రాష్ట్ర వ్యాప్తంగా తాంత్రిక పూజలు..?

– చంద్రబాబు రంగంలోకి దిగాక నోరు మెదపని ఆలయ కమిటీ సభ్యులు
– దేశ ప్రథమ మహిళను చేర్చి తప్పించుకునే కుట్ర 


దుర్గ గుడిలో క్షుద్ర పూజల కేసును నిజనిర్ధారణ కమిటీ పేరుతో ప్రకాశం బ్యారేజీలో నిమజ్జనం చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. చంద్రబాబు ఆదేశాలతో పనులు ఊపందుకున్నాయి. వివాదం పెద్దది కావడంతో టీడీపీ ఉలిక్కిపడింది. బాబు ఆదేశాలతో కథ సిద్ధం చేశారు. సీసీ కెమెరాలలో క్షుద్రపూజలు జరిగినట్టు వీడియోలు బయటికొచ్చాయి. లోకేష్‌ను సీఎం చేయడానికే పూజలు చేశామని కూడా అర్చకుడు సృజన్‌ తన బంధువులకు, స్నేహితులకు చెప్పాడని వార్తలొచ్చాయి. ఆలయ పాలకమండలి కూడా తాంత్రిక పూజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూజలు నిజమేనంటూ కమిటీ సభ్యులు గగ్గోలు పెట్టారు. శారదా విద్యాపీఠం అధిపతి స్వరూపానంద స్వామి వంటి వారు ఆవేదన వెళ్లగక్కారు. ఆలయాల్లో క్షుద్ర పూజలకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. చంద్రబాబు సర్కారు పరువు కృష్ణాలో కలిసిపోయింది. సొంత ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించడానికి వెన కాడని చంద్రబాబు ఇష్యూలోకి రాష్ట్రపతి భార్యను తీసుకొచ్చారు. దేశ ప్రథమ మహిళ రాకకోసం ఆలయాన్ని శుద్ధి చేస్తున్నామంటూ నిజాలకు నిప్పు పెట్టి బూడిద చేసే స్కెచ్‌ సిద్ధం చేశారు. అప్పటిదాకా గరంగరంగా ఉన్న ఆలయ కమిటీ సభ్యుల మాటలకు ఒక్కసారిగా ఎక్కడా వినిపించడం లేదు. ఆ వెంటనే నిజనిర్ధారణ కమిటీ పేరుతో మరో కొత్త నాటకానికి తెరతీశారు. ఇక షరా మామూలుగానే నిజనిర్థారణ కమిటీ అంటే ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తుందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. సీఐడీ మీదనే నమ్మకం లేని పరిస్థితుల్లో నిజనిర్ధారణ కమిటీ నివేదికలతో అద్భుతం జరుగుతుందనుకుంటే అంతకంటే పిచ్చి నమ్మకం లేనట్టే. రెండేళ్ల క్రితం గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోతే ఇప్పటికీ కమిటీ నివేదిక ఇచ్చింది లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో నిజాలు తెలుస్తాయని నమ్మకం ఎవరికీ లేదు. కాకపోతే తెలియాల్సిందల్లా ఇంకా ఏయే ఆలయాల్లో నిర్వహించారోనని. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయని వార్తలొచ్చిన తర్వాత శ్రీకాళహస్తి అనుబంధంగా ఉన్న కాలభైరవ ఆలయంలో కూడా పూజలు జరిగినట్టు వార్తలు వెలుగు చూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎన్ని ఆలయాల్లో పూజలు జరిగాయో త్వరలోనే బయట పడక మానదు.  
Back to Top