగబోయింది.
కాని- ఒక మొక్క పచ్చగా ఉంటే ఓర్వలేనివారెందరో!
కక్ష గట్టి దాని కొమ్మలను కత్తిరించేవారెందరో!
ఫలాలను అందరికీ అందకుండా చూసేవారెందరో!
కాని- ప్రజలు అనే మట్టిలో ఎదిగిన చెట్టును ఆపగలిగేవారెవరు? అడ్డుపడగల వారెవరు? అది మరింత ఎత్తుకు ఎదగకుండా చేయగలిగే శక్తి ఎవరికైనా సాధ్యమా?

********

ఆకు కదిలితే భయపడిపోయే కొమ్మ ఊగితే బెదిరి దాక్కునే శత్రువులెందరో చెట్టుకు సంకెళ్లేశారు. బందీ చేశామని విర్రవీగారు. ఒక కొమ్మను నిరోధిస్తే మరో కొమ్మ మొదలవుతుంది. ఒక రెమ్మను చిదిమేయబోతే మరో రెమ్మ చిగురేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నదదే. జగన్ అనే ప్రాణవాయువును నాలుగు గోడల మధ్య బందీని చేస్తే కొత్త ప్రాణం ఊపిరిపోసుకుందిది. జాతికి ఊపిరిపోయడానికి అడుగు కదుపుతుంది. నిజం. అదిగో షర్మిల. జగనన్న చెల్లెలు. తండ్రి ఆదర్శాలను అన్న ఆశయాలను భుజానికెత్తుకున్న ధీశాలి.

********

ఇప్పుడు షర్మిలమ్మ చేయబోయే పనేమిటి?... కొందరు పెడబొబ్బలు పెడుతున్నట్లు అన్నకు ఆసరాగా నిలవడం కాదు! తనలాంటి చెల్లెళ్లకు జగనన్న అండ ఎప్పుడూ ఉంటుందని తెలియచెప్పడం. ఇప్పుడు తాను షర్మిలకు మాత్రమే అన్నను కాదనీ... తనను జగనన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే అందరికీ అన్ననే అన్నది జగనన్న మాట. తన కుటుంబ సభ్యులదీ ఆ బాట కావాలన్నది ఆయన మాట. జగనన్న మాట కోసం, ఆ సంకల్పం నెరవేర్చడం కోసం ఆ చెల్లి బయలు దేరింది. తెలుగువారికి బంధాలు తెలుసు. అనుబంధాలు తెలుసు. జగనన్న జగమందరికీ అన్న అయినప్పుడు ఆ అన్న చెల్లెలు... అందరికీ చెల్లెలే కదా. అందుకే కన్నతల్లి లాంటి రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టింటి నుంచి మొదట బయల్దేరేది ఎవరు?... చెల్లెలే. ఆపద తీర్చడానికి అడుగు ముందుకేసేది ఎవరు? మన ఇంటి ఆడపడుచే! అందుకే... మన ఇంటి ఆడపడుచు కొంగు బిగించి బయల్దేరింది. కొంగు బిగించిన చోట కురిసేది కొంగుబంగారాలే అన్నది కొత్తగా చెప్పాలా?
ఆ అడుగు తండ్రి అడుగులో అడుగు. ఆ అడుగు నాన్న ఆశయానికి అడుగు. ఆ అడుగు అన్న దీక్షకు ముందడుగు. ఆ అడుగు ప్రజల ఆశలు తీర్చడానికి ఓ మొదటి అడుగు. మొదటి అడుగు వెంట అడుగుల జడి వడి వడిగా నడవాలని, అది ఒక ప్రభంజనం కావాలని, ఒక ఉద్యమరూపు పొందాలని ఆశిస్తున్నారు అన్న. జగనన్న.

********

ఓ చెల్లి షర్మిలమ్మ పాదయాత్ర ఇది.
ఆమె వెంట నడిచే ప్రజల పాదయాత్ర.
ఇది ప్రజా ఉద్యమం. ప్రభంజనం.
రేపటి విజయం తాలూకు తొలి అడుగు నేడు మొదలవుతోంది. అందులో భాగస్వామి కమ్మని ఆ మహానేత సందేశం అందరినీ అడుగుతోంది. అనుసరించమని కోరుతోంది. జగనన్నకు విజయం చేకూరేవరకూ అది జయప్రదం కావాలన్నది అమ్మ ఆశీర్వాదం. రాష్ట్రంలోని అందరు అమ్మల దీవెన. అమ్మ దీవెన ఉన్న కార్యమేదైనా సిద్ధిస్తుంది.
ఇడుపులపాయలో పాయలా మొదలయ్యే ఈ అడుగు ఇచ్ఛాపురంతోనే ఆగదు. ప్రజల అండతో అందరి ఇచ్ఛలూ తీరే వరకూ, అందరి రాతలు మారే వరకూ - కష్టాలు తీర్చే మహానదిలా సాగిపోతుంది. ఇది తథ్యం. ఇది సత్యం.
- యాసీన్

ఆ చిన్నారి పాదాలే...
చాలా ఏళ్ల క్రితం ఒకసారి వైఎస్ ఏదో పర్యటనకు వెళ్లి తిరిగి వస్తూ తన కూతురుకి కొత్త చెప్పులు తెచ్చారట. తొడిగి చూస్తే ఏముంది? అవి ఆమె పాదాలకు సగానికే వచ్చాయట. వైఎస్ ఆశ్చర్యపోయారట. అరె... నా బంగారుతల్లి అప్పుడే అంత పెద్దదైపోయిందా అనుకున్నారట. కూతురుని అంత అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తండ్రి ఆప్యాయతను చూసి అందరూ మెచ్చుకోలుగా నవ్వుకున్నారట. నాటి ఆ ముద్దుల కుమార్తె నేడు తండ్రి యాత్రను ముందుకు తీసుకుపోవడానికి నడుం బిగించింది. అన్న ప్రస్థానాన్ని ముందుకు తీసుకుపోతోంది. తోడబుట్టిన రుణాన్ని కొంత తీర్చుకోబోతోంది.
ప్రజల కోసం
2003... వేసవి ఎండలు మండిపోతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల కోపం అంతకంటే ఎక్కువగా మండిపోతోంది. ప్రజలెవరూ చల్లగా లేరు. శిథిలమైన రాజ్యంలో పచ్చదనం, సుఖశాంతుల వెలుగు తీసుకురావడానికి ‘ప్రజాప్రస్థానం’ పేరుతో రాజన్న చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన ఈ చారిత్రాత్మక పాదయాత్రలో సమస్తరంగాల శ్రామిక ప్రజలు పాల్గొన్నారు. గౌతమబుద్ధ్దుడు ఊరూరు తిరుగుతూ ప్రజల దుఃఖాన్ని అర్థం చేసుకున్నట్లు, వారి కన్నీళ్లు తుడిచినట్లు... రాజన్న ప్రజల కన్నీళ్లను తుడిచారు. రాజన్న రెక్కల కష్టం, పాదాల కష్టం వృథా పోలేదు. ‘ప్రజాప్రస్థానం’ యాత్ర ఆనాటి నియంతృత్వ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చివేసింది. పచ్చగా... రైతురాజ్యాన్ని తీసుకువచ్చింది.

Back to Top