సమస్యలు వింటూ... భరోసా ఇస్తూ...

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తమ ముందుకు వస్తున్న షర్మిలకు వివిధ వర్గాల ప్రజలు కష్టాలు, కడగండ్లు, సమస్యలు చెప్పుకుని ఊరడిల్లుతున్నారు. మహిళలు, రైతులు, చిన్నారులు, విద్యార్థులు షర్మిలకు బాధలు చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాలకు నోచుకోనివారు, రేషన్‌కార్డు కోసం మూడేళ్ళుగా తిరుగుతున్న గ్రామాల ప్రజలు, రేషన్‌ కార్డులు లేక ఆరోగ్యశ్రీ సేవలు పొందలేకపోతున్నవారు, తాత్కాలిక రేషన్‌ కార్డుల వల్ల ఫీజు రీయింబర్సుమెంట్‌కు దూరమవుతున్నవారు, విద్యుత్‌ సమస్యతో ఇక్కట్ల పాలవుతున్నవారు, పింఛన్లు అందక అల్లాడుతున్నవారు ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది షర్మిలకు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న రైతులు, దప్పికైతే గుక్కెడు తాగునీరు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, రహదారి సౌకర్యం లేక నానా అగచాట్లు పడుతున్న గ్రామాల ప్రజలు ఆమెకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వారందరి బాధలను శ్రద్ధగా వింటున్న షర్మిల త్వరలోనే జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వస్తుందని, ఇబ్బందులన్నీ తొలగిపోతాయంటూ ధైర్యాన్ని, భరోసా ఇస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారు.

వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లెలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఉన్న మైనార్టీ గురుకుల విద్యాలయంలోకి శుక్రవారం ఉదయం షర్మిల ఆకస్మికంగా వెళ్ళారు. విద్యార్థులతో ముఖాముఖీ ముచ్చటించారు. షర్మిలకు విద్యార్థులు తమ సమస్యలు వివరించి, గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం అమ్మయ్యగారిపల్లెకు చేరుకున్న షర్మిలకు అక్కడి మహిళలు తాము ఎదుర్కొంటున్న దుర్భరమైన సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మూడేళ్ళుగా తమ జీవితాలు దుర్భరంగా మారిపోయాయని, ఇలా ఇబ్బందులతో బతికే కంటే పురుగుమందు తాగి చచ్చిపోవాలనిపిస్తోందని వారు విలపించారు. సమస్యలు చెప్పుకుందామనుకుంటే కాంగ్రెస్‌ నాయకులు కార్లలోంచి కాళ్ళు బయట పెట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు మరణమే పరిష్కారం కాదని, అందరి సమస్యలు తీరేందుకు త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని వారికి షర్మిల ధైర్యం చెప్పారు.

పాదయాత్ర కత్తులూరుకు చేరుకున్నప్పుడు గ్రామ శివారులో గొర్రెలను కాస్తున్న మల్లకాని సిద్దయ్య కొడుకు శివ అనే చిన్నపిల్లవాడి దగ్గరకు వెళ్ళిన షర్మిల వెళ్ళి బడికి ఎందుకు పోలేదని అడిగారు. షర్మిల అలా అడిగే సరికి శివ కన్నీళ్ళు పెట్టుకుంటూ తన కుటుంబం ఆర్థిక పరిస్థితి, తండ్రి అనారోగ్యం తనకు చదువుకోవాలని ఉన్నా గొర్రెలను కాయక తప్పనిసరి పరిస్థితిని వివరించాడు. శివ పరిస్థితి విన్న షర్మిల ఒక్కసారిగా చలించిపోయారు. ఇలాంటి చిన్నారుల కోసమే, వారి కుటుంబాలకు ఆసరా కల్పించేందుకే తన అన్న జగన్‌ 'వైయస్‌ఆర్‌ అమ్మ ఒడి పథకం' ఏర్పాటు చేస్తానని పార్టీ ప్లీనరీలోనే ప్రకటించారని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించేందుకు జగనన్న రూపకల్ప చేశారని వివరించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి తల్లీ తన పిల్లాడిని ఎల్‌కెజి నుంచి పదవ తరగతి వరకూ చదివించడానికి ఆ తల్లి బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 500లు జమ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇంటర్‌లో చేర్పిస్తే రూ.700లు, డిగ్రీ చదివిస్తే వెయ్యి రూపాయల చొప్పున తల్లి ఖాతాలో వేస్తామని చెప్పారని తెలిపారు. బాలలకు పూర్తిగా ఉచిత విద్య అందిస్తామన్న జగన్‌ మాటను షర్మిల చెప్పి భరోసా ఇచ్చారు. ఇద్దరు పిల్లలను బడికి పంపించినందుకే తల్లులకు ఈ ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు వివరించడం అందరినీ ఆకర్షించింది. మీ లాంటి వారి కోసమే త్వరలోనే సువర్ణయుగం వస్తుందని భరోసా ఇస్తూ ప్రజాప్రస్థానం కొనసాగిస్తున్నారు.

షర్మిల పాదయాత్ర ముందుకు సాగుతుండగా వేంపల్లెలో పలువురు వృద్ధ మహిళలు ఆమెకు ఎదురువచ్చారు. మహానేత వైయస్‌ దయ వల్ల తమకు వృద్ధాప్య పింఛన్‌ వచ్చిందని, మరి కొందరు గత మూడేళ్ళుగా దరఖాస్తు చేసుకుంటున్నా అతీ గతీ లేదని మరి కొందరు చెప్పారు. కత్తులూరు గ్రామ మహిళలు షర్మిలకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. సాగునీరు లేక తమ పొలాలు ఎండిపోతున్నాయని, బోర్లలో నీళ్ళున్నా విద్యుత్‌ సరఫరా లేక వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ కోసం దరఖాస్తు చేస్తే రేషన్‌కార్డు తెమ్మంటున్నారని, అయితే తమకు తాత్కాలిక రేషన్‌ కార్డులు మాత్రమే ఇవ్వడంతో ఫీజు ఎలా కట్టాలో తెలియక అవస్థలు పడుతున్నామని కొందరు విద్యార్థులు షర్మిల ముందు బోరుమని విలపించారు. తమ గ్రామంలో విద్యుత్‌ సరఫరా మూడు గంటలు కూడా ఉండడం లేదని, దీనితో అరటి పంట ఎండిపోతున్నదని, ఆర్థికంగా తాము కొలుకునే పరిస్థితి కనిపించడంలేదని అరటి రైతులు ఆవేదనతో షర్మిలకు చెప్పారు.

పులివెందుల మండలం ఎర్రగడ్డపల్లె వాసులు తమకు తాగడానికి కూడా నీళ్ళు లేవని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగాల్సిన దుస్థితి ఎందురైందని బాధపడ్డారు. తాము తాగడానికి నీళ్ళు లేక అల్లాడుతుంటే ఇక పశువుల, మేకలు, గొర్రెలకు ఎక్కడి తేవాలో తెలియక అగచాట్లు పడుతున్నట్లు చెప్పారు. ఎరువులు అందడంలేదని కొందరు రైతులు షర్మిలకు ఫిర్యాదు చేశారు.

వారి గోడు విన్న షర్మిల స్పందిస్తూ, వానలు వస్తున్నా విద్యుత్‌ లేదని, ప్రలజకు కంటి నిందా నిద్ర లేదని, రోడ్లు లేవని, ప్రజల జీవితం దుర్భరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తోందన్నారు. నిద్రపోతున్నవారినన్నా లేపవచ్చు, కానీ నిద్ర నటిస్తున్నవారిని లేపలేం. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్య ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అస్సలు విద్యుత్తే ఉండని పరిస్థితిపై ఆమె విచారం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను లూటీ చేస్తున్నారని షర్మిలకు పలువురు చెప్పుకున్నారు. కాంగ్రెస్, ‌టిడిపిలను నమ్ముకుంటే నట్టేట ముంచుతాయని, ఆ పార్టీల నాయకులను నమ్మవద్దని షర్మిల హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌, టిడిపిలకు బుద్ధిచెప్పండి అని షర్మిల పిలుపునిచ్చారు. మన కష్టాలు తీర్చి, కన్నీళ్ళు తుడిచే రాజన్న రాజ్యం వస్తేనే ఈ సమస్యలకు విరుగుడు లభిస్తుందని చెప్పారు. జగనన్న సారథ్యంలో రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుందని భరోసా ఇస్తున్నారు. రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నను ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తూ ముందుకు వెళుతున్నారు.

తాళ్లపల్లెలో దెబ్బతిన్న వేరు శెనగపంటను షర్మిల పరిశీలించారు. పామూరు గ్రామానికి షర్మిల పాదయాత్ర చేరుకున్నప్పుడు ఆ గ్రామ వాసులు తమ కష్టాలు వెళ్ళబోసుకున్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారని, వెళ్ళారని, తమ సమస్యలు వినలేదని, పట్టించుకోలేదని తెలిపారు. వేరుశెనగ, పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయని చెప్పుకున్నారు. మహానేత వైయస్‌ బ్రతికి ఉంటే తమకు ఇలాంటి దుస్థితి దాపురించేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్ధమయ్యామని, రాజన్న రాజ్యం వస్తుందని, కష్టాలు తీరతాయని తామంతా ఆతృతగా ఎదురుచూస్తున్నామని అన్నారు.

దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా ప్రసిద్ధి పొందిన నందిపల్లె సమీపంలోని పులివెందుల జెఎన్‌టియు కళాశాల విద్యార్థులు పాదయాత్ర సందర్భంగా షర్మిలకు తమ గోడు వినిపించారు. ఈ కళాశాలలో చదువుతున్నతమకు ఉద్యోగ అవకాశాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలోని జెఎన్‌టియులో చదివిన వారికి అవకాశాలు వస్తున్నాయని, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తమ కళాశాలలో సరైన బోధనా సిబ్బంది లేరని, నాణ్యమైన విద్యుత్‌ తమకు అందడంలేదని వాపోయారు. కరెంటు లేని కారణంగా ల్యాబ్‌ ప్రాక్టికల్సు జరగడంలేదని చెప్పారు. ఒక్కో విద్యార్థికి 15 ల్యాబ్‌ ప్రాక్టికల్సు జరగాల్సి ఉండగా 3 కూడా అవడంలేదని, ఈ కారణంగా కూడా తమకు ఉద్యోగావకాశాలు దూరమైపోతున్నాయని దుఃఖంతో చెప్పుకున్నారు.

ఇలా తన ముందుకు వస్తున్నవివిధ వర్గాల ప్రజల సమస్యలను శ్రద్ధగా వింటున్న షర్మిల వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తూ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు.

Back to Top