ప్రపంచస్థాయి కుంభకోణం

()స్విస్ చాలెంజ్ వెనుక అంతులేని అవినీతి
()రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
()సింగపూర్ కంపెనీలతో కలిసి సీక్రెట్ గా దోపిడీ

అమరావతి: రాజధాని ముసుగులో టీడీపీ సర్కార్ విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోంది. పేరుకే ప్రపంచస్థాయి రాజధాని అమరావతి. అక్కడ జరుగుతున్నదంతా ప్రపంచస్థాయి కుంభకోణమే. ప్రధాన రాజధాని కేంద్రంలో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ర్ట ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనే ఈ కుంభకోణంలో కీలకం. సింగపూర్ సంస్థలను ఎంపిక చేయడానికి కావలసినట్లుగా నిబంధనల్లో మార్పులు చేర్పులు చేయడం, ఓ మేనేజ్‌మెంట్ కంపెనీతో మొత్తం వ్యవహారాన్ని నడిపించేలా పథకం పన్నడం వంటి ఎన్నో కుట్రలు ఇందులో కనిపిస్తాయి. 
 
 రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఇది. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని చదును చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటారు. కోర్ కేపిటల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. కోర్ కేపిటల్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. అదీగాక సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అయితే పైసా ఖర్చు చేయని సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటా, రూ.5,721.9 కోట్లు ఖర్చు చేసే రాష్ర్టప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటాగా నిర్ణయించారు. ఇవన్నీ దోపిడీకి మార్గాలు. 
 
పైసా పెట్టుబడి లేకుండా రూ.కోట్లలో లాభాలు
సింగపూర్ కంపెనీలు ఎకరానికి రూ.4 కోట్లకన్నా అదనంగా ఎంతకు అమ్మినా ప్రభుత్వ ప్రమేయం ఉండదు. రైతుల భూములతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసి, ఆ తర్వాత వచ్చే లాభాల నుంచి ఆ మొత్తాన్ని కట్టనున్నారు. 1,691 ఎకరాల్లో లేఔట్ వేసి, ప్లాట్లను ఏర్పాటు చేసి థర్డ్‌పార్టీకి విక్రయిస్తారు. వాటిని ఎంతకైనా, ఎవరికైనా విక్రయించవచ్చు. ఉదాహరణకు ఎకరం విస్తీర్ణంలో ప్లాట్లను మార్కెటింగ్ కంపెనీ రూ.10 కోట్లకు విక్రయించింది అనుకుందాం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఎకరానికి రూ.నాలుగు కోట్ల బేసిక్ ధరను చెల్లిస్తాయి. మార్కెటింగ్, ప్రచారం, ఇతర వ్యయాలను కూడా మార్కెటింగ్ కంపెనీ మినహాయించుకుం టుంది. ఆ తర్వాత ఎవరి వాటాలు వారు తీసుకుంటారు. అంటే సింగపూర్ సంస్థలు పైసా పెట్టుబడి పెట్టకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేసి లాభం పొందబోతున్నాయన్నమాట.
 
 సీల్డ్ కవర్ మోసం
సీడ్ కేపిటల్‌ను అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలకు ఇస్తున్న 1,691 ఎకరాల్లో ఎకరానికి రూ.4 కోట్లను బేసిక్ ధరగా రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సింగపూర్ కంపెనీలు ఈ బేసిక్ ధరకు అదనంగా ఎంత ఇస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవి కోట్ చేసిన మొత్తాన్ని సీల్డ్ కవర్‌లో ఉంచారు. ఈ మొత్తం ఎంత అనేది తెలిస్తేనే కదా అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడేది. ఇలా సీల్డ్ కవర్‌లో ఉంచడానికి సింగపూర్ కంపెనీలను అనుమతించడంలోనే పెద్ద మోసం దాగి ఉంది. ఈ సీల్డ్ కవర్ వ్యవహారంపైనే హైకోర్టులో కేసు నడుస్తోంది.
 
 మార్కెటింగ్ కోసం మేనేజ్‌మెంట్ కంపెనీ
 అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ (ఏడీపీ)లో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం, కేపిటల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి ఉన్నా.. అంతా సింగపూర్ కంపెనీలు చెప్పినట్లే జరుగుతుంది. స్విస్ చాలెంజ్ విధానంలో  నిర్వహణ బాధ్యత అంతా చూడడం కోసం ఓ మేనేజ్‌మెంట్ కంపెనీని నియమించనున్నారు. మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఆస్తుల నిర్వహణతోపాటు లేఔట్లు, ప్లాట్లకు సంబంధించి ప్రచార కార్యక్రమం కూడా ఇదే నిర్వహిస్తుంది. ఇందుకయ్యే ఖర్చులన్నింటినీ ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఏయే ఖర్చులుంటాయో, వాటికి ఎంతెంత చెల్లించాలో కూడా ఆ ప్రతిపాదనల్లో ప్రస్తావించారు. ఇవన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని సింగపూర్ కంపెనీలు 58 శాతం, రాష్ర్ట ప్రభుత్వం 42 శాతం తీసుకుంటాయి. ఈ మేనేజ్‌మెంట్ కంపెనీ ఫీజుల కింద భారీ మొత్తాన్నే వసూలు చేయనున్నారు.
 
 సింగపూర్ సంస్థలతో ముందే లాలూచీ
 ‘స్విస్ చాలెంజ్’ విధానంపైనా, సర్కారు పాటిస్తున్న గోప్యతపైనా ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మొట్టికాయలు వేయడంతో అన్ని వివరాలను బయట పెడతామని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత సీఆర్‌డీఏ ఇచ్చిన వివరణ చూస్తే సింగపూర్ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే లాలూచీ పడినట్లు అర్థమవుతుంది. సీడ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ సూచించిన కంపెనీలను నియమించేందుకు రాష్ర్టప్రభుత్వం తొలిదశలోనే అంగీకరించిందని సీఆర్‌డీఏ ప్రకటన బయట పెట్టింది. ఆ ఒప్పందంలో భాగంగానే సింగపూర్ కంపెనీల కన్సార్టియంను ఎంపిక చేసేందుకు రాష్ర్టప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దాని ప్రకారమే సింగపూర్ కన్సార్టియం రాష్ర్టప్రభుత్వానికి తన ప్రతిపాదనలు సమర్పించింది. వాటినే ప్రభుత్వం సుమోటో ప్రతిపాదనలని చెబుతోంది. ప్రభుత్వంతో సంబంధాలు లేని కంపెనీలు ప్రతిపాదనలు ఇస్తే వాటిని స్వచ్ఛందంగా ఇచ్చినట్లు భావించవచ్చు.

కానీ, రెండేళ్ల నుంచి రాజధానిపై రాష్ర్టప్రభుత్వంతో ఎడతెరపి లేకుండా చర్చలు జరుపుతున్న సింగపూర్ కంపెనీలిచ్చిన ప్రతిపాదనలను సుమోటో ప్రతిపాదనలని ఎలా చెప్పగలం? 2014 నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, సీఆర్‌డీఏ అధికారులు పలుమార్లు సింగపూర్ వెళ్లి ఆ కంపెనీలతో చర్చలు జరపడం, ఒప్పందాలు చేసుకోవడం తెలిసిన విషయాలే. అవే కంపెనీలు అనేకసార్లు రాష్ట్రానికి వచ్చి చర్చలు జరిపాయి. దీనిని బట్టే ముందుగానే లాలూచీ పడ్డారని స్పష్టంగా అర్థమవుతోంది. 
Back to Top