వేయికళ్ళతో 'అనంత' ఎదురుతెన్నులు


జిల్లా దిశగా షర్మిల అడుగులు

అనంతపురం: మరో ప్రజా ప్రస్థానం ఆరో రోజు ప్రారంభంమైంది. ఇప్పటి వరకూ యాత్రకూ నేటి యాత్రకూ ఓ ప్రత్యేకత ఉంది. అదే కడప జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి యాత్ర అడుగిడనుండటం. మహానేత కుమార్తె, జననేత వైయస్ జగన్  సోదరి అయిన షర్మిల అన్న సూచనతో ఆరంభించిన పాదయాత్ర జగన్నినాదాలతో మార్మోగుతూ సాగుతోంది. జగనన్న సోదరి కోసం అనంతపురం జిల్లావాసులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆమెను చూసేందుకు  తహతహలాడుతున్నారు.
ఎప్పుడెప్పుడా అని ‘అనంత’ ప్రజానీకం ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రజల సమస్యలు వింటూ.. కష్టాలూ కడగండ్లు తెలుసుకుంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ.. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలు ఎత్తి చూపుతూ ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ తనయ, జగన్ సోదరి, ‘అనంత’ మనవరాలు షర్మిల అనంతపురం జిల్లా దిశగా పయనిస్తున్నారు. ఆమెతో పదం కలపాలని.. అడుగులో అడుగేసి మద్దతు తెలపాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై సమరభేరి మోగిస్తూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న రాజకీయ కుతంత్రాలపై కదంతొక్కుతూ ఈ నెల 18న ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద నుంచి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లాకు చేరుకోనుంది.
అనంతపురం జిల్లాలో సుమారు రెండు వందల కిలోమీటర్ల పాటు షర్మిల పాదయాత్ర చేయనున్నారు. 15 రోజుల పాటు జరిగే  పాదయాత్ర ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. 70 గ్రామాల్లోని ప్రజలను షర్మిల కలుసుకోనున్నారు. ప్రజా సమస్యలు, కష్టాలను తెలుసుకుని సర్కారుకు కనువిప్పు కలిగించనున్నారు.
రాజన్న ముద్దుబిడ్డగా.. జగనన్న సోదరిగా.. వైఎస్ విజయమ్మ పుత్రికగా ప్రజాభిమానం పొందిన వైఎస్ షర్మిల ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాలు మరోవైపు టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ షర్మిల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండటంతో సంపూర్ణ మద్దతు పలికేందుకు అనంతపురం జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు.
వైయస్ షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఓ మహిళగా షర్మిల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టడం చరిత్రాత్మకమని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పాదయాత్రలో షర్మిలకు జనం నీరాజనాలు పలుకుతుండటంతో కాంగ్రెస్, టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. 

Back to Top