ఈ సారి మోసపోవటం వేరుశనగ రైతులది

అనంతపురం: చంద్రబాబు పాలనలో రైతులకు దక్కేది అన్యాయం మాత్రమే. చివరకు మిగిలేది ఆవేదన మాత్రమే. ఈ సారి వేరుశనగ రైతులు అన్యాయం అయిపోతున్నారు.

అనంతపురం జిల్లాలో వ్యవసాయం అంటే వానదేవుడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే. ఒకవైపు కరవు, విత్తనాలకొరత, ఎరువుల దగా వంటివన్నీ దాటుకొని వేరుశనగ రైతులు పంట పండించారు. దిగుబడి అర కొరగానే వచ్చినా అమ్ముకొని కష్టాలు తీర్చుకొందామనుకొంటే మార్కెట్ లో దళారులు చుక్కలు చూపిస్తున్నారు. అంతకుముందు దాకా మూటకు (దాదాపు 45కిలోల బరువు) రూ. 2,500 రేటు పలికేది. దీంతో కొంతలో కొంత గిట్టుబాటు అయ్యేది. కోతలన్నీ పూర్తయ్యి రైతులంతా పంటను తీసుకొని మార్కెట్ కు వెళుతున్న సమయం వచ్చింది. దీంతో దళారీలు కుమ్మక్కై రేటు దించేశారు. మూటకు రూ. 1,500 కంటే ఎక్కువ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో రైతుల కన్నీరు ఆగటం లేదు.

ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే ఇప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి. మూటకు 15 వందలకు అమ్ముకొంటే నష్టాలు తప్పవని ఘొల్లుమంటున్నారు. దీనిమీద స్పందించేందుకు ప్రభుత్వం తరపున ఎవరూ సిద్దంగా కనిపించటం లేదు. దీంతో అయినకాడికి అమ్ముకొని రైతులు బతుకు జీవుడా అంటూ బయలు దేరుతున్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, దానికి తమదే పూచీ అని చంద్రబాబు పదే పదే హామీలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. అసలు రైతుల గురించి పట్టించుకోనే పట్టించుకోవటం లేదు. రైతుల అంశాల్ని గాలికి వదిలేసి అమరావతి.. సింగపూర్ లావాదేవీల్లో మునిగి తేలుతున్నారు. రైతుల గురించి ఆలోచన చేయాల్సిన వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు పూర్తిగా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు లాక్కోవటం తప్ప మరో అంశమే పట్టించుకోవటం లేదు. దీంతో రైతుల గోడు అరణ్య రోదన అవుతోంది.
Back to Top