సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా..?

కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా మాట్లాడితే, ఆయన పాలనలో మహిళలకు భద్రత ఉన్నట్టా లేనట్టా?
ఆడవాళ్లు ఇంట్లో పార్క్ చేసిన కారులా ఉండాలి, వాళ్లు బయటకెళితే యాక్సిడెంట్లు కాకపోతే ఇంకేమవుతాయి? అని సాక్షాత్తూ రాష్ట్ర శాసనసభ స్సీకర్ మీడియా ముందే చులకనగా మాట్లాడితే... అలాంటి ప్రభుత్వం మహిళలకి భద్రత ఇస్తున్నట్టా? చులకనగా వదిలేస్తున్నట్టా?

పాలించే వాళ్లు, బాధ్యతగా ఉండి భద్రతను చూసుకోవాల్సినవాళ్లే రోడ్డుమీద నోటికొచ్చినట్లు పేలితే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? వీళ్ల ఆలోచనలు ఇలా ఉండడం వల్లే, బాబుగారి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. అధికార దాహంతో వళ్లు తెలియకుండా విర్రవీగుతున్న ప్రజా ప్రతినిధులు కూడా నడిరోడ్డుమీద మహిళలపై, అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. తమ అవినీతికి అడ్డొస్తే అంతు చూస్తామంటూ పబ్లిక్‌గా బెదిరిస్తున్నారు. ఇలాంటి తుచ్ఛమైన తమ్ముళ్లతో తులతూగుతున్న టిడిపి ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు, అరాచకాలు, అన్యాయాలు జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలి. సభ్యసమాజానికి చంద్రబాబు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు..? ప్రభుత్వాన్ని నడిపించేవాడే మహిళల్ని చులకనచేసి మాట్లాడుతుంటే,  తమ్ముళ్లు దిగజారుడుకి అడ్డేలేకుండా పోయింది.  మహిళలపై లైంగిక వేధింపులు, దాడుల్లో ఎపిని నెంబర్ 1గా నిలబెట్టే దిశగా బాబు పాలన సాగిస్తుండడం సిగ్గుచేటు. 

 దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఇలాంటి కేసుల్లో 12.4 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అత్యధిక క్రైం రేటు విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎపిని అగ్రభాగాన నిలబెట్టడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం . లైంగిక వేధింపులు, మహిళలపై దాడుల్లో 60 శాతం నిరుపేద మహిళలపైన, 20 శాతం ఐటి ఉద్యోగులపైన, 20 శాతం మిగిలిన వర్గాల్లో ఉన్న మహిళలపైన జరుగుతున్నాయని రికార్డులు చెబుతున్నాయి. మరోపక్క ఎపి కొత్త రాజధాని చుట్టుపక్కల విచ్చలవిడిగా జరుగుతున్న కాల్ మనీ దందాలో కూడా ఎంతమంది మహిళల్ని అన్యాయంగా బలిపశువుల్ని ఏవిధంగా చేశారో ఆ మధ్య అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం చెబితే విన్నాం. ఇప్పుడు ఏకంగా ప్రపంచం మొత్తానికి తెలిసేలా బాబుగారి ఘనకార్యం కాస్తా క్రైం రేటులో, వేధింపులు కేసుల లెక్కల్లో కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా సరే ఒక్కరోజు కూడా మహిళల భద్రత గురించిగానీ, జరుగుతున్న వేధింపులు, దాడులగురించి గానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. తెలుగింటి ఆడపడుచులు అని నోరారా పిలిచిన ఒక నాయకుడు స్థాపించిన జెండాకింద... ఈ రోజు జరుగుతున్న ఘోరాలు రేపటి టిడిపి పతనానికి ద్వారాలు.

Back to Top