తపన నుంచి పుట్టిన ఆలోచనలు

‘‘తపన ఉంటే ఆలోచనలు అవే వస్తాయి. ఈ రాష్ట్రం మనది.. వాళ్లకేదో చేస్తామన్న విశ్వాసంతో ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అన్న తపన ఉంటే ఆలోచనలు అనంతంగా వస్తాయి’’ - డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.
ఈ మాటలు రాజశేఖరరెడ్డి ఏదో యథాలాపంగా అనలేదు. ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర తరువాత 2004లో అధికారంలోకొచ్చి సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో అక్షరాలా వాటిని నిజం చేసి చూపించారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. ఆయనను విమర్శించే వారు ఎలా ఉన్నా దేశంలోనే ఆ మాట కొస్తే ప్రపంచంలోనే ఐదేళ్ల స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన రాజకీయ నాయకులు మరొకరు లేరు. మానవుడికి కావాల్సింది ప్రధానంగా తినడానికి తిండి, ఉండటానికి వసతి, ఆ తరువాత విద్య, వైద్యం.. ఈ నాలుగు అవసరాలనూ వైఎస్ తన ప్రాధాన్యతల్లో పెట్టుకున్నారు. ఆ దిశగానే సంక్షేమ పథకాల రూపకల్పన చేశారు. వాటిలో ఉచిత విద్యుత్ అనేది ఓ సంచలనాత్మక, చరిత్రాత్మక నిర్ణయం. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలారేసుకునేందుకే పనికి వస్తాయని ఎగతాళి చేసిన వారూ ఉన్నారు. కానీ ఆచరణలో ఉచిత విద్యుత్ ఇవ్వడం సుసాధ్యమని చేసి చూపించి ప్రణాళికా సంఘాన్నే ఆశ్చర్యపోయేలా చేశారు వైఎస్.
పేదలకు వరం.. ఆరోగ్యశ్రీ: మహానేత అమలు చేసిన మరో విప్లవాత్మక పథకం ఆరోగ్యశ్రీ. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఈ పథకం నిజంగా వరమే! ఖరీదైన కార్పొరేట్ వైద్యం పొందలేని పేదలెందరో ఈ పథకం వల్ల లాభపడ్డారు. లక్షలాది మంది ఉత్తమ సేవలు పొంది తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు. వృద్ధాప్య పెన్షన్లు, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు లాంటి ఎన్నో పథకాలు వైఎస్ ఆచరణ లోకి తెచ్చారు. నిరంతరం దుర్భిక్షానికి గురవుతున్న రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి సాగునీటి వనరులు సృష్టించాలన్న దృక్పథంతోనే ఆయన భారీ ఎత్తున జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండుటెండల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ వైఎస్ చేసిన 1,475 కిలోమీటర్ల పాదయాత్ర అనుభవాలే ఈ పథకాలు రూపొందించడానికి ఆయనకు ప్రేరణగా నిలిచాయి.
అందరికీ వృద్ధాప్య పెన్షన్: పాదయాత్ర చేస్తున్నపుడు వృద్ధులు వైఎస్‌ను కలిసి ఆశీర్వదిస్తూ తమకు పెన్షన్ లేదని మొరపెట్టుకున్నారు. పెన్షన్ పొందుతున్న ఒక వృద్ధురాలు, లేదా వృద్ధుడు మృతి చెందితేనే కొత్త వారికి ఆ పెన్షన్ మంజూరు చేయాలనేది ఆనాటి ఎన్.చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఉన్న నిబంధన. ఈ నిబంధనలో ఎంత అమానవీయత ఉందో తెలుసుకుని వైఎస్ చలించి పోయారు. వృద్ధులందరికీ పెన్షన్లు ఇవ్వడం ఎంత అవసరమో ఆయన ఆనాడే నిర్ధారించుకున్నారు. అందుకే ఒకరి స్థానంలో మరొకరికి కాకుండా సంతృప్త స్థాయి ప్రాతిపదికన ఎంతమంది అర్హులో అందరికీ ఈ పథకం వర్తింపజేయగలిగారు.

ఫీజుల రీయింబర్సుమెంటు పథకమూ అంతే!
అధిష్టానంతో వాదించి.. ఉచిత విద్యుత్: వైయస్ పాదయాత్ర చేపట్టేనాటికి రైతులు నైరాశ్యంలో ఉన్నారు. నిరంతర దుర్భిక్షంతో విద్యుత్ బకాయిలు చెల్లించలేకపోయిన రైతులను దొంగలుగా పరిగణిస్తూ అప్పటికే మోటార్లను తీసుకెళ్లారు. ఇది చూసే ఆయన ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా చివరకు అధిష్టానం తొలుత ఒప్పుకోక పోయినా పదే పదే వారితో వాదించి ఉచిత విద్యుత్తు పథకాన్నిఎన్నికల ప్రణాళికలో చేర్చగలిగారు. 2009లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొన్ని రోజులపాటు విద్యుత్ సమస్యలు తలెత్తినా వైయస్ వెనుకంజ వేయకుండా యూనిట్ రూ.8 చొప్పున కొనుగోలు చేసి ఆ పథకాన్ని కొనసాగించగలిగారు. ఆయన చేపట్టిన చర్యల వల్లనే వ్యవసాయరంగంలో గణనీయమైన పురోగతి కనిపించింది.
ప్రతి మహిళనూ లక్షాధికారిని చేయాలని: ఒక కుటుంబం బాగుండాలంటే ఆ ఇంటి గృహిణి మోముపై చిరునవ్వు ఉండాలని వైయస్ అభిలషించే వారు. అందుకే ఆయన మహిళా సాధికారత కోసం విరివిగా పావలా వడ్డీలు ఇచ్చారు. ప్రతి మహిళనూ లక్షాధికారి చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. రైతు రుణ బకాయిలను మాఫీ చేయాలని ఆయన అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లపాటు పోరాడారు. మొత్తంమీద ప్రధాని 2009లో అంగీకరించి దేశ వ్యాప్తంగా రూ.74 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. వైఎస్ చేసిన కృషి ఫలితంగానే దేశవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది రైతులకు ఈ పథకం కింద రుణాలు మాఫీ అయ్యాయి. ఇలాంటి పథకాలన్నీ చేపట్టేందుకు.. ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆయనకు ప్రేరణగా నిలిచింది.

Back to Top