షర్మిలకు కష్టాల గాధలు చెప్పుకున్న కంచర్లు

కె. కోటపాడు (విశాఖ జిల్లా) :

కె. కోటపాడు.. అంటే కంచర్ల కోటపాడు. వందేళ్ల చరిత్ర ఈ ఊరిది. ఇత్తడి బిందెలు, డేగిసాలు తయారు చేస్తుంటారు. అందుకే ఈ ఊరు ‘కంచర్ల’ కోటపాడు అయింది. భార్యా భర్త ఇద్దరూ కలిసి పని చేసినా రోజు కూలీ రూ.150-200 కి పైన వచ్చే పరిస్థితి ఉండదు. బ్రతుకు పోరాటంలో ఇబ్బందులు తప్పదు. ఇవీ కె.కోటపాడు బజారువీధిలో నివాసం ఉంటున్న కంచర్ల బాధలు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిల కె.కోటపాడు వచ్చినపుడు కంచర్లు ఆమెను కలిసి చెప్పుకున్న కష్టాలు ఇవి.

మహానేత వైయస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు తమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, రూ.100 కోట్లతో ప్రత్యేకంగా జిఓ నంబర్ 26 కూడా విడుదల చేశారని వారు శ్రీమతి షర్మిలకు చెప్పారు. ప్రస్తుత పాలకులు ఆ జిఓను నిలిపేశారని వాపోయారు. విజయనగరం సహా ఇతర ప్రాంతాల నుంచి ఇత్తడి సామానులు తయారు చేసేందుకు ముడిసరుకును తెప్పించాల్సి వస్తోందని, రవాణా వ్యయం పెరిగిపోయిందన్నారు. ఆర్థిక స్థోమత అంతగా లేని కారణంగా వ్యాపారుల చేతిలో పడి చితికిపోవాల్సి వస్తోందని వాపోయారు. ఇంటిల్లిపాదీ కలిసి పనిచేసినా కుటుంబ ఖర్చులకు సరిపోవడం లేదని కె. మాణిక్యం, ఎం. లక్ష్మణరావు చెప్పారు.

బిందెల కింద మట్టె‌లను గతంలో చేతితోనే తయారుచేసే వాళ్లం అని, ఇప్పుడు విద్యుత్ యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, విద్యుత్ సరఫరాలో అంతరాయం, అధిక బిల్లుల కారణంగా నష్టపోతున్నామని వెంకటరావు, రామకృష్ణ శ్రీమతి షర్మిలకు చెప్పారు. సుమారు 200 కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడుతున్నాయని, తమ కష్టాలు మీరైనా తీర్చాలని కోరారు.

కంచర్ల కష్టాలు విని స్పందించిన శ్రీమతి షర్మిల స్పందిస్తూ... త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న అందరికీ మంచి చేస్తారని, అంతా ఆయనను ఆశీర్వదించాలని అన్నారు. ఇంటిలో ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యత జగనన్న తీసుకుంటారని, మంచి రోజులు వస్తాయని చెప్పారు. శ్రీమతి షర్మిల స్పందనతో కంచర్లంతా సంతోషం వ్యక్తం చేశారు. మరుక్షణం జై జగన్ నినాదాలతో‌ పరిసరాలు మారుమోగిపోయాయి.

Back to Top